Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భాషా పరిశోధనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముప్ఫై మందికి పైగా పరిశోధనా విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. సంగీతం, నృత్యం, వాద్య పరికరాల గురించి పరిశోధన చేసి ఆ కళల గురించిన ఎన్నో కొత్త విషయాలను బయటకు తీసుకొచ్చారు. రెండు పీహెచ్‌డీలు చేశారు. డి. లిట్ డిగ్రీ చేసి వాచస్పతి బిరుదును పొందిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎనభైకిపైగా పత్రసమర్పణలు, పదికి పైగా జాతీయ సెమినార్లు నిర్వహించిన గొప్ప ఘనత ఆమెది. వారే ఆచార్య కె.కుసుమారెడ్డి(కుసుమాబాయి). తెలుగుయూనివర్సిటీచే మాతృవందనం పురస్కారం పొందిన వారి పరిచయం వారి మాటల్లోనే.
మీరు చేస్తున్న సాహిత్య సేవకు పునాది వేసిన మీ స్ఫూర్తిదాయకమైన బాల్యం గురించి వివరిస్తారా?
చిన్నతనం నుండి నాకు స్ఫూర్తి మా నాన్నగారు జయరామిరెడ్డి. ఆయన తెలుగు పండితులు. హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యారు. మంచి కవి. చదవంటే ఆయనకు చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో అమ్మాయిలు పెద్దగా చదువుకునేవారు కాదు. నన్ను చూసి చాలామంది కాలేజీకి రావడం మొదలుపెట్టారు. హైస్కూల్ చదువు అయిపోయిన తర్వాత కాలేజీలో బీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చేరాను. బీఎస్సీలో చదివేటపుడు తెలుగు సాహిత్యంపై అభిరుచి ఉండేది. ఎప్పుడూ తెలుగు గురించే ఆలోచించేదాన్ని. దాంతో ఎమ్మే తెలుగు చేస్తానంటే మా నాన్న ఒప్పుకున్నారు. 'జయరామిరెడ్డి గారు మీ అమ్మాయి తెలుగు చదివితే ఉద్యోగాలు రావు కదా' అంటూ కొంత మంది అంటే పుస్తకాలు రాసి మంచి పేరు తెచ్చుకుంటుంది అని సమాధానం చెప్పారు. అయితే తెలుగు తీసుకొని ఏదో సాధిస్తానని ఆయనా అనుకోలేదు, నేనూ అనుకోలేదు. అలా నాన్న ప్రోత్సాహంతో ఎమ్మే ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను.
తర్వాత ఎంఫిల్, పీహెచ్‌డీలు కూడా చేశారు.. వాటి గురించి..?
నాకున్న ఆసక్తితోనే చేశాను. అయితే అసలు ఎంఫిల్ చేయాలని నేను ముందు అనుకోలేదు. బిరుదురాజు రామరాజు గారు నన్ను ప్రోత్సహించారు. పీహెచ్‌డి పూర్తి చేసే సమయంలోనే ఎంఫిల్, హీహెచ్డీ వచ్చేలా నేను చూస్తాను అన్నారు. అయితే ఏ అంశంపై ఎంఫిల్ చేయాలో ఆలోచిస్తుంటే నిడదబ్రోలు వెంకటరావుగారు ఓ సలహా ఇచ్చారు. తెలుగు సాహిత్యంలో కనకాభిషేకం చేయించుకున్న వారి గురించి చెప్పుకోవాలంటే మొదటగా శ్రీనాధుడు గురించే చెబుతారు. అయితే తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీలలో మొట్టమొదట కనకాభిషేక సత్కారం పొందిన కవయిత్రి రంగాజమ్మ. ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె గురించి ఎంఫిల్ చేస్తే బాగుంటుందన్నారు. ఆయన సలహా బాగా నచ్చింది. అలా ఎంఫిల్ 'రంగాజమ్మ కృతుల్లోని భాష'పై పరిశోధన చేశాను. ఆమె గురించి ఎన్నో విషయాలు బయటి ప్రపంచానికి చెప్పగలిగాను. అమెకు సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా, స్ఫూర్తిదాయకంగా అనిపించింది.
