Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతో చూపు లేకపోతే అదో భరించలేని బాధ. ఎలాగో అలవాటు పడిపోతాం. అయితే జీవితంలో ఓ స్థాయికి వచ్చి ఉద్యోగం సంపాదించి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చూపు పోతే. ఇక ఆ బాధ మాటల్లో చెప్పడం కష్టం. అప్పటి వరకు అంతా చూస్తున్న ఆ కండ్లు ఇక ఏమీ చూడలేవని తలచుకుంటే... గుండెలు జారిపోతాయి. అలాంటి బాధనే భరించారు నాగేంద్రమ్మ. తన బిడ్డకు ఆరేండ్లున్నపుడు కండ్లతో చూసుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ రూపు రేఖలు ఎలా ఉంటాయో తెలియదు. ఇది తలచుకుంటే ఆమెకు ఏడుపు తన్నుకొస్తుంది. చూపు కోల్పోయిన కొత్తలో రెండేండ్లు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. చివరకు డాక్టర్లు, భర్త, బిడ్డ ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాదు తనలాంటి వారికి చేతనైన సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే బ్లయిడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దానికి మహిళా కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం నేటి మానవిలో...
నాగేంద్రమ్మ ఖమ్మం జిల్లా, ఎర్రిపాలెం మండలం, జమలాపురం గ్రామంలో పుట్టారు. తండ్రి భూక్యా పరుసు కార్పెంటర్‌గా పని చేస్తున్నారు. తల్లి చిట్టెమ్మ. వీరికి నలుగురు పిల్లలు. నిరుపేద కుటుంబం. అయినా ఎంతో కష్టపడి అందరినీ చదివించాడు తండ్రి. నగేంద్రమ్మ ఇంట్లో అందరి కంటే పెద్దది. సెలవులు వస్తే తను కూడా ఏదో ఒక పనికి పోయి ఆర్థికంగా సహకరించేది. చెల్లెళ్ళు, తమ్ముడుని కూడా తనే చూసు కునేది. పదో తరగతి చదవడానికి వారి ఊరి నుండి 7 కి.మీ నడిచి వెళ్ళేవారు. అప్పట్లో బస్సులు కూడా ఉండేవి కావు. అంత కష్టపడి చదువుకున్నారు. ఆమె ఇంటర్‌కి వచ్చే వరకు కనీసం వాళ్ళ ఇంట్లో కరెంట్ కూడా లేదు. డిగ్రీ ఖమ్మం ఉమెన్స్ కాలేజీలో పూర్తి చేశారు. బి.ఇడి హన్మకొండలో పూర్తి చేశారు.
ఉద్యోగం సంపాదించి...
డిగ్రీ తర్వాత బంధువుల అబ్బాయి సామ్యతో పెండ్లి జరిగింది. తర్వాత భర్త ప్రోత్సాహంతో హన్మకొండలో బిఈడ్ చేశారు. 2010లో కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మె ఓపెన్‌గా పూర్తి చేశారు. 2002లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. సొంత గ్రామంలో తను చదువుకున్న పాఠశాలలోనే 9 ఏండ్లు చేశారు. తర్వాత 2010లో హెడ్ మాస్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. దాంతో వాజేడు మండలం, అరుణాచలపురంలో కొన్ని నెలలు పని చేశారు. ఆ తర్వాత పినపాక మండలం, ఎల్చిరెడ్డిపల్లికి బదిలీ అయ్యారు. ఆ ప్రాంతం అత్యంత దూరంగా ఉంటుంది. ఆ సమయానికి వీరికి నాలుగేండ్ల పాప జోషరిత ఉంది. పాపను వదిలి అంత దూరం ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చేది. ప్రయాణం కూడా చాలా కష్టంగా ఉండేది. బస్సులు కూడా సరిగా ఉండవు. దాంతో అక్కడే ఓ గది తీసుకుని వుంటూ వారాంతరాల్లో ఖమ్మం వచ్చి పోయేవారు.
అకస్మాత్తుగా...
