Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న వయసులో ఉద్యోగమొస్తే ఆ సంతృప్తే వేరు. 20-25 ఏండ్లకే తమకు ఆర్థిక స్వేచ్ఛ లభించిందని, ఎవరిపైనా ఆధారపడకుండా తమ కనీస అవసరాలు తీర్చుకోవచ్చని సంబర పడిపోతుంటారు చాలామంది. ఈ అత్యుత్సాహంతో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంటారు. ఫలితంగా భవిష్యత్‌లో తమ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అలా జరగకూడదంటే ఆ పొరపాట్లేంటో తెలుసుకొని సరిదిద్దుకోమంటున్నారు నిపుణులు...
కొంతమందికి ఇటు చదువు పూర్తికాగానే.. అటు ఉద్యోగమొచ్చేస్తుంటుంది. ఇలా చిన్న వయసు ఉద్యోగస్థుల్లో రెండు రకాలుంటారు. మొదటి రకం ఉద్యోగులు... అతిగా అంకితభావం ప్రదర్శిస్తూ అన్ని పనులు తామే పూర్తిచేస్తామన్న అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. రెండో రకం ఉద్యోగులు... వచ్చిన ఉద్యోగాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో నిమగమైపోయి కెరీర్ అభివృద్ధిని విస్మరిస్తుంటారు. నిజానికి ఈ రెండూ పొరపాటే అంటున్నారు నిపుణులు. కాబట్టి అత్యుత్సాహం మాని.. మనకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేయడం, ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. అటు కొత్త అవకాశాల్ని అందుకోవడం.. ఇలా రెండూ బ్యాలన్స్ చేసినప్పుడే చిన్న వయసులో ఉద్యోగం వచ్చినందుకు పూర్తి సార్థకత దక్కుతుందంటున్నారు నిపుణులు. మరోవైపు ఉద్యోగంలోనూ ఉన్నతి సాధించవచ్చంటున్నారు.
పలు కారణాల రీత్యా చిన్న వయసులో ఏదో ఒక ఉద్యోగంలో చేరే వారు కొందరైతే.. తాము లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగం సాధిస్తుంటారు మరికొందరు. దీంతో 'నేను అనుకున్న ఉద్యోగం వచ్చింది.. ప్యాకేజీ బాగానే వస్తుంది.. ఈ జీవితానికి ఇది చాలు' అంటూ అక్కడితోనే సంతృప్తి పడుతుంటారు. దాంతో ముందు ముందు మంచి అవకాశాలు వచ్చినా వదులుకునే వారూ లేకపోలేదు. ఇలా అందివచ్చిన అవకాశాన్ని కాదనుకుంటే.. కెరీర్లో అభివృద్ధి సాధించలేమంటున్నారు నిపుణులు. కాబట్టి నిత్య విద్యార్థిగా ఉంటూ.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు కొత్త అవకాశాల్ని అందుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలంటున్నారు. అప్పుడే కెరీర్లో ఉన్నతి సాధించచ్చు.
చిన్న వయసులో ఉద్యోగం రావడంతో పాటు జాబ్‌లో చేరిన కొత్తలో.. వృత్తిధర్మానికి సంబంధించిన పూర్తి అవగాహన చాలామందిలో ఉండకపోవచ్చు. దీనివల్ల కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా తమ సృజనాత్మక ఆలోచనలు, పనితీరు, చేరుకున్న లక్ష్యాలకు సంబంధించిన వివరాలన్నీ.. తమ బృంద సభ్యులు, బాస్‌కు వివరిస్తుంటారు. అయితే ఇలా నోటి మాటగా చెప్పడం కంటే ప్రతిదీ ఈ-మెయిల్ రూపంలో వారికి పంపించడం, వాటికి సంబంధించిన సాఫ్ట్‌కాపీలు మీ సిస్టమ్‌లో ఓ ఫైల్లో పొందుపరచుకోవడం.. వంటివి చేస్తే మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు. ప్రతికూల సమయం ఎదురైనప్పుడు, పనికి తగ్గ ప్రతిఫలం దక్కకపోయినా ఈ రుజువులే మీ ఉద్యోగానికి భరోసా కల్పిస్తాయి. పైగా మీరు ఇలా సిన్సియర్‌గా పనిచేస్తే.. భవిష్యత్‌లో ఉన్నత అవకాశాలూ మీ తలుపు తడతాయి.