Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టింది గిరిజన ప్రాంతంలో.. నిరుపేద కుటుంబం.. పని చేస్తే కానీ కుటుంబం గడవదు.. తెలుగంటే ప్రేమ.. సాహిత్యమంటే అభిమానం.. పాటలంటే ప్రాణం.. నలుగురికి సేవ చేయాలనే తపన... వెరసి కుంజా నాగలక్ష్మి అయింది. చిన్నతనంలో చదవంటే భారం. నాన్న కోసమే అక్షరాలు నేర్చుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఓ సాహిత్య కారిణిగా, వాగ్గేయ కారిణిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, కాశీనగరం మా గ్రామం. మాది గిరిజన ప్రాంతం. అమ్మ సుభద్ర, నాన్న నర్సింగరావు. మేము ముగ్గురం పిల్లలం. నాన్న వ్యవసాయం చేసేవాడు. ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. అమ్మ కూలీ పనులకు వెళ్లేది. నాన్నకు చదువంటే చాలా ఇష్టం. అందుకే మమ్మల్ని బాగా చదివించాలనుకున్నాడు. అయితే మొదట్లో నేను చదువును నిర్లక్ష్యం చేశాను. నా చదువు విషయంలో మాష్టారికి, మా నాన్నకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. 'మీ అమ్మాయికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు'' అన్నారు ఓసారి. ఆ మాటలు నా మనసు లోతుల్లో గుచ్చు కున్నాయి. నాకు చదువు రావడం లేదనే దిగులుతో నాన్న తాగుతూ కుమిలిపోయేవాడు. దాంతో నాన్న దూరమవుతాడనే భయంతో అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టా.
ఆర్థిక స్థోమత లేక...
నాన్న నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు కామెర్లు వచ్చి చనిపోయాడు. దాంతో మా అమ్మ నా చదువు మాన్పించి తనకు తోడుగా నన్ను ఇంట్లోనే ఉంచాలనుకుంది. కానీ నాన్నకు చదువంటే ఇష్టమని నేను చదువుకుంటానని అడిగాను. ఎంత కష్టమైనా అలాగే చదువుకున్నాను. అలా నాన్నపై ఉన్న ప్రేమతో మొదలైన నా చదువు వర్ణమాల, అక్షరాల అందం, తెలుగు భాష నన్ను చదువువైపు ఆకర్షించేలా చేశాయి. తెలుగు కథలు, పాటల ప్రభావం నాపై పడింది. ఇక తెలుగు అంటే నా ప్రాణంగా మారిపోయింది. ఇంట్లో ఉండి చదువుకునే ఆర్థిక స్థోమత లేదు. అందుకే ప్రభుత్వ హాస్టల్లో ఉండి పదో తరగతి వరకు పూర్తి చేశాను. ఏపీఆర్జేసీలో సీటు వస్తే ఇంటర్ పూర్తి చేశా. తర్వాత డిగ్రీలో చేరాను. అయితే ఇంట్లో మా పరిస్థితి బాగోలేదు. దాంతో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే పెండ్లి చేశారు. వాళ్ళది కూడా పేద కుటుంబం. అయితే నాకు చదువంటే ఇష్టమని చదువుకోవడానికి పర్మిషన్ ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని చెప్పాను. దానికి వాళ్ళు ఒప్పుకోవడం పెండ్లి చేసుకున్నా.
చదువుకోసం పోరాటం...
