Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధా స్రవంతి రస్తోగి... ఓ ఆర్టిస్ట్, ఆర్ట్ టీచర్. హైదరాబాద్ నగరంలో సాలార్జంగ్ మ్యూజియంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఈమె గీసిన చిత్రం కూడా ప్రదర్శనలో వుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా మార్చి 14న మొదలైన ఈ చిత్రకళా ప్రదర్శన మార్చి 31, 2023 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కేరళ మురల్ ఆర్ట్‌లో తన ప్రతిభను కనబరుస్తూ, మరెందరినో కళాకారులుగా తీర్చిదిద్దుతున్న ఆమె కళా ప్రయాణం
నేటి మానవిలో...
సాలార్జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ''ఆర్ట్ ఫ్రమ్ హార్ట్'' చిత్రకళా ప్రదర్శనలో నా కేరళ మురల్ పెయింటింగ్ కూడా చోటు చేసుకోవటం ఎంతో ఆనందంగా వుంది. అక్కడ జరిగే ప్రదర్శన కోసం చిత్రాల ఎంపిక జరుగుతుందని తెలిసి నేను పూర్తిగా ఈ చిత్రం గీయటం పైనే మనసు కేంద్రీకరించాను. నా చిత్రంలో 'స్త్రీ'ని 'దేవతా రూపం'లో చూపించాలని. మహిళ ఎంతటి కష్టం వచ్చినా చాలా ప్రశాంతంగా వాటిని ఎదుర్కొని నిలబడుతుంది. అందుకనే చిత్రంలో నీలి రంగులను, అలాగే స్త్రీ చూపించే ప్రేమ, ఆప్యాయతలు కోసం లేత రంగులని ఎంచుకున్నాను. చిత్రం అందంగా ఉండేందుకు లేత గులాబీ రంగుని ఎంచుకున్నాను. ఆమె చిరునవ్వు, చూపు అన్నీ కూడా తన చుట్టు వున్న వాటిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తాయి. ఇలా నాలో కలిగే ఎన్నో భావాలు ఈ చిత్రంపై చిత్రీకరించాను'' అంటూ ఈ పెయింటింగ్ గీయటంలో తన అనుభవాలను తెలిపారు సుధా రస్తోగి. మురల్స్ ఆర్ట్ అంటే గోడలపై గీసే కుడ్య చిత్రాలు. ఇవి సాంప్రదాయకంగా కేరళలో మనకి కనిపించే చిత్రాలు. ఎక్కువగా దేవతలు, దేవుళ్ళ చిత్రాలను పెద్ద పెద్ద గోడలపై గీస్తారు. సుధకు ఈ చిత్రం గీయటానికి 34 గంటలు పట్టింది. దీనికోసం ఆయిల్ కలర్స్, అక్రిలిక్ కలర్స్‌ని ఉపయోగించారు.
అకాడమీ స్థాపించి
నగరంలోని శాలివాహన నగర్, ఎల్లారెడ్డిగూడాలో నివాసముంటున్నారు సుధ. డిగ్రీ పూర్తి చేసి అక్కినేని హార్ట్ యానిమేషన్ అకాడమీలో 2డి ట్రెడిషనల్ యానిమేషన్ కోర్స్ చేసారు. అనంతరం అక్కడే ఉద్యోగంలో చేరారు. పవన్ రస్తోగితో వివాహం తర్వాత తిరిగి ఆర్ట్ టీచర్‌గా పర్ ఫెక్ట్ స్ట్రోక్ అకాడమీలో 2010 నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఫ్రీహాండ్ డ్రాయింగే కాదు సాఫ్ట్ వేర్ రంగంలోనూ ఈ కళలో మరింత రాణించడానికి కొన్ని కోర్స్‌లు చేశారు. భర్త కూడా ఫైన్ ఆర్ట్స్ రంగంలో ప్రసిద్దులే. ఇరువురు కలిసి ఈ ఆకాడమీని చూసుకుంటున్నారు. యానిమేషన్లో ఫ్యాకల్టీగా, 2డి ,3డి యానిమేషన్, ఫైన్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా 23 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వీరు ఎందరో చిన్నారులకు పేయింగ్ నేర్పించే కళాకారిణి. సృజనాత్మకత కలిగిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. నేడు ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక టెక్నాలజీలోనూ దూసుకుపోతున్న ఆర్టిస్ట్. సాంకేతిక నైపుణ్యంలో వీరు ట్రాక్ రీడింగ్, ఎక్స్ పోజర్ షీట్లు, టైమింగ్ చార్ట్స్, అక్షరాలు, లేఅవుట్ల కోఆర్డీనేషన్, యానిమేషన్, టైమింగ్, స్పెసింగ్ వంటివి ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి.
