Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవి... చెట్లను కాపాడుతుంది. చెట్లు వర్షాన్ని కురిపిస్తాయి. ఆ వర్షం రైతును కాపాడుతుంది. రైతు సంతోషంగా ఉంటే... దేశం సుభిక్షంగా ఉంటుంది. పైవాటన్నింటినీ కాపాడే అడవిని కాపాడేదెవరు? స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసి వన సంపదను రక్షించేది ఎవరు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా! అని అందరికీ తోస్తుంది. కానీ... జార్ఖండ్‌లోని మాటుర్ఖమ్ గ్రామం తన అడవిని తానే కాపాడుకుంటోంది. మాఫియాను తరిమికొడుతూ తన సాల్ చెట్లను రక్షించుకుంటోంది.
ఈ సాల్ వృక్షాల కలప చాలా గట్టిది. దీంతో దీనికి డిమాండ్ ఎక్కువ. సాలు వృక్షాలు ఎక్కువగా ఉన్న గ్రామం మీద కన్నేసింది మాఫియా. అక్కడ కలపను నరికి అక్రమంగా తరలిస్తోంది. అదే ఊరికి కోడలిగా వచ్చిన జమున.. వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అక్కడ కొందరు చెట్లను నరకడం చూసింది. ఈ తంతు కొన్ని రోజులపాటు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వారిని అడగేందుకు ముందుకు రావడం లేదు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలి. తనకు పరిచయమున్న ఆడవాళ్లందరితో మాట్లాడింది. చెట్లను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. మొదట మనకేమొస్తుందిలే అనుకున్న మహిళలు ఆ తరువాత జమునకు తోడుగా వచ్చారు. అడ్డుకునేందుకు తమకు మద్దతుగా రావాలని మగవాళ్లను అడిగారు. వారు ఆసక్తి చూపించకపోవడంతో జమున నాయకత్వంలో మహిళలే ముందుకు కదిలారు. చెట్లు నరికేవారిని తరిమికొట్టారు. అక్కడితో ఆగిపోలేదు. గ్రామంలోని గడపగడపకీ తిరిగి చెట్లని కాపాడుకోవాల్సిన అవసరంపై అవగాహన కలిగించారు. చెట్లనే కాదు అడవిలో ఉన్న జంతువులను కాపాడుకోవడము తమ బాధ్యత అంటూ అందరికీ తెలియజెప్పారు. అడవిలోని జంతువులను వేటాడవద్దని గ్రామస్తులకు సూచించారు.
ఇప్పుడు జమున టీమ్‌లో ఆడా, మగా అందరూ ఉన్నారు. వీరి దగ్గర పిస్తోళ్లు, గన్నులు లేవు. అందుకనీ కర్రలు, బాణాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. మగవాళ్లు రాత్రిపూట కాపలా కాస్తారు. ఆడవాళ్లు ఉదయం కాపలా ఉంటారు. వీళ్ల గురించి తెలిసిన అటవీశాఖ అధికారులు. గ్రామాన్ని 'ఆదర్శ గ్రామంగా' ఎంపిక చేశారు. ఇప్పుడు ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సీసీ రోడ్లు, విద్యుత్ కనెక్షన్ వచ్చాయి. అయితే జమున తన సొంత స్థలంలో స్కూలుని కట్టించి గిరిజనుల పిల్లలకి చదువు చెప్పిస్తోంది.