Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ యూనివర్శిటీ నుండి 2022లో తస్మి జోహార్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. భారతీయ విశ్వవిద్యాలయం నుండి అలా చేసిన మొదటి రోహింగ్యా మహిళ ఆమె. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు, బెదిరింపులను ఎదుర్కుంటూ ఆమె చేసిన ప్రయాణం మూడు దేశాలలో రెండు వేల కిలోమీటర్లకు పైగా విస్తరించింది. తన మార్గంలో ఐదు భాషలను ఎంచుకుంది. 25 ఏండ్ల వయసులో పట్టభద్రురాలైన ఆమె ఢిల్లీలోని కాళింది కుంజ్‌లోని శరణార్థి శిబిరంలోని ఇతర నివాసితుల పట్టుదలకు ఇప్పుడు ప్రతీకగా నిలిచింది. వారి అభిమానం ఏ స్థాయిలో ఉందంటే అక్కడి మహిళలు తమ అమ్మాయిలు ఆమెలా ఎదగాలనే ఆశతో ఆమె పేరునే పెట్టుకుంటున్నారు.
గ్రాడ్యుయేట్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని జోహార్‌ను అడిగితే ''నేను నా విద్యను రెండుసార్లు పున:ప్రారంభించవలసి వచ్చింది. అయితే నేను నేర్చుకున్న దానికి గొప్ప విలువ ఇస్తాను. నా కుటుంబం లెక్కలేనన్ని రోజులు ఆకలితో గడిపింది. నేను ఇక్కడికి చేరుకోవడానికి చిరిగిన బట్టలు, మురికి చెప్పులు ధరించి సంవత్సరాలు గడిపాం' అన్నారు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 21,000 మంది రోహింగ్యా ముస్లిం శరణార్థులు ఉన్నారు. మయన్మార్‌లో ఉంటున్న వారిపై ఆగస్టు 2017లో హింస చెలరేగడంతో వలసలు ప్రారంభించారు. సుమారు ఏడు లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారతదేశం, థారులాండ్, ఇండోనేషియా వంటి దేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది.
తిండికి ఇబ్బంది
జోహార్‌కు ముగ్గురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అన్నయ్యలు ఇండియాకి వెళ్ళిన వెంటనే పని ప్రారంభించారు. వారిలో పెద్దవాడు యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్ (ఖచీన=జ) చొరవతో పని చేశాడు. వారే ఆమె ఆ దేశానికి వెళ్లడానికి, విద్యకు ఆర్థిక సహాయం చేశారు. జోహార్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ ''మేము భారతదేశానికి వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడితో మా నాన్న అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. మా పెద్దన్నయ్య యుఎన్లో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. నా ఇద్దరు తమ్ముళ్లు ఇంకా చదువుకుంటున్నారు'' అని చెప్పింది. పెద్ద కుటుంబం కావడంతో తిండికి వారు చాలా ఇబ్బందులు పడుతుండేవారు. విద్యను కొనసాగించడమైతే నిత్య సమస్యగా మారింది. ''భారతదేశంలో నా పాఠశాల, కళాశాల విద్యకు నిధులు సమకూర్చడానికి నా దగ్గర తగినంత డబ్బు లేదు. శ్రేయోభిలాషులు నా చదువుకు డబ్బు సాయం చేయడమే కాదు, స్కాలర్షిప్లు పొందడంలో కూడా నాకు సహాయం చేశారు'' అని జోహార్ అంటుంది.
పేరును దాచవలసి వచ్చింది
ఆమె తండ్రి అమానుల్లా జోహార్ 2005లో మయన్మార్‌ను విడిచిపెట్టి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో జోహార్ ప్రయాణం మొదలైంది. అప్పుడు 3వ తరగతి చదువుతున్న ఆమె ఆ సమయంలో తన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ ''నేను బర్మా (మయన్మార్)లో నా రోహింగ్యా పేరును దాచవలసి వచ్చింది. అక్కడ మాకు నేర్చుకోవడానికి, ఎదగడానికి సమాన అవకాశాలు ఇవ్వలేదు. ఉదాహరణకు బౌద్ధ పిల్లలకు రోల్ నంబర్లు కేటాయించారు. మా కంటే ముందే వారికి పాఠశాలలో అడ్మిషన్లు ఇచ్చారు. మెరిట్ ర్యాంకులు వారికి మాత్రమే ఇచ్చేవారు. ఈ విధంగా మేము పాఠశాలలో వివక్షకు గురయ్యాము. మా నాన్నను అకస్మాత్తుగా నిర్బంధించారు'' అని చెప్పింది.