నాగేంద్రమ్మకు చిన్నతనం నుండి కంటి సమస్య ఉంది. ఏడో తరగతికి వచ్చే సరికి అక్షరాలు సరిగా కనిపించేవి కాదు. దాంతో తండ్రి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ తాత్కాలికంగా కళ్ళజోడు ఇచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళి చూపించే అవగాహన కానీ, ఆర్థిక స్థోమత కానీ అప్పట్లో ఆయనకు లేవు. దాంతో నాగేంద్రమ్మ అలాగే తన చదువు కొనసాగించారు. అప్పుడు ఆమె ఎల్చిరెడ్డి పల్లిలో ఉద్యోగం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా తెల్లవారు జామున 5గంటలకు భర్త ఆమెను బస్సు ఎక్కించేందుకు ఖమ్మం బస్టాప్‌కు వచ్చాడు. ఆకస్మాత్తుగా ఆమెకు కొన్ని సెకండ్లు కండ్లు తిరిగాయి. తర్వాత ఏమీ కనిపించడం లేదు. కండ్ల జోడు ఉన్నా ఏదో నీడ మాత్రం కంటి ముందు కనిపిస్తుంది. అప్పుడు ఆమె వయసు 34 ఏండ్లు. సరిగా నిద్రలేకపోవడం వల్లనేమో కొద్ది సేపటిలో అంతా మామూలు అవుతుందనికుని అలాగే బస్సు ఎక్కి నిద్రపోయారు. చివరకు తను దిగాల్సిన స్టేజ్ వచ్చింది అయినా కంటి ముందు అంతా అలికినట్టే ఉంది. ఏమీ కనిపించడం లేదు. దాంతో స్కూల్లో మధ్యాహ్నం వరకు ఉండి సెలవు పెట్టి ఓ మాస్టారు సహాయంతో బస్సు ఎక్కి ఖమ్మం వచ్చి భర్తకు చెప్పారు. వెంటనే ఖమ్మంలోనే ఓ డాక్టర్ దగ్గరకు వెళితే హైదరాబాద్ వెళ్ళి చూయించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
కుంగిపోయారు...
హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళితే అన్ని రకాల టెస్టులు చేశారు. రెండు మూడు రోజులు పట్టింది. కోటి మందిలో ఒక్కరికి ఇలాంటి సమస్య వస్తుందన్నారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదన్నారు. ప్రస్తుతం ఆమెకు పగలు, రాత్రి మాత్రమే తెలుస్తాయి. ముందు ఎవరో మనిషి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఎవరో అర్థం కాదు. ఈ చూపు కూడా ఎంత కాలం ఉంటుందో చెప్పలేము అన్నారు. తర్వాత ఎంతోమంది డాక్టర్లను కలిశారు, అయినా లాభం లేదు. తెలిసిన వారు చెబితే చివరగా సరోజిని ఆస్పత్రికి వెళ్ళారు. ఎక్కడో చిన్న ఆశ ఆమెలో. కానీ అక్కడ కూడా ట్రీట్మెంట్ లేదనే అన్నారు. దాంతో కుంగిపోయారు. తన భవిష్యత్తును, బిడ్డ జీవితాన్ని తలచుకుని భయపడ్డారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించ లేదు. ఆమె భయాన్ని గమనించి సరోజని ఆస్పత్రిలోని సీనియర్ డాక్టర్ విశ్వనాథ్ ధైర్యం చెప్పి ట్రైనింగ్ ఇప్పించారు.
సహాయకురాలి సాయంతో...
ఆ తర్వాత రెండేండ్లు బాగా ఇబ్బంది పడ్డారు. సంతకం కూడా పెట్టలేని పరిస్థితి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. అంధ ఉద్యోగులకు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుందని ఎవరో చెప్పారు. ఆ సర్టిఫికేట్ ఉంటే ఒక సహాయకురాలి ద్వారా తన ఉద్యోగాన్ని చేసుకోవచ్చని తెలిసింది. దాంతో వెంటనే అందులో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు కొన్ని టెస్టులు చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. సహాయకురాలిని పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుండి సహాయకురాలికి 15 వందలు ఇస్తారు. ఆ కొద్ది మొత్తంతో రోజంతా ఆమెతో పని చేయడానికి ఎవరూ ముందుకురారు. అందుకే ఏడు వేలు ఇచ్చి ఆమే ఒక సహా యకురాలిని పెట్టుకున్నారు. ఆ సహాయకురాలు చది వితే ఆమె ఆ పాఠాన్ని పిల్ల లకు వివరి స్తాను. బోర్డుపైన రాయడం, హౌం వర్కులు, పేపర్లు దిద్దడం, ఆన్ లైన్ చేయడం అన్నీ ఆమే చూసుకుంటుంది. ప్రస్తుతం నాగేంద్రమ్మ ఖమ్మం టౌన్‌లోని దానివాయిగూడెం స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నారు.
