Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లకు జన్మనిచ్చిచూడు అమ్మలా నీ ఇంటి నీడ అవుతుంది... ఆడపిల్లకు చదువు చెప్పించి చూడు చదువుల తల్లిలా నీ ఇంటి వెలుగవుతుంది... ఆడపిల్లకు చేయూత నిచ్చి చూడు చివరి వరకు నీ చేయి వీడని ఊతమవుతుంది... ఆడపిల్లకు అండగా నిలిచి చూడు అంతరిక్షాన్ని అధిరోహించగలదు... భూదిగంతాన్ని చుట్టి రాగలదు... ఈ మాటలన్నీ అతిశయోక్తి కాదు ఒక్కసారి చరిత్ర పుటలను తిరగేస్తే అలాంటి వనితలెందరో తారసపడతారు. ఆ కోవకు చెందిన వ్యక్తే నేటి మన కథానాయిక రిథిక అగర్వాల్. ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్స్ తయారు చెయ్యడంలో తన సత్తా చాటడమే కాక 2022కు హైదరాబాద్ బిజినెస్ అవార్డ్ అందుకున్న మహిళా పారిశ్రామికవేత్త. వయసు నాలుగు పదులు కూడా నిండలేదు కానీ భారతదేశం అంతటా తాను సృజించిన ఏడ్యుకేషనల్ బోర్డ్ గేమ్స్ విక్రయాలు చేస్తున్నారు. ఇక ఆలస్యం చెయ్యక ఆమె సక్సెస్ స్టోరీ చదివేద్దమా మరి...
సాఫీగా సాగిపోతూ చెన్నైలో కాపురముండే ఓ వ్యాపార కుటుంబంలో 1988లో జన్మించారు రిథిక. అమ్మ సుధాలాట్, నాన్న ప్రవీణ్ లాట్. రిథికకు ఒక అక్క, ఒక అన్న ఉన్నారు. బాల్యం, విద్యాభ్యాసం చాలా ఆనందంగా సాగాయి. ఎంబీఏ చదివారు. అలాగే సర్టిఫైడ్ ఫైనా న్షియల్ ప్లానర్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమెకు చిన్న ప్పటి నుండి గణితశాస్త్రం అంటే చాలా ఇష్టం. అలాగే బోర్డ్ గేమ్స్ ఎక్కువగా ఆడేది. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అందరూ ఆడేవారు. వేసవి సెలవులలో, విరామ సమయంలో ఎంతో కాలక్షేపం. కుటుంబం అంతటినీ ఒకచోట చేర్చి కుటుంబ బంధాలను బలోపేతం చేయడంలో బోర్డ్ గేమ్స్ ఎంతో ఉపయోగం అంటారు రిథిక. ఒకసారి తన కజిన్‌తో నాలుగు రోజులు బోర్డ్ గేమ్స్ ఆడుతూ అలా ఉండిపోయింది. వినోదంతో పాటు విజ్ఞానం కూడా పెంచుతాయి బోర్డ్ గేమ్స్ అంటారు ఆమె.
పెళ్లితో మరింత బలం
2012లో మనీత్ అగర్వాల్ చెయ్యి అందుకొని రిథికా బొమ్మరిల్లు లాంటి పుట్టింటింని వదిలి పొదరిల్లు లాంటి అత్తవారి ఇల్లు చేరింది. చిన్నప్పటి నుండి ఉమ్మడి కుటుంబంలో పెరగడం కారణంగా అత్తవారింట్లో చాలా తేలికగా కలిసి పోయింది. మనీత్, రిథిక ప్రేమకు గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కలిగారు. వాళ్ళ పేర్లు యువాన్, కయున్. రిథిక ప్రారంభించిన వ్యాపార సంస్థ పేరు యుకా చాంప్స్, యు అనగా యువాన్ పేరులోని మొదటి రెండు అక్షరాలు, క అనగా కయూన్ పేరులోని మొదటి రెండు అక్షరాలు వాటిని కలిపిన 'YUKA' Champs అని సంస్థ పేరు పెట్టారు.
బిజినెస్స్ ఆలోచన ఇలా...
యువాన్, కయూన్ పెరిగి ఆటలాడే వయసు వచ్చేసరికి రిథికకు ఒక ఆలోచన తట్టింది. తన పిల్లలకు బోర్డ్ గేమ్స్ ఆడటం నేర్పించాలనుకుంది. పిల్లలు ఇంకా ఎక్కువ ఆసక్తితో బోర్డ్ గేమ్స్ ఆడాలి అంటే కొత్త కొత్తగా ఎలా రూపొందించాలి అనే ఆలోచన తట్టింది ఆమె. తన ఆలోచనను విస్తృతం చేసుకుంది రిథిక. అనుకున్నట్టుగానే బోర్డ్ గేమ్స్ రూపొందించడంపై దృష్టిసారించింది. ఈ బోర్డ్ గేమ్స్ కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానం పెంచేవిగా ఉండాలి. అందుకోసం పాఠశాల విద్యా పాఠ్యాంశాలకు అనుగుణంగా బోర్డ్ గేమ్స్ తయారు చెయ్యడం ప్రారంభించింది.
ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్స్
పాతకాలంలో బోర్డ్ గేమ్స్ అంటే పాము నిచ్చెన, చెస్, కార్రమ్స్, చైనీస్ చెక్కర్ లాంటివి. కానీ రిథిక మాత్రం పాఠశాలల పాఠ్యాంశాలకు సంబంధించి ప్రతీ అంశం గూర్చి బోర్డ్ గేమ్స్ తయారు చెయ్యాలి అంటుంది. ముఖ్యంగా తనకు గణితశస్త్రమంటే ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన బోర్డ్ గేమ్స్ తయారు చేశారు. అందులో ఎక్కువ పాపులర్ అయిన గేమ్ మథారాన్. బోర్డ్ గేమ్స్ తయారు చెయ్యడానికి కాగితం, అట్టముక్కలు ఉపయోగిస్తారు. వీటిని పిల్లల చాలా తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్లగలరు.
ఒక చిన్న ఆలోచన
రిథికా 10 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారంలో 30 లక్షల వరకు లాభాలను చూడగలిగారు. తన పిల్లల విరామ సమయంలో తాను చేసిన ఆలోచన యావత్ భారత దేశం అంతా తాను రూపొందించిన ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్స్ విక్రయించేలా చేసింది. భారతదేశం అంతటా 400 రిటైల్ దుకాణాలలోనూ, యూకా ఛాంప్స్ సొంత వెబెసైట్లోనూ, 30 కంటే ఎక్కువ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ఈ బోర్డ్ గేమ్స్ విక్రయించబడుతున్నయి.ఈ కారమ్స్ ప్లాట్ ఫామ్ ద్వారా యుఎస్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టారు. 'చదువుకునే ప్రతీ విద్యార్థికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి మా బోర్డ్ గేమ్స్' అంటారు రిథిక.
అపురూప క్షణాలు
2023 జనవరి 11వ తేదీన హైదరాబాద్ బిజినెస్స్ అవార్డ్స్ - 2022 ఏడాదికిగాను ఎడ్యుకేషనల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో న్యూ ఎంటర్ప్రైనూర్ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా రిథిక అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్ అందుకోవడం ఇప్పటి వరకు తన కెరీర్లో అపురూప క్షణాలు అంటారు ఆమె.
కుటుంబ సహకారంతోనే
'నేను ఏది సాధించినా, ఎంత అభివృద్ధి చెందినా నా కుటుంబ సహకారం వల్లనే సాధ్యమయింది. బోర్డ్ గేమ్స్ తయారు చెయ్యడం, విక్రయించాలనే నా ఆలోచనకు నా కుటుంబం అండగా నిలబడింది. అన్నింటిలోనూ నాకు సహకారం ఇచ్చారు. పని ఒత్తిడి సమయంలో నా పిల్లల ఆలనా పాలన చూసుకున్నారు. ఒక్కో సమయంలో ఒక గేమ్ తయారు చెయ్యడానికి, పరీక్షలు నిర్వహించటానికి చాలా సమయం తీసుకుంటుంది. అలాంటి సమయంలో కూడా నా కుటుంబ సభ్యులు, నా భర్త నన్ను ప్రోత్సహించారు' అంటారు రిథిక.
వి హబ్ సహకారంతో
తనలా కొత్తగా వ్యాపారరంలోకి ప్రవేశించ మహిళలకు వి హబ్ అందించే మద్దతు అంతా ఇంతా కాదు. విభిన్న వ్యాపార వర్గాల నుండి వచ్చిన వారి మార్గ దర్శకాలు చేయించడం, నిపు ణుల ద్వారా సెమినార్లు నిర్వ హించడం, పెట్టుబడిదారులకు ఆలోచనలు ఇవ్వడం, సూచనలు చెయ్యడం, ఆర్థికంగా చేయూత అందించడం ఇలా ఎన్నో రకాలుగా మహిళలకు అండగా నిలవడం ద్వారా ఎంతో మంది మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఇది ఒక మంచి వేదిక. నాకు కూడా చాలా సాయం అందించారు వారు అంటుంది రిథిక.
వ్యక్తిగత క్రమశిక్షణతోనే...
వ్యక్తిగత క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకితభావం ఉన్నపుడే మనిషి ఏదైనా సాధించగలడు. మంచి సమయం వస్తుందని వేచి చూడకూడదు. మన ఆలోచనలు, మన ప్రణాళిక, మన కష్టం మాత్రమే మనకు విజయాన్ని, మంచి సమయాన్ని తెచ్చిపెడతాయి అంటూ రిథిక తన మాటలు ముగించారు.
స్త్రీగా వివక్ష
'ఒక మహిళగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినప్పుడు నేను ఎలాంటి భయానికి, నూన్యతాభావానికి గురికాలేదు. కానీ మెటీరియల్ కోసం ఆర్డర్స్ పెట్టినా, ప్రింటింగ్‌కు ఆర్డర్స్ ఇచ్చినా ఒక మహిళ అని, నాది ఏదో హోం బిజినెస్ అన్నట్టు నా ఆర్డర్స్‌పై ఆసక్తి చూపేవారు కాదు. ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చేది. అక్కడ మగవారి మధ్య నన్ను తక్కువగా చూసినప్పుడు బాధ వేసేది. కానీ నేను పట్టవదలక కొనసాగించా ఈ బిజినెస్' అంటారు రిథిక.
- జ్యోత్స్న దేవి దేవరకొండ, 7842171357