Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాగితాలతో అలంకరణలు మన చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఇంట్లో ఏ వేడుక జరిగినా కాగితాల కత్తిరింపుల మాలలే ఎక్కువగా ఇంటినిండా అలంకరించేవారు. మా ఇంట్లో మా పుట్టిన రోజులకు మా వరండా అంతా రంగు కాగితాలతో మురిసి పోయేది. ఏ పండుగైనా, వేడుకైనా రంగు కాగితాల తోరణాలే ముస్తాబు. స్కూళ్ళలో కూడా కాగితాన్ని మడతలు వేసి కత్తిరించే విధానాలు చూపిస్తూ చాలా మంది కళాకారులు వచ్చేవారు. వారు నిమిషాల్లో అందమైన తోరణాలుగా మారుస్తుంటే ఆశ్చర్యంగా పిల్లలంతా చూస్తుండేవారు. సినిమాహాళ్ళ దగ్గర కూడా ఇలాంటి కాగితాల కత్తిరింపులతోనే అలంకారం చేసేవారు. ఇళ్ళలో అంటే పెంకుటిళ్ళు గుడిసెలు ఉండేవి కదా! అందులో దూలాలకు ఈ కాగితాల కత్తిరింపులు ఎంత శోభనిచ్చేవో. పెండిండ్లకు సైతం కొందరు వీటినే ఉపయోగించేవారు. ఇళ్ళ మధ్యలో పెట్టుకునే తడికెలకు సైతం ఇలాంటి కాగితాలను అతికించేవారు. ద్వారాలకు, కిటికీలకు అతికిస్తే గాలికి ఊగుతూ వయ్యారాలు పోతుండేవి. పాత సినిమాలలో వీటి గొప్పదనం కనిపిస్తుంది.
బాతులు తయారు చేద్దాం
కత్తెర, తెల్ల కాగితాలు దగ్గర పెట్టుకుంటే బాతును తయారు చేయవచ్చు. ఎ4 సైజులో ఉన్న కాగితాన్ని నిలువుగా మధ్యకు మడవాలి. ఇలా మడిచిన కాగితాన్ని కింద పెట్టుకుని పెన్సిల్‌తో బాతు బొమ్మను వెయ్యాలి. పొడుగ్గా ఉన్న కాగిత భాగమంతా బాతు రెక్కల వలె సన్నని గీతలు గీసుకోవాలి. ఇప్పుడు కత్తెర తీసుకొని బాతు బొమ్మలా గీసిన గీతల వెంట కత్తిరిస్తూ పోవాలి. ఇలా రెండు మడతల మీద బాతు ఆకారం వస్తుంది. ఇలా కత్తిరించాక మడత విప్పి ఈ కాగితాన్ని తిరగేసి మడత వేయాలి. ఇప్పుడు సన్నని చీలికలుగా వచ్చిన గీతలు తిరగేసిననపుడు ఉబ్బెత్తుగా వస్తాయి. ఇప్పుడు తల భాగంలో రెండుగా విభజింపబడి ఉంటాయి. కాబట్టి ఈ రెండు తలలను ఫెవికాల్తో అతికించి వేయాలి. చీలికలు, చీలికలుగా బాతు తోకలు వస్తాయి. తల భాగంలో ముక్కు భాగానికి ఎర్రని కాగితం కత్తిరించి అతికించాలి. అలాగే కన్ను కోసం గుండ్రని కాగితంపై నల్లని మచ్చ పెట్టి కన్ను భాగంలో అతికించాలి. పొడవుగా చీలికలుగా ఉన్న కాగితాన్ని గుండ్రంగా చుట్టి తల కింది భాగానికి తెస్తే శరీరం వస్తుంది. దీనికి గట్టిగా పిన్ను కొట్టాలి. చీలికల తోకల శరీరంతో, ఎర్ర ముక్కున్న బాతు తయారవుతుంది.
ఎర్రని గులాబీ
గులాబీ పువ్వు కోసం ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు కాగితాలు తెచ్చుకుంటే చాలు. ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి. జినియా పూలకయితే పసుపు, నారింజ, వంగ రంగులు అయితే బాగుంటుంది. మొదటగా గులాబీని చేద్దాం. ఎరుపు రంగు కాగితాన్ని తీసుకుని నాలుగు మడతలు వేసి హృదయాకారంగా కత్తిరించాలి. మడతలు వేయడం ఎందుకంటే ఒకేసారి నాలుగు రేకలు వస్తాయని. అలా పదిహేను, ఇరవై రెక్కలు కత్తిరించి పక్కన పెట్టుకోవాలి. ఆకుపచ్చ రంగు కాగితాన్ని గుండ్రంగా చుట్టి ఫెవికాల్తో అతికించాలి. ఇది గులాబీ పువ్వు కాడగా పనికొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కాడకు హృదయాకారపు రేకల్ని చుట్టుకోవాలి. ఒకదాని పక్కన మరొకటి పెట్టుకుంటూ చుడుతూ ఫెవికాల్తో అతికించడమో, టేప్‌తో చుట్టుకుంటూ రావడమో చేయాలి. మొత్తం రెక్కలు పెట్టేశాక గులాబీ పువ్వు ఆకారం వస్తుంది. ఇప్పుడు కాడకు రెండు ఆకులు పెట్టేస్తే సరిపోతుంది.
