Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చి మన ముంగిట వాలబోతోంది. ఇది డిజిటల్ యుగం కదా.. డిజిటల్ టెక్నాలజీలో జగం పరుగులు పెడుతున్నది. మానవ అభివృద్ధి అవకాశాలతో పాటు ఎన్నో సవాళ్లు ఈ సాంకేతిక విప్లవంలో మనం ఎదుర్కోవలసి ఉంది. ముఖ్యంగా సమాజంలో వేళ్లూనికుపోయిన లైంగిక అసమానతల వల్ల. ఈ క్రమంలో ప్రతి ఏడాది ఒక థీమ్/నినాదంతో ఇచ్చే ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ''లింగ సమానత్వం కోసం డిజిటల్ ఇన్నోవేషన్, సాంకేతికత'' తో ముందుకొచ్చింది. ఇప్పటికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 113 ఏండ్లయింది. అసలు ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం.
మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ విజయాలను సెలెబ్రేట్ చేసుకుంటూ లింగ సమానత్వం కోసం అవగాహన పెంచుకోవడం కోసం మహిళలు ప్రదర్శనలు చేయడం, సమావేశాలు నిర్వహించుకోవడం మహిళల విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఈ సందర్భంగా జరుగుతున్నది. ఆకుపచ్చ, ఊదా తెలుపు రంగులు మహిళాదినోత్సవం రంగులు. ఉదారంగు న్యాయం, గౌరవం సూచిస్తుంది. ఆకుపచ్చ ఆశను సూచిస్తే, తెలుపు స్వచ్ఛతను సూచిస్తాయి
సమ్మెకు సైరన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బీజం 1908లో పడింది. అమెరికాలో పరిశ్రమలలో పని చేసే మహిళలు వెట్టిచాకిరిలో మగ్గిపోయేవారు. దాదాపు 18 గంటలు పనిచేయాల్సి వచ్చేది. కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడేవారు. అమానుషమైన అణచివేత, వివక్ష ఎదుర్కొనే ఆ సమయంలో న్యూయార్క్‌లో వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు శ్రమదోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా, మెరుగైన జీవితం కోసం, ఓటు వంటి తమ హక్కుల కోసం న్యూయార్క్ సిటీ లో 15 వేల మందితో ప్రదర్శన చేశారు. న్యాయమైన హక్కుల కోసం సమ్మెకు సైరన్ ఊదారు. యాజమాన్యంపై పోరాటం మొదలు పెట్టారు. తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలపడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. వారి అసమాన త్యాగాల ఫలితంగా రోజుకు ఎనిమిది గంటల పని, వేతన పెంపుదల, టాయిలెట్ వంటి కనీస సౌకర్యాలు పెంపు, కొన్ని హక్కులు సాధించుకున్నారు
క్లారా జెట్కిన్ ఆలోచనతో
అమెరికాలోని సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళలకు ఓటు హక్కు కోసం ప్రచారంలోకి తెచ్చింది. ఆ సందర్భంగా అమెరికా అంతటా ఎన్నో సమావేశాలు జరిగాయి. 1910లో డెన్మార్క్‌లోని కోపెన్ హెగెన్ లో ''ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్'' అనే సదస్సు క్లారా జెట్కిన్ అనే కార్యకర్త ఆలోచనతో జరిగింది. అప్పుడు ఆ సదస్సులో 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళల హక్కులు, సార్వత్రిక ఓటు హక్కు కోసం ఉద్యమానికి మద్దతుగా ఏడాదిలో ఒక రోజును మహిళా దినంగా పాటించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.
ప్రతి ఏటా ఒక థీమ్‌తో
1911 లో డెన్మార్క్, ఆస్ట్రియా, జర్మనీ , స్విర్జర్లాండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిగా జరిగింది. 1917లో రష్యన్ విప్లవానికి నాంది అయిన ''ఆహరం - శాంతి'' మహిళా వస్త్ర కార్మికుల ప్రదర్శన జరిగింది. మహిళల ఓటు హక్కు ఉద్యమం విజయవంతం అయినా తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. కమ్యూనిస్ట్ దేశాలు మాత్రమే మహిళా దినోత్సవం జరుపుకున్నాయి. 1960లలో స్త్రీవాద ఉద్యమాలు మొదలయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళల సమస్యలు అడ్రస్ చేస్తూ హక్కులు ప్రోత్సహించడానికి దీన్ని ఒక సందర్భంగా తీసుకున్నది ఐక్యరాజ్య సమితి. 1975 నుంచి ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. 1975 జూన్ జులైలో మొదటి సారి యుఎన్ వరల్డ్ కాన్పరెన్స్ నిర్వహించిన ఫలితంగా కార్యాచరణ ప్రణాళిక, పర్యవేక్షక యంత్రాంగాల ఏర్పాటుకు దారితీసిన ప్రకటన జరిగింది. మహిళల కోసం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి నిధి కూడా ఏర్పడింది. 1996 నుంచి ప్రతి ఏటా ఒక థీమ్‌తో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.
మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి?