ఆమె గురించి తెలుసుకోవడానికి తంజావూరు వెళ్ళినట్టున్నారు?
అక్కడికి వెళ్ళకుండా ఆమె గురించి రాయలేము. తంజావూరు గ్రంథాలయానికి వెళ్ళి చాలా విషయాలు సేకరించాను. సమాచారం కోసం అక్కడే కొంత కాలం ఉండి వచ్చాను. అక్కడ మూడు వేలకుపైగా తాళపత్రాలు తెలుగులో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ముద్రితమయ్యాయి. ఆమె రాసిన యక్షగానం ప్రింట్ కాలేదు. అదంతా నేను చేతిరాతలో రాసుకుని వచ్చాను. అప్పుడే సంగీతం, నృత్యానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు నాదృష్టికి వచ్చాయి. ఆ ఆసక్తితో నాయకరాజులు సంగీత, నృత్యాలకు చేసిన సేవలు గుర్తించి ఒక పుస్తకం రాయాలనుకున్నాను. అప్పుడే రెండవ పీహెచ్‌డీకి 'ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్'లో అప్లయి చేశాను. ఆ డిపార్ట్మెంట్ నుండి నాయకరాజులు పోషించిన సంగీత, నృత్య రీతుల గురించి పరిశోధన చేసి రెండవ పీహెచ్‌డీని పొందాను.
మీ మొదటి పీహెచ్డీ విశేషాలు మాతో పంచుకుంటారా?
నా మొదటి పీహెచ్డీ 'మడికి సింగన కృతుల పరిశీలన'. మడికి సింగన గొప్ప కవి. ఈయన గురించి కూడా సాహిత్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన్ని పరిచయం చేస్తే బాగుంటుందని రామరాజు గారు సలహా ఇచ్చారు. లోకానికి తెలియని వారిని పరిచయం చేయడమంటే నాకూ చాలా ఆసక్తి. అందుకే అంగీకరించాను. ఆయన తెలంగాణలోని రామగిరిదుర్గం పరిపాలించిన ముప్పభూపతి ఆస్థాన కవి. మొత్తం నాలుగు గ్రంథాలు రాశారు. వాటన్నింటిని అధ్యయనం చేసి పీహెచ్డీ పూర్తి చేశాను. ఇది అలా పూర్తయిందో లేదో వెంటనే ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది.
యూజీసీ ప్రాజెక్టులు కొన్ని చేశారు కదా, వాటి గురించి..?
తెలుగులో పద్యరూపంలో రచింపబడిన శాస్త్ర గ్రంథాలన్నింటినీ పరిశోధించి యూజీసీ ప్రాజెక్ట్‌గా 'శాస్త్ర గ్రంథ సమాలోచనం' అనే గ్రంథాన్ని రాసి ప్రచురించాను. నేను ఏది చేసినా సంగీతం, నృత్యం, కళలపై ఉన్న ఆసక్తితోనే చేశాను. మన తెలుగు రాష్ట్రాలలో కూచిపూడి, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కాస్త పేరిణి నృత్యం కనిపిస్తాయి. కానీ పురాతన పుస్తకాల్లో చూస్తే ఎన్నో రకాల నృత్య రీతులు ఉన్నాయి. వాటి గురించి ఎవరికీ తెలియదు. కేళికా నృత్యాలు అనేవి ఇప్పుడు అసలు లేవు. వీటిపైనే యూజీసీ రెండో ప్రాజెక్ట్. 'తెలుగు నృత్య కళా సంస్కృతి' పేరుతో గ్రంథంగా ముద్రించాను. ఈ గ్రంథానికే తెలుగు యూనివర్సిటీవారు ఉత్తమ గ్రంథ పురస్కారం ఇచ్చారు.
పరిశోధనా విద్యార్థులకోసం మీరేమైనా పుస్తకం రాశారా?