నా భర్తకుగానీ, అత్తింట్లో గానీ నన్ను చదివించే ఆర్థిక స్థోమత లేదు. దాంతో నేనే కూలీ పనులు చేస్తూ డిగ్రీ, ఎంమ్మె పూర్తి చేశా. అయితే మాది ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆడపిల్ల చదువుకు అంత విలువ ఉండదు. అయినా పోరాటం చేసి చదువుకున్నాను. బీఎడ్ గవర్నమెంట్ సీటు వరంగల్‌లో వచ్చింది. మా ఊరికి దగ్గరగా చేరాలంటే ఫీజు చాలా కట్టాలి. అంత శక్తి నాకు లేదు. అందుకే ఫ్రెండ్స్‌తో కలిసి రూం తీసుకుని ట్యూషన్లు చెప్పుకుంటూ వరంగల్‌లో ఉండి బిఎడ్ పూర్తి చేశా. అప్పటికి మా వారికి ఆరోగ్యం బాగోలేదు. పని చేయలేని పరిస్థితి. డీఎస్సీ రాస్తే ఒకటిన్నర మార్కులతో పోయింది. దాంతో చిన్న స్కూల్లో ప్రైవేట్ టీచర్‌గా చేరాను. కొంత కాలం తర్వాత టీటీసీ కూడా ఉంటే బాగుంటుందని అది కూడా చేశాను. 2016లో ఎంబీఏ చేద్దామని చేరి మొదటి సంవత్సరం పూర్తి చేశాను. పాప పుట్టడంతో సెకండ్ ఇయర్ పూర్తి చేయలేకపోయాను.
టీచర్ల ప్రోత్సాహంతో...
స్కూల్లో ఉన్నప్పుడు ఏడో తరగతి నుండి కవితలు, పేరడి పాటలు రాసేదాన్ని. హాస్య వార్తలు, తెలుగులో న్యూస్ మా స్కూల్ అసెంబ్లీలో చదువుతూ ఉండేదాన్ని. తెలుగు టీచర్‌తో పాటు, ఇతర ఉపాధ్యాయులు కూడా నన్ను ప్రోత్సహించేవారు. మొదటి సారి 'నిద్ర' మీద ఒక కవితలు రాశాను. అది మా మాష్టారు చదివి చాలా బాగుంది అన్నారు. అయితే కొంతమంది మాత్రం ముందు బాగా చదువుకో ఈ కవితలు ఎందుకు అనేవారు. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. 9వ తరగతిలో ఉన్నన్నప్పుడు మా తెలుగు మాష్టారు 'అవినీతి' అనే పదం ఇచ్చి కవిత రాయమంటే రాశాను. కవిత బాగుందని 'వేకువ కోసం' అనే పుస్తకం బహుమతిగా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. మా మాష్టారు రాసిన కవిత ఆ పుస్తకంలో ఉంది. అది చూసి నా కవిత కూడా అలా పుస్తకంలో రావాలనే కోరిక కలిగింది.
పుస్తకాలు బాగా చదివేదాన్ని
ఇంటర్ చదువుతున్నప్పుడు 'భద్రాద్రి కలాలు' కవితా సంకలనం కోసం కవుల నుండి కవితలు ఆహ్వానించారు. దాని కోసం 'ఆర్తి ఆకాంక్ష' అనే కవిత రాసి పంపించాను. అది చదివిన టి.దుర్గాచారి బాగా నచ్చి నా దగ్గరకు వచ్చి నేను రాసిన కవిత నాకే వినిపించారు. ఇక అప్పటి నుండి ఎక్కడ కవి సమ్మేళనాలు ఉన్నా పిలిచినా పిలవక పోయినా వెళ్ళిపోయేదాన్ని. నాకు తోచిన కవిత చదివేదాన్ని. చాలా మంది పుస్తకాలు ఇస్తుంటే వాటిని చదివేదాన్ని. అనందరావు అనే లెక్చరర్ ఇంత చిన్న వయసులో గొప్ప ఆలోచన అంటూ రెండు వందల రూపాయలు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుండి మరింత ఉత్సాహంగా రాయడం మొదలుపెట్టాను. కన్న తల్లి కడుపులోంచి బిడ్డ పుట్టుకు వస్తే మాతృత్వం. అంతరంగ మధనంలోంచి అక్షరం పుడితే వచ్చేది మధురమైన కవిత్వం. దీన్ని నేను నమ్ముతాను.