ఎందరికో శిక్షణ
2010 నుండి వీరు సొంత ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌ని నడిపిస్తున్నారు. 2డి, 3డి యానిమేషన్లో భాగంగా యానిమేషన్, కార్టూన్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ అన్ని వయసుల వారికి 40 రకాల కళలు, చేతిపనులు నేర్పిస్తూ వుంటారు. ఇంటీరియర్ డిజైనింగ్, హోమ్ డెకర్, ల్యాండ్ స్కేపింగ్ వర్క్‌లను కూడా తీసుకుంటారు. సబ్జెక్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌తో కూడిన అనేక రకాల హాబీలను బోధించడం వీరి ప్రత్యేకం. అవసరం అయితే విజిటింగ్‌కి కూడా చేస్తుంటారు. ''రూట్స్ కోలీజియం''లో ఆర్ట్ టీచర్‌గా కూడా పాఠాలు చెబుతున్నారు.
ఎంతో అనుభవం
సుధకు అనేక యానిమేషన్ చిత్రాలకు, ప్రముఖ టీవి నిర్మాణ సంస్థలలోనూ యానిమేటెడ్ ప్రకటనలలో 'కీ' యానిమేటర్‌గా పనిచేసిన అనుభవం వుంది. చిన్నపిల్లలు, పెద్దలూ ఎంతో ఆసక్తిగా చూసే 'మిష్టర్ బీన్', 'లవ్ లైన్ వంటి వాటికి డైరెక్టర్, కీ యానిమేటర్‌గా పని చేశారు. అలాగే డిస్కవరీ చానెల్ కోసం కూడా పని చేశారు. పద్మాలయా టెలీ ఫిల్మ్స్, డిస్కవరీ చానెల్, వార్నర్ బ్రదర్స్, యుఎస్ఏ వారి కోసం, పోర్చ్ లైట్ ఎంటర్ టైన్మెంట్ ఇలా ఎన్నో ప్రముఖ సంస్థలలో యానిమేటర్‌గా పని చేసిన అనుభవం వుంది. అటు ఆకాడమీని చూసుకుంటూ, ఇటు ప్రముఖ సంస్థలలో పని చేస్తూ, పెయింటింగ్ కళపై ఆసక్తి గల వారికి స్టూడియోలోనూ, అడిగిన వారికి ఇంటికి వెళ్ళి కూడా ఈ కళని నేర్పిస్తున్నారు.
ఎన్నో రకాల కళలు...
పిల్లలలోని సృజనాత్మకతకు పదును పెట్టే చోటు ''పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ఆర్ట్ అకాడమి'' ఇక్కడ క్రియేటివిటికి ఎన్నో దారులు వున్నాయి. ''తల్లి తండ్రులు తమ పిల్లల అభిప్రాయాలకి విలువ నిస్తున్నారు. తమ పిల్లలు ఏం కోరుకుంటున్నారో దానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే మా వద్దకు వచ్చే స్టూడెంట్. మా దగ్గర డ్రాయింగ్, స్కెచ్చింగ్, తంజావూర్ పెయింటింగ్, 3డి మురల్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, ఫాబ్రిక్ పెయింటింగ్, స్టైన్ వుడ్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, కేరళ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్సింగిల్ స్ట్రోక్ పెయింటింగ్ ఇలా ఎన్నో రకాల పెయింటింగ్స్ వున్నాయి. ఆసక్తి గల విద్యార్ధులకి అన్నీ నేర్పిస్తాము. అంతే కాదు పాలిమర్ క్లే, టెర్రకోట జ్యూవలరి, క్విల్లింగ్, పంచ్, క్రాఫ్ట్, చాక్లెట్ తయారి, కాండిల్ తయారి వంటివి కూడా నేర్పిస్తాము'' అని తమ ఆర్ట్ క్లాస్‌లో నేర్పించే అంశాల గురించి చెప్పారు.