ప్రొ.కులశేఖర్రావుగారు పిల్లలకు ఉపయోగపడే గ్రంథం ఒకటి రాయమన్నారు. ఏం రాస్తే బాగుంటుంది అంటే పిల్లలకు ఉపయోగపడేలా పరిశోధనా గ్రంథాలు ఎలా రాయాలి, పరిశోధన ఎలా చేయాలి అనే దాని గురించి రాస్తే బాగుంటుంది అన్నారు. అయితే అంత పెద్ద పని చేయడం నా వల్ల కాదు అంటే ఇద్దరం కలిసి రాద్దాం అన్నారు. అదే 'తెలుగు పరిశోధనా పద్ధతులు (రీసర్చ్ మెథడాలజీ) అనే గ్రంథంగా వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 20 పుస్తకాలు రాశాను. అందులో రెండు నవలలు ఉన్నాయి. అందులో ఒకటి పొట్టిశ్రీరాములుగారి గురించి ఒక నవల. రంగాజమ్మ గురించి రెండో నవల.
హిందీపై కూడా మీకు పట్టు వున్నట్టుంది?
విశారద పూర్తి చేశాను కాబట్టి హిందీ మాట్లాడగలను. కానీ హిందీలో ఏమీ రాయలేదు. సంస్కృతంలో మాత్రం డి.లిట్ డిగ్రీకి ఓ గ్రంథం రాశాను. అదే ''నాట్య శాస్త్ర దిశా, రసతత్త్వ పరంపరాయాహా: సమీక్షణం''. దీనికే వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ వారు డి.లిట్ డిగ్రీ, వాచస్పతి అనే బిరుదు ఇచ్చారు. దీన్ని పొందిన మొదటి వ్యక్తి నేనే.
జాతీయ స్థాయిలో తెలంగాణ నుండి ఓ ఫెలోషిప్‌కు ఎంపికైన ఏకైక మహిళగా కూడా మీరున్నారు. ఆ వివరాలు చెప్పండి?
ఇది కూడా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 29 రాష్ట్రాలకుగాను 10 అవార్డులు మాత్రమే ఉంటాయి. అలాంటిది మన తెలంగాణ నుండి నాకు ఈ అవార్డు పొందే అవకాశం వచ్చింది. ఇది చరిత్రకు సంబంధించింది. 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చ్' అనే సంస్థవారు సీనియర్ అకడమిక్ ఫెలో అనే అవార్డులు ప్రకటించారు. 'తెలంగాణ గిరిజనుల సంస్కృతి, సంగీతం, నృత్యం, సంగీత వాద్యాలు' అనే అంశంపై పరిశోధన చేయడానికి ఫెలోషిప్‌ను అందించారు. ఆ సందర్భంగానే గిరిజన ప్రాంతాలన్నీ తిరిగాను. వాళ్ళ అనుభూతులు, వారి అతిధ్యాలు, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ ప్రేమ చూసినపుడు చాలా గొప్పగా అనిపించింది. ఆదిలాబాద్‌లో కొమరంభీం మ్యూజియంతో పాటు ఆయన మనవరాలిని కూడా చూశాను. అక్కడ ఉన్న అనేక జాతుల వారిని కలిశాను. వాళ్ళ పాటలు, సంస్కృతి, నృత్యాలు, వాద్యాలు అన్నింటి గురించి సేకరించాను. అవన్నీ కలిపి గ్రంథంగా తీసుకొచ్చి ఫెలోషిప్‌కు సమర్పించాను.
భాష, కళలు, శాస్త్ర పరిశోధనలు చేశారు. మూడింట్లో మీకు బాగా నచ్చిన అంశం?
కళలంటేనే బాగా ఇష్టం. ఎందుకంటే సాహిత్యానికి సంబంధించి ఎంత లోతుకు వెళ్ళిన ఇప్పుడు తెలుసుకున్న దాని కంటే ఎక్కువగా తెలుసుకోలేము. అదే కళలైతే లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే కళలంటే అందులోనూ నృత్యం, వాయిద్య పరికరాలంటే చాలా మక్కువ. నా మెదుడు ఎప్పుడూ వీటి గురించే ఆలోచిస్తుంది.
