Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద పెద్ద వృక్షాలను కుండీలలో చిన్నవిగా మార్చి పెంచే కళను బోన్సాయ్ అంటారని తెలుసు కదా! అలాగే తెల్లని ఇసుక, చిన్నచిన్న గులకరాళ్ళు ఉపయోగించి ప్రకృతి దృశ్యాలను సృష్టించే కళను 'బోన్సెకి' అంటారు. ఇది కూడా బోన్సాయ్లాగా జపాన్ దేశపు అతి పురాతన కళ. బోన్సెకి కళలో ఎక్కువగా పర్వతాలు, సముద్రతీరాలు, తోటలను వర్ణిస్తాయి. నల్లని ట్రేలను ఉపయోగించి వాటిపై చిత్రాలను చిత్రిస్తారు. దీని మూలాలు 7వ శతాబ్దం మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. టోక్యోలోని అనేక ఉద్యానవనాలు బోన్సెకి పద్ధతిలో సుందరీకరించినట్లుగా తెలుస్తున్నది. 13వ శతాబ్దంలో 'కోకన్ షిరేన్' అనే బౌద్ధ సన్యాసి 'రైమ్ ప్రోస్ ఆన్ ఎ మినియేచర్ ల్యాండ్‌స్కేప్ గార్డెన్' అనే వ్యాసంలో 'బోన్సెకి'కి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. దీనికి ఆదరణ లభించి పాఠశాలలు ఏర్పాటు చేసే స్థాయికి వెళ్ళినప్పటికీ ఆ తర్వాతి కాలంలో పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంతో బోన్సెకి బాగా క్షీణించింది. పాఠశాలలను ఏర్పాటు చేసిన వారిలో 'హౌసోకావా సన్సాయి' ప్రముఖులు. ఇటీవలి కాలంలో 'హౌసోకావా' పద్ధతులు పునరుద్ధరించబడ్డాయి.
సముద్రంలో కొండలు, ఆకాశంలో చంద్రుడు
దీర్ఘచతురస్రాకారంగా కానీ కోడిగుడ్డు ఆకాకరంలో గానీ ఉన్న ట్రేలను తీసుకొని అలంకరించాలి అనుకున్నాం కదా! ట్రే అడుగు భాగం నలుపు రంగులో ఉంటే చిత్రం బాగుంటుంది. దీని కోసం రకరకాల ఆకారాల్లో రాళ్ళు కావాలి. అలంకరణలో వాడే రాళ్ళు మాత్రమే తెచ్చుకోనవసరం లేదు. గరుకు గరుకుగా, వంకర టింకరగా ఉన్న రాళ్ళు కూడా పనికొస్తాయి. అలాగే ఇసుక కూడా ఎలా ఉన్నా వాడుకోవచ్చు. అంటే మనం తయారుచేసే చిత్రాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను రెండు పెద్ద పెద్ద రాళ్ళను తీసుకున్నాను. ట్రేలో రెండు కొండల్లాగా లేదా డీలాండ్ లాగా అమర్చాను. ఆ కొండలకు ఆనుకుని కొద్దిగా భూభాగం ఉన్నట్టుగా రాళ్ళతో కూడిన ఇసుకను పోశాను. సహజంగా ఉన్నట్లుగా వచ్చేలా ఇసుకను చల్లాలి. ఆకాశంలో చంద్రుడు ఉన్నట్టుగా గుండ్రంగా తెల్లని ముగ్గు పొడిని వెయ్యాలి. ఆకాశంలో వెన్నెల పరుచుకున్నట్టుగా ముగ్గను అక్కడక్కడా చల్లాలి. అదే విధంగా నీళ్ళు ఉన్నట్టుగా దాని మీద నురగ కనిపిస్తున్నట్లుగా ముగ్గు పొడిని వెయ్యాలి. ఇప్పుడు చూడండి. సముద్రంలో కొండలు, ఆకాశంలో చంద్రుడు కనిపిస్తూ పెయింటింగ్ వలె అద్భుతంగా ఉన్నది.
ల్యాండ్ స్కేప్
ఈ ఆర్ట్‌లో కొన్ని రకాల బ్రష్‌లు, నైఫ్‌లు, పక్షి ఈకలు ఉపయోగిస్తారు. ఆ సరంజామా అంతా మనం కొనుక్కోక పోయినా మన ఇంట్లో ఉండే వాటినే వాడుకోవచ్చు. బుగ్గలకు పింక్ షేడ్ వేసుకునే బ్రష్నూ, బ్రెడ్‌కు జామ్ రాసుకునే వెడల్పాటి కత్తినీ దీనిలో వాడుకుంటే నాకు అదే ఎఫెక్ట్ వచ్చింది. మా ఇంట్లో పావురాలు గూళ్ళు పెట్టుకుని కాపురముంటున్నాయి. కాబట్టి నాకు పక్షి ఈకలకు కొదవే లేదు. పావురం ఈకల్ని తీసుకుని ఇసుకను దారుల్లా చూపడానికి బాగుంటుంది. దీనిక్కూడా నలుపురంగు 'ట్రే'ను తీసుకోవాలి. జల్లెడ పట్టిన మెత్తని ఇసుకను తీసుకుంటే చిత్రం బాగా వస్తుంది. దీనికి కావాల్సిన వస్తువులు తక్కువే. కానీ ఊహలోనే ఎక్కువ పనితనం ఉంటుంది. కొండలు ఉన్నట్టుగా ఇసుకను కుప్పలుగా పోయాలి. అక్కడక్కడా మంచు కురిసినట్లుగా, కొద్దిగా చెట్ల మీద మంచు నిలిచినట్లుగా కనిపించేలా తీర్చిదిద్దాలి. ఇందులో వంపులు తిరిగిన రోడ్డులా కనిపించాలంటే ఇసుకను బ్రష్‌తో గానీ పక్షి ఈకతో గానీ మెల్లగా ఒంపులు తిప్పాలి. కార్లటైర్లు తిరిగినట్లుగా గుర్తులు కనిపిస్తాయి. రోడ్డు పక్కన చెట్లు దూరంగా కొండలు ల్యాండ్ స్కేప్ బాగుంటుంది.