జినియా పువ్వు
సన్నగా పొడవుగా కాగితాన్ని కత్తిరించి మధ్యకు మడవాలి. దీనిని ఒకవైపు నుంచి సన్నని చీలికలుగా కత్తిరించుకుంటూ రావాలి. అంటే చివర్లు తెగిపోకుండా అతుక్కునే ఉండాలి. అప్పుడే పువ్వు చేయడానికి వీలవుతుంది. ఇలా కత్తిరించాక మడిచిన పేపర్‌ను విడదీసి తిరగేసి మరల మడవాలి. ఇలా చేస్తే ఉబ్బుగా వచ్చి పువ్వు అందంగా వస్తుంది. ఒక కాడకు కత్తిరింపు కాగితాన్ని గుండ్రంగా చుడితే కత్తిరించిన చీలికలు విడివడి అందంగా పువ్వు వలె వస్తుంది.
కొబ్బరి చెట్టు నాటుకుందాం
మా ఇంట్లో ఖాళీలేదు అలాంటి చెట్లకు అనుకుంటున్నారా? దీనికి ఖాళీ ఏమీ అవసరం లేదు. కాగితం కొబ్బరి చెట్టును నాటుకుందాం సరేనా! పేపర్ కప్పును పొడుగ్గా ఉండే కాఫీకప్పును తీసుకొని దాంట్లో చిన్న చిన్న సన్నని గులకరాళ్ళు వేయాలి. అంటే చెట్టు నిలబడటానికి అన్నమాట. ఇప్పుడు ఆకుపచ్చ రంగు కాగితంతో గులాబీ కాడను చేసినట్టుగా చెయ్యాలి. దీన్ని పక్కన పెట్టి కొబ్బరి ఆకుల్ని చెయ్యాలి. వేలెడంత పొడవులో కాగితాన్ని కత్తిరించి నిలువుగా మడతేయాలి. దీన్ని ఆకు ఆకారంలో కత్తిరించి మధ్యలో ఒక పుల్లను పెట్టి అతికించాలి. కొబ్బరాకు మట్టను చేస్తున్నామన్నమాట. ఆకు ఆకారంలో ఉన్న కాగితాన్ని సన్నని చీలికలుగా కత్తిరిస్తే కొబ్బరాకులా వస్తుంది. ఆకులు పది, పన్నెండు చేసి పెట్టుకోవాలి. ఇంతకు ముందు చేసుకున్న కాడకు ఒక్కో ఆకును పెట్టి చుట్టుకుంటూ రావాలి. మొత్తం ఆకులు చుట్టేసరికి కొబ్బరి చెట్టు ఆకారం వచ్చేస్తుంది. ఈ చెట్టును ఇంతకు ముందు చేసిన కప్పులో నిలబెట్టాలి. రెండు కొబ్బరి చెట్లను తయారు చేసి టీపారు మీద పెడితే అందంగా ఉంటుంది. అవసరమైతే కొబ్బరి కాయల్ని కూడా పెట్టుకోవచ్చు.
గోడకు అతికించుకుందాం
ప్రముఖమైన హౌటళ్ళలో టీ కప్పుల కిందా, స్నాక్స్ పెట్టే ప్లేట్లో అలంకరించడానికి డిజైన్ కట్ చేసిన పేపర్స్ పెడుతున్నారు. నేను చాలా సేకరించాను. ఆ డిజైన్ కత్తిరించిన నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చుకుంటాను. కానీ చాలా సార్లు కాఫీ కప్పు తడితో తడిచిపోయి ఉంటాయి. బిస్కెట్లు పెట్టిన ప్లేటు కిందవి మాత్రం ఇంటికి తెచ్చుకుంటాను. ఎంత అద్భుతంగా ఉంటాయని. చిన్నతనంలో స్కూల్లో కత్తిరించిన కత్తిరింపులు గుర్తుకొచ్చి బాల్యంలోకి వెళతాను. అలాంటి కత్తిరింపునొకటి చూద్దాం. అందరికీ తెలిసినే కాకపోతే గుర్తు చెయ్యటమే. ఒక తెల్లని కాగితాన్ని తీసుకుని అనేక మడతలు వేసి చివర గుండ్రంగా కత్తిరిస్తే డిజైన్ గుండ్రటి కాగితంలా వస్తుంది. అప్పుడు మధ్య మధ్య రంధ్రాలు రకరకాల ఆకారాలు వచ్చేలా కత్తిరిస్తే అందమైన డిజైన్ వస్తుంది. ఇలాంటి పేపర్లను గోడకు అతికించుకోవచ్చు.
తామరపువ్వులు చేసేద్దాం
మనుషులు, పెద్ద చెట్లు, బిల్డింగులు, యంత్రాలు వంటి వాటిని కత్తిరించి వాటిని క్రమపద్ధతిలో మడిచి పుస్తకాలలో పట్టేలా డిజైన్లు చేస్తుండడం నేను చైనా దేశంలో చూశాను. కొనుక్కోవాలనుకున్నాను. కానీ చాలా ఖరీదు ఉండడంతో కొనలేదు. ఇలాంటి పేపర్లతో చేసే బిల్డింగుల్నే మాజిక్ వాళ్ళు వాళ్ళ మాయలో ఉపయోగిస్తారు. మనమైతే ఇప్పుడు మన జాతీయ పుష్పమైన తామరపువ్వుల్ని చేసేద్దాం. 9 సెం.మీ పొడవు, 9 సెం.మీ వెడల్పు ఉండే నలుచదరపు కాగితాన్ని తీసుకుని మడిచి ఎనిమిది రెక్కలు వచ్చేలా కత్తిరించాలి. గులాబీరంగు కాగితాన్ని వాడితే బాగుంటుంది. ఐదారు కాగితాలు కత్తిరించి పెట్టుకోవాలి. ఒక్కోకాగితాన్ని మరో కాగితంపై పెట్టి అతికించుకుంటూ పోవాలి. ఐదారు వరసల్లో అతికిస్తే గుబురుగా అనిపిస్తుంది. తామర పువ్వు తయారైంది. మధ్యన ఒక పూస అతికిస్తే సరిపోతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్