Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ, స్నేహం.. ఏ బంధమైనా ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటేనే అది పూర్తికాలం కొనసాగుతుంటుంది. కానీ కొంతమంది అభద్రతకులోనై ఆ నమ్మకాన్ని దూరం చేసుకుంటుంటారు. మరికొంతమంది మంచి నైపుణ్యాలున్నా తమను తాము తక్కువగా అంచనా వేసుకుని అభద్రతకు లోనవుతుంటారు. ఇలా విభిన్న కారణాలతో అభద్రతా భావానికిలోనై మానసిక వేదన పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. దీనిని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు లేదా సంబంధిత నిపుణుల సహాయ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలాంటి వారిలో కొన్ని అలవాట్లు సాధారణంగా కనిపిస్తాయని, తద్వారా సమస్యను గుర్తించవచ్చని అంటున్నారు. మరి ఆ అలవాట్లేంటో చూద్దాం...
మనలో చాలామందికి నైపుణ్యాలుంటాయి. కానీ కొంతమంది మాత్రమే వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటారు. అయితే అభద్రతకు లోనయ్యే వారిలో కూడా మంచి నైపుణ్యాలుంటాయని, కానీ వారిని వారు తక్కువగా అంచనా వేసుకుంటారని నిపుణులు అంటున్నారు. వారు సరిగా పని చేసినా తరచుగా ఇతరుల అభిప్రాయం కోరుతుంటారు. వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే సంతృప్తి పడడం.. లేదంటే బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారు తమలో 'స్వీయ నమ్మకం' పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం నిపుణుల సహాయం తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఎవరి నైపుణ్యాలు వారికి ఉంటాయి. కానీ అభద్రతకు లోనయ్యే వారు మాత్రం ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటారు. వారు సాధించిన విజయాలనే తాము సాధించాలనుకుంటారు. ఒకవేళ వాటిని చేరుకోలేకపోతే కుంగిపోతుంటారని అంటున్నారు నిపుణులు.
అభద్రతాభావం ఉన్నవారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి బదులుగా కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వారి లోపాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ నిందిస్తుంటారు. దాంపత్య బంధాలు బీటలు వారడానికి ఇలాంటి స్వభావం కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. అయితే వీరు అప్పటికప్పుడు సంతృప్తి పొందినా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటున్నారు. కాబట్టి ఇలాంటి స్వభావం ఉన్నవారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అభద్రతాభావం ఉన్నవారిలో భవిష్యత్తు గురించిన ఆందోళనలు అధికంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇది క్రమంగా ఒత్తిడికి దారి తీస్తుంటుంది. ఆ ఒత్తిడిని కుటుంబ సభ్యులపై చూపించడం వల్ల రిలేషన్షిప్లోనూ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే వీరు ఇతరులను, సన్నిహితులను కూడా నమ్మడానికి వెనుకాడుతుంటారు. ఇది క్రమంగా మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదా సంబంధిత నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.