Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందిలో కాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల అలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. అలా తిమ్మిర్లు పెట్టాక రెండు నుంచి మూడు నిమిషాలు చేతులు, కాళ్లు కదపలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. రక్తప్రసరణ సాఫీగా జరగనప్పుడే ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయని చెబుతారు. తిమ్మిర్లు అప్పుడప్పుడు వస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తరచూ వస్తే మాత్రం కచ్చితంగా వాటిని సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో ఉన్నవారు మాత్రం ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చేతులు కాళ్లలో తరచూ తిమ్మిర్లు రావడం అనేది విటమిన్ బి12 లోపానికి ఒక సంకేతం.
మన శరీరానికి విటమిన్ బి12 అత్యవసరమైనది. ఇది లోపిస్తే శరీరం అనేక అనారోగ్యాల బారిన పడుతుంది. ఎర్ర రక్త కణాల తయారీలో, నాడీ వ్యవస్థ పనితీరులో, శరీర ఎదుగుదలకు విటమిన్ బి12 చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాదు. దీనివల్లే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్ లోపిస్తే నరాల సమస్యలతో పాటు వెరికోస్ వీన్స్, సయాటికా వంటి సమస్యలు వేధిస్తాయి.
తిమ్మిర్లు అధికంగా పడుతున్నా, అరిచేతులు, అరికాళ్ళలో సూదులు గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే విటమిన్ బి12 లోపం ఉందేమో అని చెక్ చేసుకోవాలి. అలాగే విటమిన్ బి12 నిండుగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మాంసం, పాలు, పెరుగు, చేపలు వంటి వాటిల్లో బి12 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటూనే యాపిల్ సిడర్ వెనిగర్ కూడా తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. తిమ్మిర్లు అధికంగా వస్తున్న వారు నీటిని అధికంగా తాగాలి. ఎందుకంటే విటమిన్ బి12 అనేది నీటిలో కరిగే విటమిన్. అది శరీరంలో లోపించిందంటే డిహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి నీటిని అధికంగా తాగుతూ చేతులు కాళ్లకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం తగ్గుముఖం పడుతుంది.
విటమిన్ బి12 సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వైద్యులను సంప్రదించాక వాటిని తీసుకుంటే ఈ లోపాలను అధిగమించవచ్చు. ఎవరికి వారు సొంతంగా సప్లిమెంట్లను తీసుకోవడం పద్ధతి కాదు. వైద్యుల సూచన మేరకే వాటిని తీసుకోవాలి.