Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెదురుగొమ్ముల శిల్ప... కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు... తరతరాలకి తరగని సిరులవుతారు.. అన్న మాటలను అక్షరాలా నిజం చేసిన మహిళా పారిశ్రామికవేత్త. రాళ్ళలో నిదురపోతున్న బొమ్మలకు ప్రాణం పోసే వ్యక్తి. పట్టు పురుగులను పెంచి పట్టుదారం తీసే శిల్పి. పేరుకు తగినట్టుగా తన జీవనాన్ని అద్భుతంగా మలుచుకొని అనతి కాలంలోనే అందరి మన్ననలకు పాత్రురాలైన ఆమె విజయ ప్రస్థానం నేటి మానవిలో...
శిల్ప తల్లితండ్రులు నిర్మల, పొనుగోటి వెంకటేశ్వరరావు. వీరి స్వస్థలం సూర్యాపేట. భర్త నెదురుగొమ్ముల రవీందర్ రావు. వీరికొక పాప లక్ష్మీ శివాని. రైతు కుటుంబంలో పుట్టిన శిల్ప పల్లెటూరు వాతావరణంలో పెరిగి డిగ్రీ వరకు చదివారు. మొదట్లో చీరల వ్యాపారం చేసారు. ఇంకా ఏదో చేయాలనే తపన తనలో ఆరాటపెడుతుండగా భిన్నంగా చేయగలిగిన వ్యాపారాలేమిటి అన్న దిశలో తన ఆలోచనలను కొనసాగించారు. డెయిరీ పెట్టుకుందామా అనుకున్నారు. అది నడపడం కొంచం కష్టమనిపించింది. అప్పట్లో ఈమో ఫామ్స్ నడుస్తున్నాయి. ఒక ఫామ్ తీసుకుని మనం ఏదైనా చేయగలమా అని భర్తతో కలిసి బాగా ఆలోచించారు.
స్వయంగా పరిశీలించి
చుట్టు పక్కల గ్రామాల్లో ఫామ్స్‌లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ముందుగా పరిశీలించారు. అక్కడ కొందరు సెరికల్చర్ చేయడం శిల్ప దృష్టిని బాగా ఆకట్టుకుంది. పట్టుపురుగుల పెంపకం, వాటి నుంచి పట్టును వెలికి తీసే ప్రక్రియను సెరికల్చర్ అంటారు. సెరికల్చర్ చాలా దేశాల్లో ముఖ్యమైన దేశీయ పరిశ్రమ. ఈ పెంపకం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు స్వయంగా ప్రతిరోజూ పట్టుపురుగుల పెంపకం చేస్తున్న ప్రాంతాలకు వెళ్ళి బాగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఒక రైతు తన పొలంలో ఈ పెంపకంతో నెలకు లక్షరూపాయలు సంపాదించడం చూసాక మొదట కొన్ని ఎకరాల భూమి ఈ పెంపకానికి కావలసిన ప్రధానమైన వనరుగా భావించారు. వెంటనే సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని ఎకరాలు స్థలం సేకరించే పనిని ప్రారంభించారు.
శిక్షణ తీసుకుని
తిమ్మాపురంలో తొమ్మిది ఎకరాల స్థలం కొనుగోలు చేసి తమ వ్యాపారం ఆ గ్రామం నుంచే మొదలు పెట్టారు. మొదట ఆ భూమి మల్బరి సాగుకు అనుకూలంగా ఉందో లేదో అని సాయిల్ టెస్ట్ చేయించారు. వ్యాపారం చేయాలనే సంకల్పం బలంగా ఏర్పరచుకున్నాక పనితనం, పట్టుదల కలిగిన శిల్ప అందులో నైపుణ్యాలను ఆకళింపు చేసుకోవాలనుకున్నారు. మల్బరి సాగు, పట్టుపురుగుల పెంపకం ఎలా చేయాలో బెంగుళూరుకు వెళ్ళి శిక్షణ తీసుకున్నారు. ఇందుకు వి హబ్ అనే సంస్థ వారు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు శిల్పకు అకౌంటింగ్, మార్కెటింగ్, బ్యాంకింగ్ వంటి అంశాలపై అవగాహనకు, క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి తోడ్పడ్డాయి.
తెలంగాణలో మొదటి మహిళగా...
రెండు ఎకరాల పొలంలో నెలకు 60 నుంచి 70 వేల వరకు సంపాదించ వచ్చని గ్రహించిన శిల్ప స్వయంగా కొన్నాళ్ళు మల్బరి మొక్కల పెంపకం చూసి పట్టుపురుగుల పెంపకం మొదలు పెట్టారు. 2014లో మొదలు పెట్టిన మొదటి సాగులో శిల్పకు వచ్చిన మొదటి లాభం నలభై వేలు. తర్వాత క్రమంగా పెంపకాన్ని దశల వారీగా పెంచుకుంటూ వచ్చారు. పట్టు పరిశ్రమలో ఛాకీ ప్రధాన ఘట్టం. ఉష్ణోగ్రత, తేమ, పారిశుధ్యం వీటిని గమనిస్తూ ఉండాలి. నాణ్యమైన మల్బరీ ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వాలి. ఇందుకోసం ఆటోమేటిక్ రీలింగ్ మిషన్ అవసరం ఎంతైనా ఉంది. ఈ మెషీన్‌ని ప్రభుత్వ సబ్సిడితో కొనుగోలు చేసిన తెలంగాణలోనే మొదటి మహిళ శిల్ప.