కడు పేదరికంలో...
బంగ్లాదేశ్‌కు వెళ్లిన ఏడాది తర్వాత జోహార్ మళ్లీ పాఠశాలలో చేరింది. అయితే 1వ తరగతి నుండి మళ్లీ ప్రారంభించాల్సి వచ్చింది. ''మయన్మార్‌లో నా ఏడాది ప్రాథమిక విద్యకు, బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్‌లో ఎటువంటి ఉపయోగం లేదు. మా నాన్న దినసరి కూలీగా పనిచేస్తుండగా, మా అమ్మ ఇంటి అవసరాలు తీర్చుకునేది'' అని ఆమె గుర్తుచేసుకుంది. ఎనిమిది మందితో కూడిన కుటుంబం కడు పేదరికంలో జీవిస్తుంది. అయినా పిల్లలు పాఠశాలకు వెళ్లడమే వారి ఏకైక సాంత్వన అని ఆమె చెప్పింది. బంగ్లాదేశ్‌లో తన కష్టాల గురించి ఆమె మాట్లాడుతూ ''మా నాన్న పనికి వెళ్లలేని రోజులు చాలా ఉండేవి. మేము రోజుకు ఒక పూట మాత్రమే తినేవాళ్ళం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై మేము తరచుగా చదువు మానేయాలని అనుకున్నాం కానీ మా తల్లిదండ్రులు దానికి ఒప్పుకునేవారు కాదు'' అని చెప్పింది.
హింసాత్మక జాతి ప్రక్షాళనతో...
బంగ్లాదేశంలో వారు ఎంతో కాలం ఉండలేకపోయారు. జూన్ 2012లో మయన్మార్‌లోని బౌద్ధులు రోహింగ్యా ముస్లింలపై హింసాత్మక జాతి ప్రక్షాళనను ప్రారంభించినప్పుడు దాని ప్రభావం బంగ్లాదేశ్‌లో కూడా కనిపించాయి. దీంతో జోహార్ 7వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబం మళ్లీ మారాల్సి వచ్చింది. ఈసారి కుటుంబం భారతదేశానికి చేరింది. హర్యానాలోని ఏ పాఠశాల కూడా శరణార్థ విద్యార్థులకు వసతి కల్పించడానికి సిద్ధంగా లేరు. వారు ఢిల్లీలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
స్కాలర్షిప్ సహాయంతో...
భారతదేశంలో కుటుంబానికి శరణార్థి కార్డు ఉంది. కానీ జోహార్ సాధారణ పాఠశాలలో అడ్మిషన్ పొందలేకపోయింది. దాంతో ఓపెన్ స్కూల్‌ని ఎంచుకోవలసి వచ్చింది. తన తోబుట్టువలతో పాటు యుఎన్ నిర్వహించే వర్క్‌షాప్‌లు, సెషన్లకు హాజరయ్యేది. భాష, కంప్యూటర్ నైపుణ్యాలను నేర్చుకోవడం కోసమే వారు నాలుగు సంవత్సరాలు గడిపారు. ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా 2016లో 10వ తరగతి, 2018లో 12వ తరగతి పూర్తి చేసింది. శరణార్థి విద్యార్థుల కోసం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మన్ అకాడెమిక్ రెఫ్యూజీ ఇనిషియేటివ్ వారు ఇచ్చే శరణార్థి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ సహకారంతో ఆమె కళాశాలకు వెళ్ళింది.
ఐదు భాషల్లో...
