Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందంగా, ఆకు పచ్చని రంగులో చూడముచ్చటగా ఉండే క్యాప్సికమ్‌ను తినడానికి మాత్రం ఎవరూ ఎక్కువగా ఇష్టపడరు. కానీ, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్ ఎ, సిలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు, ఇది కళ్లను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఇది దివ్వౌషధం. కాబట్టి, వీలైనంత ఎక్కువగా క్యాప్సికమ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాప్సికమ్‌తో తయారు చేసే కొన్ని వెరైటీ వంటలను ప్రయత్నిద్దామా!
బట్టర్ రైస్
కావలసిన పదార్థాలు : ఉడికించిన అన్నం - 2 కప్పులు, కాప్సికమ్ - ఒకటి, పచ్చిమిర్చి ముద్ద - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, జీడిపప్పు - 8, మిరియాల పొడి - అర టీ స్పూను, దాల్చిన చెక్క - చిన్న ముక్క, కొబ్బరి పొడి - ఒక టీ స్పూను, బటర్ - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా;
తయారీ విధానం : ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో బటర్, నెయ్యి వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక అందులో దాల్చిన చెక్క, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తక్కువ మంటమీద కొన్ని సెకన్లపాటు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి నాలుగు నిమిషాలు వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించకూడదు.
ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, ఉప్పు కలపాలి. ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. చివరగా కొబ్బరి పొడి, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలపాలి. అంతే బటర్ క్యాప్సికమ్ రైస్ రెడీ. దీన్ని చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
క్యాప్సికమ్ కారం
కావలసిన పదార్థాలు : క్యాప్సికమ్ - రెండు, వేయించిన పల్లీలు - అర కప్పు (పొట్టు తీయాలి), ఎండుమిర్చి - 10, జీలకర్ర - ఒక టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూను, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు;
తయారీ విధానం : ముందుగా ఒక పాన్‌లో ఎండుమిరపకాయలు, జీలకర్రలను నూనె లేకుండా వేయించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటికి వెల్లుల్లి, కొబ్బరి పొడి, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మిక్సీ చేసుకున్న పల్లీ కారం కలిపి రెండు నిమిషాలు వేయించుకోవాలి. అంతే క్యాప్సికమ్ కారం రెడీ. ఇది అన్నంలో మంచి కాంబినేషన్.
చీజ్ పరాటా
కావలసిన పదార్థాలు : క్యాప్సికమ్ - 4, పెరుగు - పావు కప్పు, గరం మసాలా పొడి - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, గోధుమ పిండి - రెండు కప్పులు, చీజ్ స్లైసులు - తగినన్ని, నూనె - తగినంత;
తయారీ విధానం : ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి కొద్ది సేపు నాననివ్వాలి. ఈలోపు క్యాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి కచ్చాపచ్చగా తయారు చేసుకోవాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, గరం మసాలా పొడి, ఉప్పు, చీజ్ వేసి బాగా కలపాలి. చపాతీ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకొని చిన్న చపాతీలా ఒత్తుకొని మధ్యలో క్యాప్సికమ్ మిశ్రమాన్ని పెట్టి అంచులతో మూసేయాలి. దీన్ని కూర బయటికి రాకుండా చపాతీలా నెమ్మదిగా వత్తుకోవాలి. స్టౌ మీద పెనం పెట్టి చపాతీకి చుట్టూ నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే చీజ్ క్యాప్పికమ్ పరాటా రెడీ.
స్టఫ్ క్యాప్సికమ్
కావలసిన పదార్థాలు : క్యాప్సికమ్ - 5 (తొడెం తీసి లోపలున్న విత్తనాలను స్పూన్‌తో తొలగించాలి), బంగాళదుంపలు - 5 (ఉడికించి తొక్క తీసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి), పచ్చి బఠానీలు - ఒక కప్పు (ఉడికించినవి), నూనె - 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2టీ స్పూను, ఉల్లిపాయలు - ఒకటి (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి), ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను, పసుపు - 1/2టీ స్పూను, కారం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం : ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న బంగాళదుంపలు, ధనియాలపొడి, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ వేయించుకోవాలి. అలాగే ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠానీలు కూడా వేసి కలపాలి. కొద్దిసేపు వేగనిస్తే ఆలూ స్టఫ్ రెడీ అయినట్లే.
ఆలూ స్టఫ్‌ను పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తీసుకొని అందులో ఆలూ మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక అందులో స్టఫ్ చేసుకొన్న క్యాప్సికమ్‌లను ఒకొక్కటి వేసుకోవాలి. వీటిని అన్ని వైపులా సమంగా వేగే వరకూ తిప్పుతూ కొద్దిగా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మగ్గిన తర్వాత తీసి వేడి వేడి పరాటాలు లేదా రోటీలతో సర్వ్ చేయవచ్చు.
కాజు మసాలా
కావలసిన పదార్థాలు : క్యాప్సికమ్ - 6, పాలు - 1/2కప్పు, ఉల్లిపాయలు - 3, వెల్లుల్లి రెబ్బలు - 15, పసుపు - 1/2టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను, కొబ్బరి తురుము - ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు - 15, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1/2కప్పు;
తయారీ విధానం : గంట ముందుగా జీడిపప్పు, గసగసాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అందులో కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగాక క్యాప్సికం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత, అందులో పాలు, ముందుగా మిక్సీ చేసుకొన్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది. నూనె పాన్‌కు సైడ్స్‌లో అంటుకుంటూ వేరుపడుతున్నట్లు కనబడుతుంది. అంతే కాజు క్యాప్సికమ్ మసాలా రెడీ అయినట్లే.