తనలాంటి వారికి సాయం చేయాలని
చూపు పూర్తిగా కోల్పోయిన ఆమె బ్లయిడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌తో కలిసి పని చేస్తున్నారు. ఆ కుటుంబంలోకి వెళ్లడం తనకు ఎంతో ఓదార్పు నిచ్చిందంటున్నారు. అక్కడ తనకంటే ఎక్కువ ఇబ్బంది పడేవారిని చూసి వారి కంటే తన సమస్య చాలా చిన్నది కదా అని తనకు తానే ధైర్యం చెప్పుకునేవారు. తనలా ఇబ్బంది పడేవారికి తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ యూనియన్‌లో పని చేస్తున్నారు. మొదట్లో ఆ సంఘానికి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం మహిళా సెక్రటరీగా బాధ్యతలు చూస్తున్నారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా స్పందిస్తున్నారు. వారి సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ అంధులకు కూడా కావల్సిన సహకారం అందిస్తున్నారు.
సపోర్ట్ ఇవ్వాలి
మహిళలు సొంత కాళ్ళపై నిలబడడం చాలా అవసరం. చదువు దీనికి చాలా ఉపయోగపడుతుంది. చదువుంటే మనం గౌరవంగా బతకొచ్చు. అంతే కాదు అవకాశం ఉంటే మరొకరికి జీవితాన్ని కూడా ఇవ్వొచ్చు. నాలాంటి వాళ్ళను పై అధికారులు పరిశీలిస్తుండాలి. ఉద్యోగ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది తెలుసుకుని మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగ పరంగా నేను కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళుతున్నాను. మన ఊరు మన బడి అనే కార్యక్రమం నడుస్తుంది. ప్రతీది ఆన్లైన్ చేయాలి. చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి ఏడుపు వస్తుంది. నాకే కండ్లుంటే నా పని నేనే చేసుకునేదాన్ని కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నాకన్నా కనీసం పగలూ రాత్రి తెలుస్తుంది. ఈ చూపుకూడా లేని వారు ఎందరో ఉన్నారు. వాళ్ళను చూస్తూ నాకు నేను ధైర్యంగా చెప్పుకుంటాను. అయితే ఎం.ఈడి చేయాలనేది నా కోరిక. నాకున్న సమస్య వల్ల చేయలేకపోతున్నాను. ఈ కోరిక అలాగే ఉండిపోయింది.
కుటుంబం అండతో...
ఎంత ధైర్యంగా నా జీవితాన్ని, ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నా కొందరు ఎగతాళి చేస్తుంటారు. మా అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతుంది. ఎప్పుడో ఆరేండ్లు ఉన్నప్పుడు తన ముఖాన్ని చూశాను. ఇప్పుడు తను ఎలా ఉంటుందో కూడా తెలియదు. తలచుకుంటే ఏడుపు వస్తుంది. మొదటి నుండి కండ్లు లేకపోతే ఇంత బాధ ఉండేది కాదు. మధ్యలో ఇలా జరగడం వల్ల భరించలేని బాధను అనుభవిస్తున్నాను. ఇప్పటికీ ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఉంటాను. మావారు, మా అమ్మాయి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మా అమ్మాయి 'నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను మమ్మీ' అంటుంది. నా భర్త నాకు తోడుగా ఉండడం కోసం తన ఉద్యోగాన్ని వదిపెట్టేశారు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఇలా ఉన్నానంటే దానికి కారణం నా భర్త. అలాగే నా తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇచ్చిన ప్రోత్సాహమే.
- సలీమ