Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడంటే చచ్చేంత భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని బలవంతంగా బయలుదేరేది. ఆటలు అల్లరికి మారు పేరై ప్రతి ఇంటిగడపను ఆత్మీయంగా తొక్కేది. వీధి పిల్లలతో స్నేహం చేస్తూ ఆకలినే మరిచేది. స్వేచ్ఛగా వాడవాడల్లో విహరిస్తూ బొమ్మరిల్లు కట్టుకొనేది. వాగులు వంకలు పొలాలతో దోస్తీకట్టి ప్రకృతిని ప్రేమించేది. మురిపెంగా చంకన ఎత్తుకొని బయలు దేరిన అక్కను విదిలించుకొని ఇంటిదారి పట్టే ప్రయత్నం చేసేది. వారించిన పంతులమ్మ చేతులనే కొరికి ఇంటికి పరుగుతీసేది. పిట్టకొంచెం కూత ఘనమని కొందరు... అల్లరి పిడుగని కొందరు... తేలుకొండి అని మరొకొందరి బిరుదులను నెత్తి మోసేది. ఆమె ఎవరో కాదు నేడు మనకు సుపరిచితమైన అనుశ్రీ కలంతో సాహితీ ప్రస్థానం మొదలుపెట్టిన అయిత అనిత.
అనిత మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో పుట్టారు. తల్లి కనకలక్ష్మి, తండ్రి వసంతం. వీరికి ఆరుగురు సంతానం. అందరికంటే అనిత చిన్నది. తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. తొమ్మిదేండ్లు వచ్చే వరకు తండ్రి గారాబంతో చిలిపిగా సాగింది ఆమె బాల్యం. నాల్గవ తరగతి పరీక్షలు ముగిసాయి. వేసవి సెలవుల ఆనందం తనివితీరక ముందే పిడుగు లాంటి సంఘటన. ''అమ్మ పని మీద ఊరెళ్లింది. నేను వస్తానని మారాం చేసినా ఎందుకో ఇంట్లోనే ఉండమంది. ఆ రోజు అరుగుపై ఆడుకుం టున్నాను. అకస్మాత్తుగా మామయ్య వచ్చి చాప తీసుకురా అన్నాడు. నేను తేలేదు. మరో ఐదునిమిషాల్లో చాపపై నాన్న పడుకున్నారు. ఎందుకో..? నాన్న ఎంత లేపినా లేవనేలేదు. రోజు పడుకునే ముందు నేను పాడే పద్యాలను, అభినయ గేయాలను వింటూ నాతో ముచ్చటించే నాన్న ఆరోజెందుకో నా మాటలు వినకుండానే నిద్రలోకి జారుకున్నారు. అది మామూలు నిద్రలా లేదు శాశ్వత నిద్ర. ఆ విషయం నా మట్టి బుర్రకు అర్థమవడానికి చాలా సమయం పట్టింది. బంధువులంతా చుట్టూ చేరి ఏడుస్తున్నారు. నేను మాత్రం ఏడ్చినట్టు గర్తులేదు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోలేని పసితనం అది. అప్పటి నుండి అమ్మ ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఆమె కను చెలిమలో నీరింకేవే కావు. అశ్రుధారలు చెక్కిలి దాటి ప్రవహిస్తూనే ఉండేవి.'' అంటూ తండ్రి తనకు దూరమైన రోజులను కన్నీటితో గుర్తు చేసుకున్నారు.
తల్లి మాటల ప్రభావంతో...
అప్పటి నుండి అన్నీ తల్లే. భర్తకు వచ్చే పెన్షన్ డబ్బుతో ఇంట్లోనే ఉంటూ పూలు అల్లుతూ, మిషన్ కుడుతూ పిల్లల్ని పోషించుకున్నారు. తల్లి ఆ పిల్లలకు ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉండేది. ''ఆడ పిల్లైనా, మగపిల్లలైనా ఎవరికాళ్లపై వారు నిలబడాలి. అందుకు చదువే ఉత్తమమైన మార్గం'' అని. ఆ మాటలను పూర్తిగా విశ్వసించిన అనిత కష్టపడి చదువుకుంది. ఆ తల్లి బోధనల ఫలితమేమో, ఎదుర్కొన్న పేదరికపు వెతల ప్రభావమేమో ఆమెను ఉత్తమ ఉపాధ్యా యురాలిగా మలిచాయి. ఓ కవయిత్రిగా చెక్కాయి.
తెలుగుపై మక్కువతో...
