Authorization
Tue April 01, 2025 03:43:05 pm
పిల్లల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అయితే ఇది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు కదలకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో మలబద్ధకం రావడానికి గల ముఖ్య కారణాలు, దీనిని నివారించే మార్గాల గురించి తెలుసుకుందాం.
కారణాలివే
శారీరక శ్రమ లేకపోవడం, ఆటలాడకపోవడం, ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం
నీళ్లు సరిగా తాగకపోవడం
జంక్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం
రాత్రిపూట ఆలస్యంగా తినడం
అర్ధరాత్రి వరకు మేల్కోవడం
సమయానికి తినకపోవడం, క్రమం తప్పిన ఆహారపు అలవాట్లు
సరిగా నిద్ర పట్టకపోవడం
జీవక్రియల పనితీరు సరిగ్గా లేకపోవడం
హెల్దీ డైట్ పాటించకపోవడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం.
నివారణా మార్గాలు
ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పిల్లలతో తాగించాలి.
రాత్రి నీటిలో నానబెట్టిన నాలుగైదు ఎండు ద్రాక్షలను ఉదయం లేవగానే తినిపించాలి.
గోరువెచ్చని పాలల్లో అర టీస్పూన్ ఆవు నెయ్యి కలిపి రాత్రిపూట పడుకునే ముందు పిల్లలకు అందించాలి.
ఇంగువను పేస్ట్‌లాగా తయారుచేసుకుని పిల్లల బొడ్డు చుట్టూ సవ్యదిశలో రాయాలి. దీనివల్ల వారిలో అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
పచ్చి ఆహార పదార్థాలను పిల్లలు జీర్ణం చేసుకోలేరు. కాబట్టి వారికి ఉడకబెట్టిన, వండిన ఆహార పదార్థాలనే అందించాలి.
పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, నూనెల మోతాదును బాగా తగ్గించాలి.
వివిధ రకాల వ్యాయామాలు చేయడంతో పాటు ఆటలు ఆడేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వాకింగ్, రన్నింగ్ లాంటివి అలవాటు చేయాలి.