ఒక ఛాలెంజింగా...
ఒక తల్లి తన పిల్లలను సరైన పోషక పదార్థాలు పెట్టి పెంచితే ఆరోగ్యవంతంగా బిడ్డ ఎలా ఎదుగుతుందో అలాగే పట్టుపురుగులను కూడా నాణ్యమైన మల్బరీ ఆకులను దశలవారీగా అందజేస్తూ, ఎటువంటి తేడా లేకుండా తగిన ఉష్ణోగ్రత మధ్య పెంచితే మంచిగా ఎదుగుతాయి. దానికోసం రేరింగ్ షెడ్ ఏర్పాటు చేయాలి. పట్టుపురుగులకు వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఛాకీ పద్ధతి ద్వారా పట్టుపురుగులను పెంచి పట్టుగూళ్ళు అల్లడానికి అనువైన స్థలం, వాతావరణం, వెలుతురు అందించాలి. అప్పుడే సరైన పట్టుగూళ్ళు చేతికి వస్తాయి. మార్కెట్‌కి పంపేటపుడు కూడా గూళ్ళు చెదరకుండా పంపాలి. ఇక తగిన ధరను అందుకోవడంతో ప్రక్రియ ముగుస్తుంది. అన్ని దశలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన చర్యలు చేపట్టాలి. ఇంత కష్టాన్ని తన రోజు వారి జీవితంలో భాగం చేసుకుని భర్త సహాయ సహకారాలతో పనిచేస్తుంది శిల్ప. ఈ మొత్తం ప్రక్రియలో కావలసిన చోట పనివాళ్ళను పెట్టుకుని వారికి జీతాలు ఇస్తూ ఒక ఛాలెంజింగా పట్టుపురుగుల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు శిల్ప.
మహిళలు ముందుకు వస్తే...
''మగవారు రైతులుగా పంటలను పండిస్తున్నారు. మల్బరీ సాగులో పట్టుపురుగుల పెంపకంలో పట్టుగూళ్ళ తయారీ ద్వారా నేను మహిళా రైతుగా, రైతే రాణిగా నిలబడ్డాను. నాలాగా మరికొందరు మహిళలు ముందుకు వస్తే వారికి పట్టుపురుగుల పెంపకంలో మెళుకువలను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తాను'' అంటూ ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు శిల్ప. ఆమె పనితనాన్ని ప్రశంసిస్తూ ఎన్నో అవార్డులు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ జ=జ అవార్డు, ఉత్తమ రైతు, రైతు మిత్ర అవార్డులను మహిళా రైతుగా సెరికల్చర్ చేస్తూ శిల్ప అందుకున్నారు.
సమయం వృధా చేసుకోవద్దు
సేంద్రీయ పద్ధతిలో పట్టుపురుగులను పెంచి పట్టుదారం ఉత్పత్తికి దోహదం చేసే ఎస్.ఆర్. సిల్క్ నిర్వహణలో శిల్ప నైపుణ్యం కొత్తగా పట్టుపురుగుల పెంపకం చేపట్టే వారందరికీ మార్గదర్శకం. మహిళలు ఏ రంగంలో నైనా రాణించగలరు అని నిరూపిస్తూ పట్టుపురుగుల పెంపకంలో తనదైన విశిష్ట స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. పనిచేయాలన్న ఉత్సాహం, సాధించాలన్న పట్టుదలతో పాటు టీవీలు చూస్తూ సమయం వృధా చేయకుండా సమాజానికి పనికొచ్చే పనులపై దృష్టి పెడితే మనం ఏదైనా సాధించవచ్చంటారు శిల్ప.
వి హబ్ కృషి గొప్పది
శిల్ప జీవనం స్ఫూర్తిదాయకం. మహిళలకు చిన్న వయసులోనే పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్న వి హబ్ వారి కృషి ఎంతో గొప్పది. పట్టుపురుగుల పెంపకంలో నాణ్యమైన పట్టుదారం అందించే పట్టుగూళ్ళ తయారీ పరిశ్రమ సర్వదా ప్రశంసనీయం. శిల్ప ఏర్పరిచిన బాటలో మరెందరో మహిళలు ముందుకు సాగి పట్టుపురుగుల పెంపకంలో మంచి అభివృద్ధిని సాధించాలని మనసారా కోరుకుందాం.
నా కంటూ ఓ గుర్తింపు
''మొదట చేసిన చీరల వ్యాపారం నాకు మాత్రమే సంతృప్తి నిచ్చింది. కానీ పట్టు పురుగుల పెంపకం నాతో పాటు మరికొందరికి జీవనోపాధిని ఇవ్వగలిగాననే సంతృప్తిని ఇచ్చింది. అలాగే పట్టుపురుగుల పెంపకం ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చి పెట్టింది. అన్నిటికీ మించి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపింది. పట్టుపురుగుల పెంపకంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రభుత్వ సహకారం లభించింది. ఆటోమేటిక్ రీలింగ్ మెషీన్ కొనుగోలు చేసినపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వడంతో ఆకులను కత్తిరించడం మరింత సులభమైంది'' అంటారు శిల్ప.
- డా. సమ్మెట విజయ