Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జల సంరక్షణే జగతికి రక్ష. జలం జీవజాతులకు ప్రాణం. జలమే అన్నిటికీ మూలాధారం. అందుకే ప్రాణాధారమైన జలాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ విధిగా కృషి చేయాలి. అలా జల సంరక్షణ కోసం అనునిత్యం కృషి చేస్తున్న వారిలో కల్పనా రమేష్ ముందున్నారు. ఆమె చేస్తున్న కృషి గురించి నేటి మానవిలో...
బెంగళూరులో జన్మించిన కల్పనా అక్కడే బీ.ఎం.ఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఆర్కిటెక్చర్ పూర్తి చేసారు. పెండ్లి తర్వాత యు.ఎస్.ఎ.లో ఇంటీరియర్ డిజైనర్ డిప్లమా చేసిన ఆమె చాలా రకాలైన ఆర్ట్ కోర్సులు చేసారు. అక్కడ నుండి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత జల వనరులను రక్షించడం, వాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిసున్నారు. అందులో భాగంగా పౌరుల నైతిక బాధ్యతను పెంచడమే లక్ష్యంగా చేసుకుని ''సేవ్ 10K బోర్లు'', ''లైవ్ ది లేక్స్'', ''బ్లూ హైదరాబాద్'' వంటి ప్రముఖ కార్యక్రమాల ద్వారా 'జల సంరక్షణ ఛాంపియన్'గా నిలిచారు.
వాటర్ హీరోగా...
కల్పన ప్రయాణంలో తన భర్త రమేష్ పాత్ర ఎంతో ఉందని అంటున్నారు. మహిళాభ్యుదయంపై అవగాహన వున్న రమేష్ కల్పనని స్వతంత్రంగా ఉండేలా ప్రేరణ అందించారు. మొదట వారు స్థిరమైన ట్యాంకర్ రహిత ఇంటిని నిర్మించి, నీటిని నిల్వ చేయడంలో ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ''వాటర్ హీరో''గా గుర్తింపు పొందారు. ఎండాకాలంలో నీటి కొరకు టాంకర్లు, బోర్లపై ఆధారపడకుండా నీటి సంరక్షణ చేస్తూ సమాజానికి ఆదర్శ మహిళగా గుర్తింపు పొందారు. జల జీవన సమస్య తీర్చడానికి తనదైన శైలిలో మన ముందుకు వచ్చారు.
నీటి కొరత వల్ల
ప్రస్తుతం కల్పనా గచ్చిబౌలిలోని రోలింగ్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు పచ్చదనంతో హరితహారమై జలకళతో మెరిసిపోతుంది. పల్లెటూర్లలో కూడా నేడు కనబడని ఈ పచ్చదనం హైదరాబాద్ మహానగరానికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది ఆమె ఇంటిని చూస్తే. ఇల్లును నందనవనములా చేసి కాలనీ వాసుల దృష్టితో పాటు ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించారు. జల సంరక్షణయే ధ్యేయంగా చక్కని ప్రణాళికను ఏర్పాటు చేసుకుని చుక్క చుక్కను ఒడిసిపట్టారు. మొదట్లో ఇంటీరియర్ డిజైనర్స్గా పని చేసిన ఆమె కుటుంబం యుఎస్ నుంచి తిరిగి వచ్చాక నీటి కొరతతో ఇబ్బంది పడింది. తప్పని పరిస్థితుల్లో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడవలసి వచ్చింది. దీని పరిష్కారం కోసం ఏదో చేయాలనే తలంపుతో కార్యాచరణ చేపట్టారు.
సరికొత్తగా ఆలోచనతో
సొంత ఇంటిని నిర్మించుకున్నాక నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు తీసుకున్నారు. నీటిని పొదుపు చేయాలనే ఆలోచనతో ఇంటి ఆవరణలోనే ముప్పై వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సంపును తవ్వించారు. స్నానపు గదులలో వాడిన నీళ్లను, వంటగదిలో పాత్రలు శుభ్రం చేసిన నీళ్లను చెట్లకు మళ్లించేలా చేశారు. బిందు సేద్యానికి వాడే పరికరాలను ఏర్పాటు చేశారు. ఇలా నీరు వృధా కాకుండా చూశారు. పెద్ద సంపును తవ్వడం వల్ల బోర్లో నీటిమట్టం కూడా పెరిగింది. సరికొత్తగా ఆలోచించి విజయం సాధించారు.
వాన నీటిని తాగుతూ...
