Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితభాగస్వామిపై అలగడం కొంతవరకు ముద్దుగానే ఉంటుంది. హద్దు దాటితే మాత్రం దాంపత్య బంధం భంగమవడానికి కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకొనే చిన్నవాటికి అలగడంకన్నా అవతలివారితో బాధను పంచుకోగలిగితే చాలు.. మనసు తేలిక పడుతుందంటున్నారు నిపుణులు.
భాగస్వామి ఇచ్చినమాట తప్పినప్పుడు, ముఖ్యమైన సందర్భాలను ఇరువురిలో ఎవరైనా ఒకరు మర్చిపోయినప్పుడు అలగడం సర్వసాధారణం. ఆ అలకను రోజులతరబడి కొనసాగించి నప్పుడు ఎదుటివారెందుకలా మౌనంగా ఉంటున్నారో కొన్నిసార్లు అవతలివారికి తెలియక పోవచ్చు. తమతో మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని ఎందుకు పాటిస్తున్నారో అర్థంకాక అయోమయానికి గురికావొచ్చు. అలకకు ఎక్కువ రోజులు కొనసాగించకుండా కారణాన్ని చెప్పేయాలి. వారే తెలుసుకోవాలని పంతం ప్రదర్శించ కూడదు. అలగాల్సినంత ప్రాముఖ్యత ఆ విషయానికి ఉందని ఒకవేళ అవతలివారు భావించకపోతే సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే అలకను ఆటగానే భావించి ఎదుటివారితో మనసులోని మాట చెప్పేయాలి. కాసేపు ఆటపట్టిస్తే చాలు. సందర్భం ఆనందంగా ముగుస్తుంది. లేదంటే వాదోపవాదాలకు దారితీసే ప్రమాదం ఉంది.
మొదట సరదాగా అలిగిన సందర్భం సమయం గడిచేకొద్దీ కోపంగా మారే ప్రమాదమూ లేకపోలేదు. పుట్టినరోజు, పెండ్లిరోజు వంటి ప్రత్యేకమైన రోజులను అవతలివారు జ్ఞాపకంపెట్టుకోలేదనో, లేదా సెలబ్రేట్ చేయలేదనో అవతలివారిపై అలుగుతుంటారు. అయితే.. కొన్నిసార్లు ఆఫీసు పని ఒత్తిడి లేదా వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు నిజంగానే కొన్ని గుర్తు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు రోజులతరబడి అలకను ప్రదర్శిస్తే అది అవతలివారికి అర్థంకాదు.
అలాగ.. ఎదుటివారు తమ అలకను గుర్తించడంలేదని భావించి అలిగినవారు దాన్ని కోపంగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఇరువురిమధ్య లేనిపోని మానసిక సంఘర్షణలు మొదలవుతాయి. అలా కాకుండా ఉండాలంటే అప్పటికప్పుడు అవతలివారికి అసలు విషయం చెప్పగలిగితే చాలు. మనసు తేలిక పడుతుంది. ముఖ్యమైన రోజును మర్చిపోయినందుకు అవతలివారు పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తే బెట్టుకు పోకుండా శాంతించండి. సంతోషం ఆ దంపతుల సొంతమవుతుంది. అలాగే ప్రతి చిన్న విషయానికీ అలుగుతుంటే అవతలివారికి చికాకును తెప్పించినవారవుతారు. ఆ తర్వాత ఎంత మూతి ముడిచినా ఎదుటివారు పట్టించుకోకపోవచ్చు.