Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో దాహార్తి ఓ పట్టాన తీరదు. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరినట్టు అనిపించదు. వేసవిలో కొన్ని జ్యూస్‌లు మన దాహాన్ని తీర్చి ఈ మండు వేసవిలో మనల్ని చల్లచల్లగా ఉంచుతాయి. అలాంటి కొన్ని జ్యూస్‌లు ఈ రోజు మీకోసం... ఓ సారి ట్రై చేయండి...
కీర జ్యూస్
వేసవి తాపం తీరటం కోసం సాధారణంగా కీర తింటాం. ఇది అందరూ చేసే పనే. కానీ దీనికి ఇంకొన్ని పదార్థాలు చేర్చి జ్యూస్ చేసి తాగితే మరింత చలువు చేస్తుంది. పైగా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మరి అలాంటి కీరా జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు : కీరా - రెండు (తొక్క తీసి ముక్కలు చేయాలి), నీళ్లు - అర లీటరు, చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు, తేనె - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం : కీరా ముక్కలు బ్లెండర్లో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని వడగట్టాలి. ఈ రసంలో నీళ్లు, ఉప్పు, చక్కెర, తేనె కలపాలి. గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్(ఇష్టం వుంటే) వేసి తాగేయాలి.
జింజర్ జ్యూస్
అల్లం రసం రోజూ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 లాంటి ఎన్నో పోషకాలుండే అల్లం రసం రోజూ తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు : అల్లం - వంద గ్రాములు, నిమ్మరంస - నాలుగు టేబుల్ స్పూన్లు, చక్కెర - వంద గ్రాములు, నీళ్లు - లీటరు.
తయారు చేసే విధానం : బ్లెండర్లో అల్లం ముక్కలు వేసి రసం తీసుకోవాలి. నీళ్లలో చక్కెర వేసి కలిపి, అందులో అల్లం రసం వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం వేసి కలపాలి. గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసుకుని తాగేయాలి.
యాపిల్, బీట్రూట్తో...
విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాపర్ ఉండే బీట్రూట్ జ్యూస్ తాగితే వేసవి బడలిక తీరుతుంది. ఈ జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను బయటికి వెళ్లగొట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు : యాపిల్స్ - రెండు (తొక్క తీసి ముక్కలు కోయాలి), బీట్ రూట్ - ఒకటి (తొక్క తీసి ముక్కలు కోయాలి), చక్కెర - టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం : బ్లెండర్లో యాపిల్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసి తిప్పాలి. ఈ జ్యూస్‌ను గ్లాసులో పోసి చక్కెర వేసి కలపాలి. ఐస్‌క్యూబ్స్ వేసి తాగేయాలి.
గోల్డెన్ డ్రింక్
వేసవిలో చెమట ద్వారా ఖనిజ లవణాలను కోల్పోతాం. కాబట్టి ఎండాకాలం అలసట, నీరసం మనల్ని వేధిస్తాయి. ఈ బాధ నుంచి ఉపశమనం పొందాలంటే కోల్పోయిన మినరల్స్‌ను భర్తీ చేయాలి. అందుకే ఈ గొల్డెన్ డ్రింగ్ తాగాలి.
కావల్సిన పదార్థాలు : పైనాపిల్ ముక్కలు - కప్పు, బొప్పాయి ముక్కలు - కప్పు, తేనె - టీస్పూను, నీళ్లు - గ్లాసు, నిమ్మరసం - అర టీస్పూను, ఉప్పు - చిటికెడు.
తయారు చేసే విధానం : పైనాపిల్, బొప్పాయి ముక్కలు, నీళ్లు జ్యూసర్లో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని వడగట్టి తేనె, నిమ్మరసం, ఉప్పు కలుపుకోవాలి. గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసి తాగేయాలి.
క్యారెట్‌తో...
క్యారెట్స్‌లో ఎక్కువ మొత్తంలో బీటా కెరోటిన్స్ ఉంటాయి. బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఎ. ఈ విటమిన్ వల్ల చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కావల్సిన పదార్థాలు : క్యారెట్లు - పావు కిలో (కడిగి తొక్క తీసి ముక్కలుగా కోయాలి), నీళ్లు - అర లీటరు, పంచదారా - రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం : బ్లెండర్లో క్యారెట్ ముక్కలు, నీళ్లు, చక్కెర వేసి తిప్పాలి. ఈ జ్యూస్‌ను గ్లాసులో వడగట్టాలి. ఐస్‌క్యూబ్స్ వేసి తాగేయాలి.