Authorization
Mon Jan 19, 2015 06:51 pm
20 ఏండ్ల వయసులో ఆమెకు పెండ్లి చేయాలనుకున్నారు. చదువుకుని తన కాళ్ళపై తాను నిలబడ్డాకే పెండ్లి చేసుకోవాలని ఆమె బలమైన కోరిక. ఆమె కలను నిజం చేసేందుకు పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. చదువుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించింది. ఇప్పుడు పోలీసుగా శిక్షణ పొందుతోంది. ఆమే బీహార్‌కు చెందిన అన్నూ కుమారి. యూత్ ఛాంపియన్ నుండి పోలీసు ఉమెన్ వరకు సాగిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం నేటి మానవిలో...
బీహార్‌లోని నవాడా జిల్లాలోని రాజౌలీ సబ్‌డివిజన్‌లోని అమవాన్ అనే మారుమూలం గ్రామంలో పుట్టింది అన్నూ కుమారి. ఆడపిల్లలకు చిన్నవయసులోనే పెండ్లి చేసి పంపించడం అక్కడి ఆచారం. కానీ అన్నూ మాత్రం ఇంకా చదువుకుంటానంది. చిన్న వయసులో పెండ్లి ఆలోచనను వ్యతిరేకించడమే కాకుండా తన చదువును కొనసాగించి తన కాళ్లపై నిలబడ్డ తర్వాతే పెండ్లి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమెకు 26 ఏండ్లు. పట్టుదల, కృషితో తన గ్రామానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో పోలీసు కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతోంది.
బాలికలకు చేరువైంది
యుక్తవయసులో అన్నూ తన గ్రామంలోని కిషోరి సమూహ్ (కౌమార సమూహం)లో ఛాంపియన్‌గా నిలిచింది. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించబడిన కిషోరి సమూహ్ నవాడాతో పాటు దర్భంగాలోని బాలికలకు చేరువైంది. వారికి రుతుస్రావ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చింది. కాలక్రమేణా దర్భంగాలో 45 మంది యువజన ఛాంపియన్లు, నవాడలో 35 మంది సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు.
మొదట్లో ఇంత ధైర్యంగా లేదు
''నేను మా గ్రామంలో యూత్ ఛాంపియన్‌గా ఉన్నాను. ఆ సయంలోనే నా తల్లిదండ్రులు నాకు పెండ్లి చేయాలని మాట్లాడుకున్నారు. దాంతో నిరాశ చెందాను. వెంటనే షీలా దీదీ (షీలా దేవి, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా బ్లాక్ కోఆర్డినేటర్)తో చెప్పాను. నేను జీవితంలో పెండ్లి చేసుకోవడాని కంటే ముందు ఏదైనా సాధించాలనుకుంటున్నాను'' అన్ను చెప్పారు. షీలా దేవి తన గ్రామంలో కిషోరి సమూహ్ ఏర్పాటు సమయంలో అన్నూని కలిసింది. మొదట్లో అన్నూ ఇంత ధైర్యంగా మాట్లాడేది కాదని ఆమె గుర్తు చేసుకుంది. ''మేము మొదటిసారి కలుసుకున్నప్పుడు తాన ఏం చేయాలనుకుంటుందో కచ్చితంగా చెప్పలేకపోయింది. కానీ నేను ఆమె సామర్థ్యాన్ని చూడగలిగాను. అయితే వందలాది మంది ఇతర అమ్మాయిల మాదిరిగానే ఆమెకు తన కుటుంబం నుండి మద్దతు లేదు. సమాజం వేసే సంకెళ్లను తెంచడానికి ప్రేరణ లేదు'' అని షీలా దేవి చెప్పారు.
ఐదుగురు అమ్మాయిలతో ప్రారంభమై
ఈ గ్రామాలలోని ప్రజలు తమ ఆడపిల్లలను కిశోరీ సమూహ్ సమావేశాలకు ఎందుకు పంపాలని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నే తల్లిదండ్రులను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించడానికి దారితీసింది. ''మేము ముందు వారికి నేర్పిస్తాము. వారు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో మేము వారిని అడుగుతాము. వారు ప్రశ్నలు అడగాలని, సమాధానాలు పొందాలని మేము కోరుకున్నాం. మేము దీన్ని ముందు ఐదుగురు అమ్మాయిలతో ప్రారంభించాం. మరుసటి నెలలో ఈ సంఖ్య పెరిగింది. ఈ యువతులలో వచ్చిన మార్పును గమనించిన తర్వాతనే గ్రామ ప్రజలు ఇతర అమ్మాయిలను కూడా మా సమావేశాలకు పంపించేందుకు ఒప్పుకున్నారు''అని షీలా జతచేస్తున్నారు.