ఎక్కువగా ఆదరిస్తున్నారు
''నేర్చుకోటానికి వయసుతో నిమిత్తం లేదు. రిటైర్ అయిన వాళ్ళు కూడా మా వద్దకు వస్తారు. పెయింటింగ్ ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. మహిళలు కూడా తమ కిట్టీ పార్టీలలో క్రాఫ్ట్, పెయింటింగ్ క్లాసెస్ పెట్టేవారు. సమ్మర్ కాంప్స్ పెడుతుంటారు. తరచుగా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటారు. ''3డి సాస్ పెసొ ఆర్ట్''ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలాగే టెర్రకోట జ్యువెలరీ, పేపర్‌తో చేసే కీ చైన్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి'' అని అంటారు సుధ.
ప్రముఖుల పిల్లలు...
సుధలోని కళా నైపుణ్యానికి గుర్తుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. చిన్నతనంలోనే అభినందన జీవనరత్న అవార్డ్, వంశీ వారి బాల రత్న అవార్డు, వాసవి వారి ఆల్ రౌండర్ అవార్డు, కామ్లిన్ వారి స్టేట్ లెవెల్ అవార్డులు అందుకున్నారు. 1998లో ఉమెన్ ఆఫ్ టుమారో ఫైనల్స్ వరకు వచ్చారు. ఎన్నో ఫైన్ ఆర్ట్ వర్క్ షాప్‌లు నిర్వహించారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అతని కుమార్తె, అతని మనవరాళ్ళు, అల్లు అర్జున్ పిల్లలు, రాజమౌళి అమ్మాయిలు వీరి దగ్గర ఆర్ట్ నేర్చుకున్నారు. అలాగే వీరి అన్నమయ్య (7వ తరం) మనవరాలు, మహేష్ బాబు కూతురు, సిరివెన్నెల సితారామయ్య మనవరాలు, సబితారెడ్డి మనవరాలు, జీవీకే మనవరాలు, జానారెడ్డి మనవరాలు, మనవడు ఇలా ఎందరో ప్రముఖుల పిల్లలు వున్నారు. ఈమె 2023 సంక్రాంతి నాడు తిరుమల దేవస్థానంలోని ఉత్తమ అతిథి గృహాలలో వీరు చిత్రించిన 12 అడుగుల తంజావూరు పెయింటింగ్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రముఖ చిత్రకారుడు జయదేవ్ బాబు రచించిన యానిమేషన్ గురించి రాసిన పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. అలాగే తాను కోర్సు చేసిన అక్కినేని హార్ట్ యానిమేషన్లోనే అసిస్టెంట్ యానిమేటర్‌గా ఏడాదిపైగా పనిచేశారు.
సృజనాత్మకత వుంటే...
భారతీయుల పురాతన చిత్ర కళలకి మెరుగులు దిద్దుతూ కొత్త కొత్త కళలను తమదైన శైలిలో సృష్టిస్తూ దంపతులు ఈ కళను ఆసక్తి కలవారికి నేర్పిస్తున్నారు. వీరు పెయింటింగ్‌లు ఎందరో కళాభిమానుల ఇళ్ళలో అలరిస్తున్నాయి. విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. వీరి పిల్లలు కూడా తల్లి తండ్రుల అడుగుజాడల్లోస నడుస్తూ ఎన్నో మంచి ఆర్ట్ వస్తువులు తయారు చేస్తున్నారు. ''సృజనాత్మకత వుంటే భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రజలలో కుడా చైతన్యం వస్తోంది. ఈ కళని బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆర్ట్‌లో ప్రసిద్దులైన రాజ రవివర్మ పెయింటింగ్స్ ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఆ తర్వాత కూడా ఎంతో మంది తమ కళ ద్వారా పైకి వచ్చారు. ఎప్పటికీ ఈ ఫైన్ ఆర్ట్స్ కళలు ధ్రువ తరలా వెలుగొందుతూనే వుంటాయి'' అంటారు ఆమె.
- మణినాథ్ కోపల్లె, 9703044410