పరిశోధనా విద్యార్థులతో మీరు ఎంతో స్నేహభావంతో ఉంటారని విన్నాము. ఆ వివరాలు చెబుతారా?
అవును నిజమే. పిల్లలతో నేను అలాగే ఉంటాను. ముఖ్యంగా అప్పట్లో పిల్లలకు కల్చర్ టూర్స్ ఉండేవి. పిల్లలు వాటికి వెళ్ళడానికి చాలా ఇష్టపడేవారు. వాళ్ళతో ఒక మగ ప్రొఫెసర్, ఒక ఆడ ప్రొఫెసర్ కచ్చితంగా వెళ్ళాలి. అప్పట్లో మహిళా ప్రొఫెసర్స్ తక్కువ మంది ఉండే వాళ్ళం. ఉన్నవారు కూడా టూర్లకు వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. దాంతో పిల్లలు వచ్చి నన్ను రమ్మనమని అడిగేవారు. నాకూ ఎలాగో కొత్త ప్రదేశాలు చూడడం ఇష్టం, అందులోనూ ఆడపిల్లలు ఉంటారు కాబట్టి నేనూ వెళ్ళేదాన్ని. ఆ సమయంలో వారికి కావల్సిన ఏర్పాట్లు అన్నీ నేనే చూసుకునేదాన్ని. వారికి ఒక ప్లాన్ చెప్పి అలా ఫాలో అవ్వమని చెప్పేదాన్ని. అలా నాకు పిల్లలతో బాగా చనువు వుండేది. సుమారు 70 మంది వరకు టూర్లకు వచ్చేవారు. అలా ఒక సారి కన్యాకుమారి వెళ్ళాము. ఆ యాత్రా విశేషాలనే 'కన్యాకుమారి దీపకళిక' అనే గ్రంథంగా ముద్రించాను.
ఇప్పటి వరకు మీరు నిర్వహించిన బాధ్యతలు?
ఉస్మానియా యూనివర్సిటీలో 30 ఏండ్లు పని చేసి ప్రొఫెసర్‌గా, తెలుగు శాఖా అధ్యక్షురాలిగా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆర్జీయూకేటీ ఐఐఐటి మూడు సెంటర్లకు తెలుగు ప్రొఫెసర్‌గా, కో - అర్డినేటర్‌గా పని చేశాను. అలాగే ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంటర్ బోర్డులో పాఠ్యప్రణాళిక సంఘం సభ్యురాలిగా కూడా ఉన్నాను.
మీరు పొందిన అవార్డుల గురించి..?
వాటి గురించి కచ్చితంగా చెప్పాలంటే గుర్తు లేవు. ఎన్నో కాలేజీల వారు భాషా, మహిళా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎన్నో సన్మానాలు చేశారు. అన్నింటికంటే వాచస్పతి పురస్కారం అత్యంత గొప్పది. అలాగే జాతీయ స్థాయిలో పొందిన సీనియర్ అకడమిక్ ఫెలో, తెలుగు యూనివర్సిటీవారు ఇచ్చిన ఉత్తమ గ్రంథ రచయిత్రిగా ఇచ్చినవి ముఖ్యమైనవి.
మీ భవిష్యత్ ప్రణాళిక..?
త్వరలో గిరిజనుల సంస్కృతికి సంబంధించిన ఒక పుస్తకం ఇంగ్లీష్‌లో, తెలుగులో తీసుకురాబోతున్నాను. ఆ తర్వాత రాయడం ఆపేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే డిజిటల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మరుగుపడి ఉన్న తాళపత్ర, ప్రాచీన గ్రంథాలే కాకుండా అన్నీ గ్రంథాలు డిజిటల్ రూపంలోకి తీసుకురావాలని నా కోరిక. ఇలా చేస్తే అవి అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలి. అప్పుడే సాధ్యమవుతుంది.
- అయినంపూడి శ్రీలక్ష్మి