వానలతో నిండిన సంపులోని నీటిని తాగొచ్చా? అనే అనుమానం కల్పనకు వచ్చింది. సంపులో బొగ్గు, కంకర రాళ్లు, ఇసుకను వేశారు. అందులో నిల్వ ఉంచిన సంపులోని నీటిని పరీక్ష చేయించారు. ఇందులో లవణాలు ఖనిజాలు చాలా ఉన్నాయని తేలింది. మినరల్ వాటర్‌ని, నిల్వ ఉంచిన వాన నీటిని కూడా ల్యాబ్‌లో పరీక్ష చేయించారు. నిల్వ ఉంచిన వాన నీటిలో పి.హెచ్.సి లెవెల్ టీ.డి.యస్ విలువలు సురక్షితస్థాయిలో ఉన్నాయని తెలుసుకున్నారు. ఆ నీటిలో టాక్సీన్ అసలు లేదు. పిహెచ్ వాల్యూ 7 నుంచి 7.5 వరకు మాత్రమే ఉంది. ఆరోగ్యానికి కావాల్సినంత ఆల్కలైన్ ఉంది. దాంతో కుటుంబ సభ్యులు ఈ నీటిని తాగడం మొదలుపెట్టారు. ఆర్బో వాటర్ కన్నా ఈ పద్ధతిలో నిల్వ చేసే నీరే సురక్షితమని, దీంట్లో కాల్షియం కూడా ఉంటుందని తేలింది. వానాకాలంలో సంపు నిండిపోతే మిగిలిన నీటిని వాటర్ ట్యాంకులలో డంపు చేస్తున్నారు. ప్రతి కుటుంబం వర్షపు నీటిని ఇలా సంరక్షిస్తే నీటి కొరతే ఉండదని కల్పన అంటున్నారు.
అవగాహన కల్పిస్తూ...
వర్షపు నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలో, ఏ విధంగా నీటిని వృధా చేయకూడదో వంటి అంశాలపై పాఠశాలలో, కళాశాలలో ఆమె అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ''నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే ముందుగా వారికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌పై అవగాహన అవసరం. అప్పుడే వారు వారి కుటుంబానికి విషయాన్ని తెలియ చెపుతారు. నీరు భవిష్యత్తు తరాలకు అందాలంటే ముందుగా విద్యార్థులను చైతన్యం చేయడం ఎంతైనా అవసరం'' అంటారు ఆమె. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం కూడాక చేస్తే బాగుంటుందని ఆమె భావిస్తున్నారు.
భావితరాలకు అవగాహన
జలమే జీవం, జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు ప్రజలకు ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం జై సూర్య ఫౌండేషన్ ఆర్థిక సహకారం. ప్రస్తుతం వర్షాధార ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న కల్పనా వారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి పాఠశాల భవనం పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీరు ఏడాదికి దాదాపు పది లక్షల లీటర్లు, మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నుంచి వృధాగా పోయే 12 లక్షల లీటర్ల నీటిని ఆదా చేసేలా పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించడానికి తోడ్పాటు ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నీటి యాజమాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నీటి ప్రాధాన్యత గురించి భవిష్యత్తు తరాలకు వివరిస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురాతన భారం బావి (మెట్ల బావి) ప్రస్తుతం ఓపెన్ అక్వేరియాన్ని తలపిస్తోంది. పిచ్చి మొక్కలు, తుప్పలతో నిండిన ఈ బావిని బతుకమ్మ సంబరాల సమయంలో కల్పన చొరవ వల్ల జిల్లా యంత్రాంగం శుభ్రం చేయించింది. 365 రోజులు ఊట నీటితో కళకళలాడే ఈ బావిలోని నీరు నాచు పట్టకుండా, దుర్వాసన రాకుండా అందులో చేప పిల్లలను వదిలారు. సాయంకాలం సెలవు దినాల్లో ఈ బావిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందటే దీని వెనుక ఆమె కృషి మరువలేనిది.
బ్లూ హైదరాబాద్ లక్ష్యంగా...