రెండు కొండల మధ్య వంతెన
వంతెన కోసం పురికొస తాడున ఉపయోగిస్తే సరిపోతుంది. త్రికోణాకారంలో ఉన్న కొండను చూపెడు తున్నాం కాబట్టి మట్టి బెడ్డను కూడా వాడవచ్చు. ఎండిపోయిన ఎర్రమట్టి గడ్డను తీసుకోవాలి. ట్రేలో రెండు వైపులా రెండుకొండల తీరుగా నిలబెట్టాలి. ఈ కొండలు పూర్తి నలుపురంగులో ఉండకూడదు. ఎందుకంటే ఇది పగటి పూట దృశ్యం కాబట్టి. ఆకాశంలో సూర్యుని వెలుగులు ఉన్నట్లుగా చూపడానికి కాషాయరంగు ముగ్గును వాడుకోవచ్చు. ఈ కొండలు సముద్రంలో ఉన్నట్లుగా చూపడానికి కొద్దిగా నీలం రంగు ఇసుకను గానీ ముగ్గును గానీ వాడాలి. మామూలుగా నదుల మీద తాళ్ళ వంతెనను వేసినట్లుగా మనమిక్కడ కొండల మీద వంతెనను కడుతున్నాం. సూర్యుడున్నట్లుగా గుండ్రంగా తెలుపు రంగును దిద్దాలి. అయితే చంద్రుడికి పెట్టినంత తెల్లగా పెట్టుకూడదు. ఇప్పుడొక సుందర దృశ్యం ఆవిష్కృతమయింది.
పచ్చని ల్యాండ్ స్కేప్
దీన్ని చేయాలంటే ఆకుపచ్చ మొక్కల్ని తుంచి పెట్టాలి. నేల మీద గ్రీనరీ కావాలంటే వానకు వచ్చే నాచును తీసి పెట్టినా బాగుంటుంది. నేనిక్కడ ఆరు పలకలు కలిగిన చెక్క ట్రేను తీసుకున్నాను. ఇది ఎత్తు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా సులభంగా చేయవచ్చు. ఈ చెక్క ట్రే నిండుగా మామూలు ఇసుకను నింపాలి. ఇల్లు కట్టుకునేటపుడు వాడే చెక్కతో ట్రేను తయారు చేయించాను. అందుకే ఆరు పలకలుగా చేయించాను. మామూలుగా నాలుగు పలకలు గానే ఉంటాయి కదా! ఇది స్పెషల్ వర్క్ దీంట్లో రాళ్ళు అక్కడక్కడా పెట్టాలి. అక్కడక్కడా ఎండిపోయిన మొద్దులున్నట్టుగా చిన్న కొమ్మల్ని పెట్టాలి. పచ్చని చెట్ల కోసం కొన్ని మొక్కల్ని పెట్టాలి. మనుష్యుల్ని జంతువుల్ని కూడా పెట్టవచ్చు.
ల్యాండ్ స్కేప్‌లో ఇల్లు
ఇది కూడా పచ్చని ల్యాండ్ స్కేపే కానీ దీనిలో ఒక చిన్న ఇల్లు, చెట్లు, కుక్కను పెట్టాము. కుక్క కున్న ఇల్లులా దీన్ని అలంకరించాము. ఇక్కడ పచ్చదనం కోసం ఇసుకకు రంగు కలిపాము. అంతేగానీ పచ్చదనం లేదు. కుక్క అన్నం తినే గిన్నెలు, ఎముకలు, రాళ్ళు కావాలి. రోడ్ల మీద కుక్క బొమ్మలు చాలా తక్కువ ధరలో అమ్ముతుంటారు. వాటిని తీసుకున్నాను. హైదరాబాద్ చౌరస్సాలో తల ఊపే కుక్క బొమ్మలు అమ్ముతారు. చెట్ల పొదల కోసం నాలుగు ఉల్లి కాడల్ని ఇసుకలో గుచ్చాను. అక్కడక్కడా ధర్మోకాల్ బాల్స్ పెట్టాను. చూడండి అలంకరణ ఎలా ఉందో!
- కందేపి రాణీప్రసాద్