Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా సంస్థలు అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారు. కొత్త వారికి అంత త్వరగా ఉద్యోగాలు ఇవ్వరు. అలా కొంత మంది ఏ సంస్థకు దరఖాస్తు చేసుకున్నా.. అనుభవం లేదంటూ తిరస్కరణకు గురవుతుంటారు. అలాంటి వారి లిస్టులో మీరూ ఉన్నారా..? అయితే ఇలాంటప్పుడు రెజ్యూమె రూపొందించడంలో మెలకువలు పాటించాలంటున్నారు నిపుణులు.
మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొనే ఇంట్రడక్షన్ బలంగా ఉండాలి. పేరు, చిరునామా తర్వాత మీకున్న నైపుణ్యాల వివరాలను క్లుప్తంగా పొందుపరచాలి. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి మీ నైపుణ్యాలెలా ఉపయోగపడతాయో కూడా అక్కడే వివరించడం మంచిది. అది మీ గురించి తక్కువ సమాచారంలోనే కూలంకషంగా తెలియజేసినట్లు అవుతుంది. ఇవన్నీ దరఖాస్తు పరిశీలించేవారికి మీపై సానుకూల అభిప్రాయం కలిగిస్తాయి.
- విద్యార్హత హైలైట్ చేయాలి. తాజాగా పూర్తి చేసిన విద్యార్హత ముందుండాలి. ఎక్కడ, ఏ కాలేజీ లేదా ఇన్స్టిట్యూట్, ఏ ఏడాదిలో పూర్తయింది వంటివన్నీ వరుసగా రావాలి. చదువుతోపాటు సాధించిన అవార్డులు, పురస్కారాలు, గౌరవాలు వంటివీ జోడించాలి. ప్రత్యేక కోర్సులాంటివి పూర్తిచేస్తే వాటికీ చోటివ్వాలి. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉంటే వాటినీ చేర్చాలి. ప్రాముఖ్యతనివ్వాలి.
- ఉద్యోగ అనుభవం లేకపోయినా, మీ నైపుణ్యాలేంటో అవతలివారికి తెలియజేయాలి. వాటి ఆధారంగా ఎంపికయ్యే అవకాశాలూ ఎక్కువే. కమ్యూనికేటర్గా మీకు మంచి పేరుండొచ్చు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో నైపుణ్యం ఉండొచ్చు. ఈ వివరాలన్నీ మీకున్న నైపుణ్యాలుగా పొందుపరిచి చూడండి.
- ఎక్స్ట్రాకరిక్యులర్ ఆక్టివిటీస్లో పాల్గొన్న అనుభవం, ఏదైనా వలంటీర్ వర్క్, కమ్యూనిటీ సర్వీస్, లీడర్షిప్ రోల్స్, టీం వర్క్ అనుభవం వంటి వాటినీ తెలియజేయాలి. వీటిని మీకున్న అదనపు నైపుణ్యాలుగా పరిగణిస్తారు. ఒక్కోసారి మీకు ఉద్యోగాన్ని అందించే అర్హతలుగానూ మారొచ్చు. మీ రెజ్యూమె అవతలివారిని ఇంప్రెస్ చేయగలిగితే చాలు. ఇంటర్వ్యూకు పిలుపొస్తుంది. ఆ తర్వాత పాటించాల్సినవి అనుసరిస్తే ఉద్యోగార్హత సాధించినట్లే.