1917లో ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ రష్యాలోని మహిళలు సమ్మెకు దిగారు. ఆహారపు కొరత, పేద జీవన పరిస్థితులు, మొదటి ప్రపంచ యుద్దానికి నిరసనగా వారి సమ్మె కొనసాగింది. అది జార్ నికోలస్2 పదవి విరమణకు దారితీసింది. తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు మంజూరు చేసింది. అధిక దేశాల్లో అమలులో ఉన్న క్యాలెండర్ (గ్రెగోరియన్ క్యాలెండర్) ప్రకారం మహిళలు సమ్మెకు దిగిన రోజు మార్చి 8. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మహిళల హక్కులను గౌరవిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ సందర్భంగా చాలా దేశాలు మార్చి 8న జాతీయ సెలవు దినంగా ప్రకటించాయి. ప్రతిఏటా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా పండుగ చేసుకుంటున్నాం కానీ చేరవలసిన దూరం చాలా ఉన్నది.
సమ భాగస్వామ్యం లేదు
ప్రతి చోట మహిళలుపై బాలికలపై అన్ని రకాల వివక్ష కొనసాగుతూనే ఉంది. హింస పెరిగిపోతూనే ఉంది. బాల్యవివాహాలు పూర్తిగా పోలేదు. రాజకీయ ఆర్థిక ప్రజాజీవితాల్లో నిర్ణయాధికారం అన్ని స్థాయిల్లో మహిళలకు సమ భాగస్వామ్యం, సమాన అవకాశాలు చిటారుకొమ్మనే ఉన్నాయి. కుటుంబంలోనూ సమ భాగస్వామ్యం లేదు. ఇంటి పనికి విలువ లేదు. దాన్ని విలువైనదిగా పరిగణించరు. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, పునరుత్పత్తి హక్కులు అన్నింటా వెనుకబాటే.
ఇంతకీ మనమెక్కడున్నాం?
ప్రపంచంలో మన మహిళ ఎక్కడ ఉంది అని చూసుకుంటే... 146 దేశాల్లో 135 స్థానంలో భారతీయ మహిళ ఉందని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (ఔజుఖీ) ˜చెబుతుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 27 శాతం బాలికలకు 18 ఏండ్లలోపు పెళ్లి జరిగిపోతున్నది. అనధికార ఉపాధిరంగంలో పురుషులు 57. 5 శతం ఉంటే మహిళలు 27.7 శాతం ఉన్నారు. పురుషులు 82 శాతం సంపాదిస్తే మహిళల సంపాదన 18 శాతం మాత్రమే. మహిళల సంపాదన, మహిళల పొదుపు పురుషులు 68 సంపాదిస్తేమహిళలు 32 శాతం. ప్రపంచ వ్యాప్తంగా పురుషులకంటే మహిళలు 23శాతం తక్కువ సంపాదిస్తున్నారు. 26శాతం మాత్రమే పార్లమెంటులో ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు లైంగిక హింసకు గురవుతున్నారు. మన దేశంలో 542 కి 78 మహిళలు అంటే 15శాతం లోపే, రాజ్యసభలో 13శాతం లోపే ఉన్నారు.
ప్రవేశం పరిమితమే...
మన రాజ్యాంగం, అందులోని చట్టాలు, హక్కులు ఘనంగానే కనిపిస్తాయి. కానీ మన వెనుకబాటుకు కారణం ఏంటి అని చూస్తే పితృస్వామిక భావజాలమేనని చెప్పక తప్పదు. ఇప్పటికీ మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల వారి శక్తి ఉత్పాదక శక్తిగా కనిపించడం లేదు. వారు విద్యకు, సాధికారతకు, సమాన హక్కులు, అవకాశాలకు దూరమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రవేశం పరిమితమే. భ్రూణ హత్యలు, వరకట్న హత్యలు, లైంగిక హింస ఎక్కువ. రక్షణ కరువు. అన్నింటా పురోగతి సాధించాల్సిన మహిళా వెనుకబాటులోనే వుంది. స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం, భాగస్వామ్యం కోసం పోరాటం తప్పడం లేదు.
అందనంత దూరంలో ఉన్నాం
ఈ డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా 37శాతం మహిళలు ఇంటర్నెట్ వాడడం లేదు. ఇక మనదేశంలో చూస్తే ఇంటర్నెట్ వాడకం దారుల్లో మూడింట ఒక వంతు మాత్రమే మహిళలు. ప్రతిదీ డిజిటల్ ప్రక్రియ ద్వారా జరుగుతున్ప్పటికీ, భవిష్యత్తు అంతా డిజిటల్ సాంకేతికత ఆవిష్కరణలే పెరిగినప్పటికీ మహిళలు అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాలకు అందనంత దూరంలోనే ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం అన్ని రంగాలలో వెనుకబాటుకు కారణమైనట్లు ఇక్కడ కూడా.. లైంగిక అసమానతలు, వివక్ష ప్రధాన కారణం. మహిళలు పోరాటాలతో సాధించుకున్న హక్కులు, చట్టాలు కోల్పోయే పరిస్థితులు ఉన్న వ్యవస్థలో బతుకుతున్నాం. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక, సాంస్కృతిక అసమానతలలో కొట్టుమిట్టాడే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో అత్యాధునిక సాంకేతికత లింగ సమానత్వం ఎంత వరకు సాధిస్తామో.. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఆవిష్కరణలు ఏమి చేస్తామో..? ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అన్నింటా సమం కావాలి.
- వి. శాంతి ప్రబోధ