అనితకు బాల్యం నుండి తెలుగు పట్ల ఆసక్తి ఎక్కువ. దీనికి కారణం అప్పట్లో తెలుగు పాఠాలు బోధించిన టీచర్. దాంతో చిన్నతనం నుండే కవితలు రాస్తుండేది. 5వ తరగతిలో మొదటి కవిత రాసి నట్టుగా గుర్తు చేసుకున్నారు. 2015లో తెలంగాణ జాగృతి వారు నిర్వహించిన జగిత్యాల జిల్లా స్థాయి కవిసమ్మేళనంలో మొదటిసారి తన కవితను వినిపించారు. 2017 ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా ధర్మపురిలో జరిగిన కవిసమ్మేళనంతో కవయిత్రిగా సాహితీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. 2018 నేటి కవిత వాట్సప్ ద్వారా ఆమెలోని కవిత్వ సృజన మరింత పుంజుకుంది. తాను రాయడమేకాకుండా జగిత్యాలలో కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాతీయ శతాధిక మహిళా కవిసమ్మేళనం, పుస్తకావిష్కరణలు, కవుల జయంతులు, సాహితీ సమాలోచనలు వంటి వివిధ సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఏదో తెలియని ఉత్తేజం
మనసు స్పందించినప్పుడల్లా ఏదో రాయాలని మనసు తపిస్తుంటుంది. అంతే పదాలు అలా కలం నుండి జాలువారుతూనే ఉంటాయి. పాఠశాల, కళాశాల స్థాయిలో ఉన్నప్పుడు తన స్నేహితుల పుట్టినరోజులకు, వీడ్కోలప్పుడు ఆటోగ్రాఫ్లుగా కవితలు రాసి వారికి ఇస్తూ ఉండేవారు. శ్రీశ్రీ కవితలు చదువుతున్నప్పుడు అనితలో ఏదో తెలియని ఉత్తేజం కలిగేది. యువత, మహిళల సమస్యలు, సాధికారతపైనే ఎక్కువగా ఆమె కవిత్వం ఉంటుంది.
సాహిత్యం చాలా అవసరం
పండుగలు, కవుల జయంతులు, వర్థంతులతో పాటు వివిధ సందర్భాలలో వ్యాసాలు రాస్తుంటాను. అవి అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి కూడా. అలాగే 3000లకు పైగా వచన కవితలు, వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు ప్రచురించారు. అవి మన పండుగలు (వ్యాస సంపుటి), రాయంచరత్నం (ఆటవెలదుల నక్షత్రమాల), జీవన సౌరభం (కైతికాలు), ఆగిపోకు (వచన కవిత్వం). వీటిని అచ్చువేయడంలో తన భర్త మోటూరి శ్రీనివాస్ సహకారం మరువలేనిదని చెబుతారు ఆమె. రాయడం, ఉద్యోగం, కుటుంబం ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడమంటే అంత సులభమైన విషయం కాదు. అయితే ఒక ప్రణాళిక ద్వారా మూడింటిని సమన్వయ పరుచుకోవచ్చంటున్నారు అనిత. అవసరమైన దగ్గర కుటుంబ సభ్యుల సహకారం తప్పక తీసుకుంటారు.
పేద విద్యార్థులకు అండగా...
''విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి, సంస్కృతి, సంప్రదాయాల, మానవ విలువలను పెంచి మూర్తిమత్వ పౌరులుగా తీర్చిదిద్దడం. సమాజ మార్పును కాంక్షించడం. యువతకు మహిళలకు స్ఫూర్తి నివ్వడం'' ఒక రచయితగా, ఉపాధ్యాయురాలిగా తన కర్తవ్యం అంటున్నారు అనిత. ముఖ్యంగా పేద విద్యార్థులకు సహాయం చేయాలనేది ఆమె లక్ష్యం. ఎందుకంటే విద్యార్థి దశలో వారికి చేయూతనందిస్తే అవకాశాలను అందిపుచ్చుకొని, భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటారని ఆమె నమ్మకం. ''ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యమంటూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఆత్మవిశ్వాసమే తోడుగా నిరంతరం కృషి చేయాలి. ఎంత కష్టమైనా మంచిదారిలోనే నడుస్తూ నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు సమస్యవచ్చినప్పుడు సహనంతో పాటు ధైర్యంగా ముందడుగువేయాలి. యువత వ్యసనాలకు లోనుకాకుండా చదువుపై శ్రద్దవహిస్తూ విలువలు, సంస్కృతి సంప్రదాయాలను అలవరుచుకోవాలి'' అంటూ ఆమె తన మాటలు ముగించారు.
సాహిత్యం దోహదపడుతుంది
'సమాజంలో మార్పు రావాలంటే అక్షరమే అసలైన ఆయుధం. యువతకు మార్గదర్శకం చేయాలన్నా, కనుమరుగవుతున్న సంస్కృతిని రక్షించాలన్నా, మానవ విలువలు కాపాడాలన్నా, మహిళల్లో ఆత్మవిశ్వాసం నూరిపోసి సాధికారత సాధించాలన్నా సాహిత్యం దోహదపడుతుంది. మనం రాసే ఏ ఒక్క వాక్యమైనా, ఏ ఒక్క మనిషినైనా మార్చగలదు. వ్యక్తిత్వ పరిపుష్టికి, అనుబంధాల పటిష్టతకు, నవసమాజ నిర్మాణానానికి సాహిత్యం చాలా అవసరమని' ఆమె అభిప్రాయం.
- సలీమ