అందెశ్రీ స్ఫూర్తితో...
2015లో తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ గురించి విన్నాను. ఒక పశువుల కాపరి, అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతంగా పాట రాయడం విని చాలా విచిత్రంగా అనిపించింది. ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదివాను. ప్రపంచ తెలుగుమహా సభల్లో ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఆయన స్ఫూర్తితో పాటలు రాయడం మొదలుపెట్టాను. మొదట రాసిన పాట 'ఆదివాసులం మేము... ఆదిమ వాసులం మేము...' అంటూ మా జీవితాల గురించే రాశాను. ఇప్పటికి 30 పాటల వరకు రాశాను. పెండ్లి తర్వాత ఆర్థిక సమస్య వల్ల వాటన్నింటిని పక్కన పెట్టాను. అవసరమైనపుడు బయటకు తీస్తుండేదాన్ని. ఆర్థిక సమస్యల వల్ల ఇప్పటి వరకు వాటిని పుస్తకంగా తీసుకురాలేకపోయాను. కానీ చాలా పోటీల్లో నా కవితలకు, పాటలకు బహుమతులు వచ్చాయి. కొన్ని పత్రికల్లో కూడా అచ్చయ్యాయి.
స్పెషల్ పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ...
నాకు ఒక పాప, బాబు ఉన్నారు. మా వారికి ఆరోగ్యం అంతంత మాత్రమే. హెల్డింగ్ పని ఉన్నప్పుడు వెళతారు. పిల్లలిద్దరూ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. పాప నిత్య పల్లవి. ఇప్పుడు 11 ఏండ్లు. తనకు ఆరోగ్యం బాగోలేదు. ప్రస్తుతం నేను స్పెషల్(చెవిటి, మూగ) స్కూల్లో క్లాసికల్ డ్యాన్స్ టీచర్‌గా చేస్తూ రాత్రి అక్కడే ఉంటాను. దీనికి సంబంధించిన కోర్సు కూడా చేశాను. పాపకు ఆరోగ్యం బాగోలేదని ప్రస్తుతం నాతో పాటే ఉంచుకుంటున్నాను. శని, ఆదివారాల్లో ఇంటికి వెళుతుంటాము. పాప డాన్స్ బాగా వేస్తుంది. చిన్న చిన్న కథలు కూడా రాస్తుంది. క్లాసికల్ డాన్స్ ప్రత్యేకంగా ఎక్కడా నేర్చుకోలేదు. నాకు నేనే సొంతంగా నేర్చుకున్నాను. నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్న స్పెషల్ పిల్లలకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. వేళ్ళ సైగలతోనే వాళ్ళకు డ్యాన్స్ నేర్పిస్తాను. వాళ్ళకు పాట వినపడదు. అందుకే స్టేప్ మార్చడానికి రెడ్‌లైట్, గ్రీన్ లైట్ వుంటాయి. దాని ద్వారా స్టేప్ మార్చుకుంటారు.
గిరిజనులంటే చిన్న చూపు
ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. రక్తం అవసరమైన వారికి తెలిసిన వారి సహకారంతో రక్తం అందించే ప్రయత్నం చేస్తాను. బ్యూటిఫుల్ లైఫ్ అనే సంస్థలో చేరి పేదలకు నాకు తోచిన సాయం చేస్తున్నాను. దాతలు ఎవరైనా ముందుకు వస్తే వాటిని అవసరమైన వారికి అందిస్తాను. ఇప్పటికీ సమాజంలో గిరిజనులంటే చిన్న చూపు. చదువుకున్న వారు కూడా బయటకు రావడానికి ఇప్పటికీ భయపడుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కష్టాలు అందరికీ వస్తాయి. వాటికి భయపడి కూర్చుంటే పరిష్కారం దొరకదు. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దాన్నే నేను నమ్ముతాను. నా పాటలకు, కవితలను త్వరలో పుస్తకంగా తీసుకురావాలనుకుంటున్నాను.
- సలీమ