Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చిందంటే మన శరీరానికి చల్లదనాన్ని అందించే వాటిలో
పెరుగుది మొదటి స్థానం. అయితే ఎప్పుడూ పెరుగన్నమేనా..! అంటూ మూతి ముడుస్తారు చాలా మంది. మరి ఎప్పుడూ అలాగే తింటే కొత్తదనం ఏముంటుంది. అందుకే ఈ వేసవిలో కాస్త భిన్నంగా ట్రై చేద్దాం. పండ్లని పెరుగులో కలిపేసి రైతాలు చేసుకుందాం. ఇవి రుచితో పాటు పోషకాలనూ అందిస్తాయి. శరీరానికి చల్లదనాన్నీ ఇస్తాయి. మరి అవెలా చేద్దామో తెలుసుకుందామా...
కరివేపాకుతో...
కావల్సిన పదార్థాలు : కరివేపాకు - కప్పు, పెరుగు - రెండు కప్పులు, మిరియాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, పచ్చిమిర్చి - ఒకటి, చింతపండు - కొద్దిగా, నూనె - చెంచా, ఉప్పు - తగినంత, కొబ్బరి తురుము - పావుకప్పు.
తాలింపు కోసం : నూనె - చెంచా, ఆవాలు - పావు చెంచా, ఇంగువ - చిటికెడు.
తయారు చేసే విధానం : బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె పోయాలి. అది వేడయ్యాక మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి రెండు మూడు నిమిషాలు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అదే బాణలిలో కరివేపాకును కూడా నూనె లేకుండా ఐదు నిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. తర్వాత మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, చింతపండును కూడా ముద్దలా చేసుకోవాలి. పెరుగులో కరివేపాకు పొడి, కొబ్బరి మిశ్రమం, జీలకర్ర ముద్ద, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక ఇంగువ వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగుతో వేసి బాగా కలిపితే చాలు.
మామిడికాయతో
కావల్సిన పదార్థాలు : మామిడి కాయ - సగం ముక్క (తురమాలి), పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత.
తాలింపుకోసం : నూనె - చెంచా, ఆవాలు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు.
తయారు చేసే విధానం : ముందుగా మిక్సీలో మామిడి తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేయాలి. ఆవాలు చిటపట లాడాక పొయ్యి కట్టేసి ఈ తాలిం పును పెరుగు లో వేస్త చాలు.
పైనాపిల్‌తో
కావల్సిన పదార్థాలు : పైనాపిల్ - పండులో సగం (చిన్నచిన్న ముక్కలుగా కోయాలి), పెరుగు - రెండు కప్పులు, ఆవాలు - పావు చెంచా, కొబ్బరి తురుము - నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - తగినంత.
తాలింపుకోసం : నూనె - చెంచా, ఆవాలు - పావు చెంచా, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెబ్బ.
తయారు చేసే విధానం : పైనాపిల్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకోవాలి, మిక్సీలో ఆవాలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కాసిని నీళ్లు తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైనాపిల్ ముక్కల్ని పెరగులో వేసి కలపనాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక కరివేపాకు, ఇంగువ వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగులో వేసి సరిపడా ఉప్పు కలిపితే చాలు.
అరటిదూటతో...
కావల్సిన పదార్థాలు : అరటి దూట - చిన్న ముక్క, గడ్డ పెరుగు - రెండు కప్పులు, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - నాలుగు పెద్ద చెంచాలు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కట్ట.
తాలింపుకోసం : నూనె - ఒక పెద్ద చెంచా, ఆవాలు పావు చెంచా, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - ఒక రెబ్బ.
తయారు చేసే విధానం : ముందుగా అరటి దూటను చిన్న చిన్న ముక్కలుగా తరిగి అయిదు నిమిషాలు ఉడికించుకుని తీసుకోవాలి. తర్వాత అందులో ఉన్న నీటిని పారబోసి మరో గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, కాసిని నీళ్లు పోసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరటి దూట ముక్కలకు కలపాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు వేయాలి. రెండు నిమిషాలయ్యాక కరివేపాకు, ఇంగువ వేయాలి. ఈ తాలింపును ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అరటి ముక్కలకు కలిపి తర్వాత పెరుగు, తరిమిన కొత్తిమీర, ఉప్పు వేసి మరోసారి కలిపితే చాలు.