కారణాల కోసం పోరాడడం
అన్నూకి పెండ్లి చేయాలని నిర్ణయించినపుడు ఆ గ్రామంలో మరో బాల్య వివాహం జరుగుతుంది. దాంతో బాల్య వివాహలపై పని చేయాలని అనుకున్నారు. ఇది కూడా ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనందున అన్నూకు ఈ విషయాల గురించి అవగాహన కల్పించారు. చిన్నతనంలోనే పెండ్లి చేసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆమెకు తెలుసు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి. ఆ పెండ్లిని సకాలంలో నిలిపివేసేలా చూసుకుంది. ఇంతలో అన్నూ తల్లిదండ్రులు ఆమె పెండ్లికి ప్లాన్ చేస్తున్నారు. కట్నం కోసం డిమాండ్లు వచ్చాయి. ఎవరైనా కట్నంగా రూ.10 లేదా 12 లక్షలు అడుగుతారని ఇది తనను ఆందోళనకు గురిచేసిందని ఆమె చెప్పింది. 10 లక్షలు కట్నంగా ఇవ్వడానికి సిద్ధపడితే తన చదువుకు, సంతోషానికి తప్పకుండా డబ్బు చెల్లిస్తానని తల్లిదండ్రులకు చెప్పి షీలాదేవి అన్నూకు మద్దతుగా నిలిచింది.
ఆమెకు స్వేచ్ఛనిచ్చింది
''నా తండ్రి చివరికి అంగీకరించారు. వివాహం చేయాలనే ఆలోచనను రద్దు చేసుకున్నాడు'' ఆమె చెప్పింది. వెంటనే అన్నూ మగద్ యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ (ఆనర్స్) చదువు కొనసాగించారు. ఆమె సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత తండ్రి ఆమెకు ఒక బైక్ కొన్నాడు. ఇది ఆమెకు స్వేచ్ఛను ఇచ్చింది. ''ఒక రోజు నేను హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాను. నన్ను ఓ పోలీసు ఆపి జరిమానా విధించింది. ఒక మహిళా పోలీసు ఇంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. అప్పుడే నేను అనుకున్నాను, నేను కూడా పోలీసు ఎందుకు కాలేను?'' అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు.
త్వరలో ఇన్స్పెక్టర్గా...
అన్నూ తన మూడవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించి పోలీసు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ''నేను కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్నాను. నా పోస్టింగ్ నాకు డెస్క్, ఫీల్డ్ డ్యూటీల కలయికను ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇది నేను త్వరలో దరోగా (ఇన్స్పెక్టర్) కావడానికి చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది'' అని ఆమె చెప్పింది. భారతదేశంలోని మారుమూల గ్రామాలలోని యువతులకు సాధికారత కల్పించే సంస్థ ప్రయాణంలో భాగంగా పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కిశోరీ సమూహ్ అండగా నిలిచిన ఎంతో మంది అమ్మాయిల కథలలో అన్నూ కథ ఒకటి.
విద్య అంటే...
సీనియర్ స్పెషలిస్ట్, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ హెడ్ పరిమల్ చంద్ర మాట్లాడుతూ ''నవాడా జార్ఖండ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. శివార ప్రాంతాలలో నివసిస్తూ చాలా తక్కువ అవకాశాలు ఉన్న గిరిజన సంఘాలు అక్కడ ఉన్నాయి. ఈ యువతులకు నేర్పించడం చాలా అవసరం. విద్య అంటే వారు పాఠశాలకు వెళ్లడం, బాల్య వివాహాలకు దూరంగా ఉండడం, ఉద్యోగాలు సంపాదించడం, ఆరోగ్యంగా ఉండడం. ఈ యూత్ ఛాంపియన్లు గ్రామ ఆరోగ్యం, పోషకాహార శానిటైజేషన్ సంఘంలో కూడా ఒక భాగం. గ్రామ స్థాయిలో ఆరోగ్య నాణ్యతను మెరుగుపరచడానికి మేము జన సంవాద్‌ను నిర్వహించాము'' అని ఆయన చెప్పారు.
- సలీమ