అందరూ ఉపయోగించే ప్రాంతాల్లో రెయిన్ హార్వెస్టింగ్ కొరకు నలభై ఇంజక్షన్ బోర్లు ఏర్పాటు చేయించారు. మన చెరువులు మనమే కాపాడుకోవాలన్న సంకల్పంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా నిలదొక్కుకొని తనదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. కోవిడ్ సమయంలో కొండాపూర్ ఏరియాలో చిన్న పిల్లలకు పాలు అందించారు. అప్పుడే అక్కడ ఒక పెద్ద బావిని గమనించి ప్రభుత్వాన్ని సంప్రదించి, పర్మిషన్ తీసుకుని శుభ్రం చేయించారు. దీనివల్ల మూడున్నర లక్షల లీటర్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చేశారు. హైదరాబాద్ సిటీని బ్లూ హైదరాబాద్‌గా చేయాలన్నది కల్పన లక్ష్యం. హైదరాబాద్ నగరంలో కూడా 40 ఇంజక్షన్ బోర్లు వేయించారు. కొండాపూర్‌లోని కుడికుంట సరస్సు, గచ్చిబౌలిలోని మెట్ల బావి, బన్సీలాల్‌పేటలోని 17వ శతాబ్దపు చారిత్రాత్మక మెట్ల బావితో సహా రాష్ట్రంలో అనేక బావులు, మెట్ల బావులు, ఇతర నీటి నిర్మాణాలను ప్రభుత్వ సహాయంతో పునరుద్ధరించారు. మార్చి 2021లో మహిళా దినోత్సవం సందర్భంగా ఏడుగురు మహిళా సాధకుల్లో ఒకరిగా కల్పనా ఎంపికయ్యారు. ఒక క్రమ పద్ధతిలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడంలో ప్రథమ స్థానంలో కల్పన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ''బ్లూ హైదరాబాద్'' చేయడమే కల్పన గారు లక్ష్యంగా ఎంచుకున్నారు. జల శక్తి మినిస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ పోర్టల్‌లో బ్లూ హైదరాబాద్‌ను లాంచ్ చేశారు.
ఆదర్శ మహిళగా...
ప్రధానమంత్రి మహిళా దినోత్సవం(2021) సందర్భంగా సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఉత్తమ మహిళలను ఏడుగురిని ఎంపిక చేశారు. వారిలో కల్పన ఉండడం ఎంతో గర్వకారణం. వారి నిస్వార్థతకు గుర్తుగా, సమాజ శ్రేయస్సు కోసం అనునిత్యం తపన పడే వారిని ప్రోత్సహించడం కొరకే వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ప్రకారం కల్పనకు ఈ అవార్డ్ ఇచ్చారు. ఇది మహిళా విజయంగా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు యచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ నుండి ఇరవై లక్షల సహాయం ద్వారా 20 ఇంజక్షన్స్ బోర్లను వేయించారు.
ప్రతిష్టాత్మక అవార్డులు
జల మంత్రిత్వ శాఖ ద్వారా వాటర్ హీరోస్,SCSC అవార్డులు, HMA ఉమెన్, ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2021, HYSEA అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అలాగే కల్పనకు IIID ప్రాంతీయ (హైదరాబాద్) చాప్టర్ ద్వారా నీటి సంరక్షణ పట్ల నిబద్ధత లభించింది. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ నుండి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2021-22లో అందుకున్నారు. ఇండియా విజన్ 2040 అండ్ బియాండ్ నుండి గౌరవం అందుకున్నారు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ నుండి 'సాంప్రదాయ నీటి పెంపక స్థిరమైన పునరుజ్జీవనం' కోసం బన్సీలాల్‌పేట పునరుద్ధరణకు అందించిన బిగ్ 5 నిర్మాణ అవార్డు కూడా అందుకున్నారు.
నీటితో నింపాలని
రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు సాహిల్ సోలంకి సహకారంతో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు ఆమె. హైదరాబాద్ నగరం అంతటా సామాజిక ప్రభావ కార్యకలాపాలు చేయాలనే ఉద్దేశ్యంతో నడిచే ''సహి'' సొసైటీతో కలిసి పని చేస్తున్నారు. కుడుకుంటలేక్లో 100 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించారు. దీనిలో 15వేల మంది ప్రజలు కలిసి వచ్చారు. 1,86,000 వేల లీటర్ల మురుగునీటిని రీ డైరెక్ట్ చేశారు. మూడు పాఠశాలలోని నీటిని సానుకూలంగా చేశారు. 1000పైగా కుటుంబాలు వారి బోర్లను పునరుద్ధరించుకునేలా చేశారు. మొత్తం మీద 25 కోట్ల లీటర్ల నీటిని ఆమె సేవ్ చేశారు. త్రిబుల్ ఐటీ కేనోస్ వారి సహాయంతో హైదరాబాదును 98 వాటర్ షెడ్‌గా డివైడ్ చేశారు. ప్రతి బ్లాక్ లోను అక్కడ నివసించే జనం సాయంతో బోరుబావులు, చెరువులు, కుంటలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకొని అవి శుభ్రపరిచేందుకు సంకల్పించారు. ప్రతి బ్లాక్ నీటితో నింపాలని వారి ఆకాంక్ష. కల్పనా చేస్తున్న కృషి ఎంతోమందికి ఆదర్శం కావాలని, ప్రతి ఒక్కరు జల సంరక్షణ చేస్తూ నీటి చుక్కలను ఒడిసి పట్టుకొని, నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉండాలని కోరుకుందాం.
- బండారు సునీత