Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృత్తిపరంగా లేదా టైంపాస్ కావట్లేదంటూ.. ప్రస్తుతం చాలామంది డిజిటల్ ప్రపంచమే లోకంగా గడుపుతున్నారు. కానీ ఎంతలా దీనికి అలవాటు పడితే మన ఆరోగ్యంపై అంత ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇది కుటుంబ బంధాలను సైతం దెబ్బతీస్తుంది. పనిలో నాణ్యతను తగ్గిస్తుంది. చదువుపై ఆసక్తినీ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే గ్యాడ్జెట్స్‌ని వినియోగించుకోవాలి.
ఒకవేళ టైంపాస్ కోసమే డిజిటల్‌ని ఆశ్రయిస్తున్నట్లయితే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. మీకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపచ్చు. ఆటలు, పాటలు, కళలు.. వంటి అంశాల్లో మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇక వృత్తిరీత్యా ఆన్లైన్లో ఉండేవాళ్లు తమ పని పూర్తైన తర్వాత ఇలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టచ్చు. ఆలోచించాలే గానీ ఇలాంటి ఆప్షన్స్ బోలెడున్నాయి. వీటివల్ల డిజిటల్ ప్రపంచం నుంచి కాస్త విరామం దొరకడంతో పాటు శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది.
వారాంతాల్లో మీరు కూడా మీ గ్యాడ్జెట్స్‌కి వీక్లీ-ఆఫ్ ఇచ్చేయండి. మరీ రోజంతా అంటే కష్టమనుకుంటే కనీసం ఓ పూటైనా వాటిని కనికరించండి. ఆ సమయంలో హాయిగా నిద్రపోండి. కాసేపు వ్యాయామం చేయండి. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి. ఇలా కనీసం వారానికొకసారైనా అలవాటు చేసుకున్నారంటే మీలోని ఒత్తిళ్లు, ఆందోళనలు అన్నీ హుష్‌కాకి అయిపోవాల్సిందే. శరీరానికైనా, మనసుకైనా ఇంతకుమించిన రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి.
చాలామంది ఖాళీగా కూర్చున్నారంటే చాలు.. చేతులు ఫోన్ దగ్గరికే పరుగులు పెడతాయి. అదే మనం అనుకున్న పనులన్నింటినీ ఓ ప్లాన్ ప్రకారం పూర్తిచేశామంటే ఖాళీగా, బద్ధకంగా కూర్చునే అవసరమే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికీ రోజువారీ ప్రణాళిక తప్పనిసరి. దాని ప్రకారమే వ్యాయామం, ఆఫీస్ పని, ఇంటి పని, పిల్లల బాధ్యత, కుటుంబంతో గడపడం, నిద్రపోవడం.. వీటన్నింటినీ బ్యాలన్స్ చేసుకోవచ్చు.. తద్వారా డిజిటల్ ప్రపంచంలో విహరించే సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
ఫోన్, ల్యాప్‌టాప్ ఇలా వీటిని మన ఖాళీ సమయాల్లో కూడా వెంటే ఉంచుకోవడం వల్ల పదే పదే వాటిపైకే మన దృష్టి మళ్లుతుంది. అందుకే డిజిటల్ డీటాక్స్‌లో భాగంగా వాటిని మన కంటికి కనిపించనంత దూరంగా పెట్టేయడం మంచిది. తద్వారా మనం చేసే ఇతర పనులపై పూర్తి శ్రద్ధ పెట్టచ్చు.
డిజిటల్ డీటాక్స్‌ని ఇంట్లో మీరొక్కరే పాటిస్తూ.. ఇతరులు విచ్చలవిడిగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతున్నారనుకోండి.. మీకూ వాటిపైకే మనసు మళ్లుతుంది. కాబట్టి ఈ పద్ధతిని ఇంట్లో అందరూ పాటించేలా ఒక నియమం పెట్టుకోండి. కావాలంటే 'ఈ పద్ధతిని ఎవరు ఎక్కువ సేపు పాటిస్తారో చూద్దాం..!' అంటూ ఓ ఛాలెంజ్ విసురుకోండి. ఈ సమయంలో అందరూ కలిసి ఏదో ఒక గేమ్ ఆడడం, వంటలో ఒకరికొకరు సహాయపడడం.. వంటివి చేయచ్చు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. అనుబంధాలూ దృఢమవుతాయి.