జోహార్ ప్రయాణం ఐదు భాషల్లో కొనసాగింది. భారతదేశంలో హిందీ, ఇంగ్లీష్, బంగ్లాదేశ్‌లో బెంగాలీ, మయన్మార్‌లో రోహింగ్యాతో పాటు బర్మీస్ నేర్చుకుంది. అప్పటికి తన కమ్యూనిటీ నుంచి తనకు మద్దతు లభించలేదని జోహార్ అంటుంది. ''నేను శిక్షణా కేంద్రానికి చేరుకోవడానికి, తిరిగి రావడానికి గంట ప్రయాణించాను. నన్ను ఇలా పంపించినందుకు మా ఇరుగుపొరుగు వారు మా అమ్మను తరుచూ తిట్టేవారు. అయినప్పటికీ అమ్మ నన్ను ఎప్పుడూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు జోహార్ న్యాయవాద వృత్తిని కోరుకుంది. సబ్జెక్ట్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం జామియా మిలియా ఇస్లామియాలో చేరింది. కానీ విశ్వవిద్యాలయం ప్రవేశం ఇవ్వలేదు. ''2019లో నేను జామియాకు వచ్చాను. కానీ వారు నన్ను వేచి ఉండమని చెప్పారు. ఇంత దూరం వచ్చిన మొదటి రోహింగ్యాను కాబట్టి, విశ్వవిద్యాలయం దాని గురించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేయవలసి ఉంటుందని నాకు సమాచారం అందింది'' ఆమె అన్నది.
అంతర్జాతీయ స్వరం అవసరం...
న్యాయవాద వృత్తి ఎంపిక చేసుకున్నప్పుడు 22 ఏండ్ల వయసున్న జోహార్ యుడి నుండి రాజకీయ శాస్త్రంలో తన విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు ఆమె బీఏ చేసి కెనడాలో న్యాయశాస్త్రాన్ని కొనసాగించాలని ఆలోచిస్తుంది. ''నేను మాస్టర్స్‌ను అభ్యసించాలని కోరుకున్నాను. వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించే UNHCR-Duolingo సహకార ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు నేను కెనడాలోని విల్ఫ్రెడ్ లారియర్ విశ్వవిద్యాలయం నుండి అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను'' అంటుంది ఆమె. అయితే స్కాలర్షిప్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే కాబట్టి జోహార్ తన బ్యాచిలర్ డిగ్రీని పునరావృతం చేసి ఆ తర్వాత న్యాయశాస్త్రాన్ని కొనసాగిస్తుంది. తన ప్రజల కోసం వాదించడమే తన లక్ష్యమని అంటుంది. ''నేను మైనారిటీల మానవ హక్కుల కోసం న్యాయవాదిగా మారాలనుకుంటున్నాను. ముఖ్యంగా రోహింగ్యా కమ్యూనిటీకి, వారి హక్కుల కోసం వాదించే అంతర్జాతీయ స్వరం చాలా అవసరం'' అంటుంది జోహార్.
ఆందోళన చెందుతున్నాం
నాలుగేండ్లు గడిచినా యూనివర్సిటీ నుంచి జోహార్‌కు ఎలాంటి సమాచారం లేదు. భారత ప్రభుత్వం రోహింగ్యా వలసదారుల సమస్యను పదే పదే లేవనెత్తుతున్నప్పుడు ఆకలితో ఉన్న తమ జనాభా భారతదేశానికి ఎలా ప్రమాదకరంగా ఉంటారు అని జోహార్ ఆవేదన వ్యక్తం చేశారు. ''నా ప్రజలకు రోజుకు రెండు భోజనాలకు సరిపడా ఆహారం, స్వచ్ఛమైన నీరు, సొంత ఇల్లు కూడా లేదు. భారత ప్రభుత్వం మా కోసం చేసిన ప్రతిదానికీ మేము రుణపడి ఉంటాము. అలాంటి మేము అదే దేశానికి ఎలా ముప్పుగా ఉంటాము? ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం ఎప్పుడైనా మాపై విరుచుకుపడుతుందని ఆందోళన చెందుతున్నాము. మేము ఇప్పటికీ అభద్రతలోనే జీవిస్తున్నాము'' అంటుంది ఆమె.