Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుర్గాబాయి వ్యామ్... ఆధిపత్య సమూహాల వల్ల అట్టడుగు కళలు ఎన్నో మరుగున పడిపోయాయి. వాటిలో ఆదివాసీలకు చెందిన గోండ్ కళ ఒకటి. దాన్ని కాపాడుకునేందుకు ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కళకు సంబంధించిన గోండ్ సంఘంలో పని చేస్తూ దాని వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సుభాష్ వ్యామ్తో కలిసి ఆ కళతో మమేకమై ఎప్పుడూ బిజీగా గడుపుతున్నారు. 30 ఏండ్లుగా ఆమె భారతదేశంలోని గిరిజన మ్యూజియంలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్యాలరీలలో తన చిత్రాలను ప్రదర్శించారు. ప్రముఖ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో అవార్డులు పొందారు. అభ్యుదయ ప్రచురణ కర్తల మధ్య గొప్ప పేరు సంపాదించారు. 2022లో పద్మశ్రీ సైతం అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై గోండు కళ ప్రాముఖ్యతను వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ ఆదివాసీ చిత్రకారిణి తమ కళ గురించి ఓ ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు మానవి పాఠకులకు ప్రత్యేకం.
చాలా చిన్నప్పటి నుండే ఈ కళతో మమేకమై ఉన్నారు. ఈ అభిరుచి మీకు ఎలా వచ్చిందో చెబుతారా?
పర్ధన్ గోండ్ సమాజానికి చెందిన మహిళలకు తమ గోడలు, భవనాలు, అంగన్ (ప్రాంగణం), కోఠి (వంటగది)లో బిత్తి చిత్రాన్ని తయారు చేయడం సంప్రదాయం. మేము వివిధ రంగుల మాటి (బురద)తో, అనేక విభిన్న ఆకృ తులలో నమూనాలను తయారు చేస్తాం. వీటిలో ప్రతి ఒక్కటి విభిన్న మూలం, కథనాన్ని కలిగి ఉంటాయి. భిత్తిచిత్రమే కాకుండా హోలీ వంటి వేడుకలకు రంగులు వేయడానికి, అలంకరణకు గోబర్(పేడ)ని ఉప యోగిస్తాము. చిన్నతనంలో మా ఊరి పండుగలు, పెళ్లిళ్లకు దిగ్నా భిత్తిచిత్రం చేయడం నేర్చుకున్నాను. నేను మొదట ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చు కున్నాను. ఆపై మా గ్రామంలోని ఇతర మహిళ లందరితో కలిసి ఈ నైపుణ్యాన్ని మెరుగు పర్చకోవడం కొనసాగించాను.
భోపాల్‌కు వెళ్లడం, నగరంలో కళను పరిచయం చేయడం ఎలా అనిపిస్తుంది?
1996లో నేను నా భర్త సుభాష్, మా పిల్లలతో కలిసి భోపాల్‌కు వెళ్లాను. అతని బంధువు జంగర్ సింగ్ శ్యామ్, గోండి కళలో కొత్త శైలికి మార్గ దర్శకుడు. అప్పటికే ఆయన స్వామినాథన్ మద్ద తుతో పెద్ద నగరంలో స్థిరపడ్డారు. ఆ ప్రారంభ కాలంలో మేము అతనితో పని చేసాము. సుభాష్ స్క్రీన్ ప్రింటింగ్, వుడ్ వర్క్ చేసాడు. నేను కూడా నా కళాత్మక నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించాను.
మీరు చెప్పినట్లుగా ఆధునిక భారతీయ కళలో జంగర్ సింగ్ శ్యామ్ చాలా ముఖ్యమైన వ్యక్తి. అతని గురించి మీ జ్ఞాపకాలు ఏమిటి?
అతను గొప్ప కళాకారుడు. మమ్మల్ని చాలా ప్రోత్సహించాడు. కళాత్మక అభ్యాసం మాత్రమే కాకుండా అన్ని ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. అది సృజనా త్మక పని అయినా లేదా ఒక కప్పు టీ తయారీ అయినా. అతను నన్ను సోదరిలా చూసుకున్నాడు. నా ప్రయత్నాలను, కళాకృతిని ఎల్లప్పుడూ అభినందిస్తూ, అభివృద్ధి చెందడానికి నన్ను ప్రేరేపించాడు.
మీరు గోడల నుండి పేపర్‌కి ఎలా మారారు?
భోపాల్‌కి మారిన ఏడాది తర్వాత నేను జంగర్తో కలిసి భారత్ భవన్లో పని ప్రారంభించాను. ఆ తర్వాతే కాన్వాస్ పెయిం టింగ్స్ వేయడం ప్రారంభించాను. అప్పుడే మొదటిసారి బ్రష్‌లు, సింథటిక్ పెయింట్‌ని ఉపయోగించాను. డిగ్నా సౌందర్యాన్ని కాన్వాస్ లోని పరిమిత స్థలంలో ఎలా చూపించ గలనో అని మొదట్లో చాలా భయ పడ్డాను. అయితే మా ఆరాధ్య దైవం ఖార్ఖదేవ్ను మధ్యలో ఉంచి, సంప్రదాయ డిజైన్లతో నాలుగు వైపులా చుట్టుముట్టడం ద్వారా ఒక మార్గాన్ని రూపొందించాను.
మీ మొదటి పెయింటింగ్ ఎక్కడుఉంది?
చండీగఢ్‌లోని ప్రభుత్వ మ్యూజియం కొనుగోలు చేసింది.
మీరు ఉపయోగించే ఐకానోగ్రఫీ ఎలా అభివృద్ధి చెందింది?
నా పనిలోని దృశ్యాలన్నీ మన పూర్వీకుల జానపద కథలు, ఆచారాలు, సాంప్రదాయాలకు చిహ్నాలు. బేసిన్ కన్యా కథ, వెదురు కన్య గురించి ఒక గోండ్ జానపద కథ, చంద్రుడు, సూర్యుడు, జంతువులు, చెట్లు, ప్రకృతి మాత, గోండి దేవతలకు సంబంధించిన కథనాలన్నీ నా పనిలో భాగమే. ఏండ్ల సాధన వల్ల నా చిత్రాలను మరింత మెరుగు పరుచుకున్నా. అన్ని రకాల వీక్షకులకు అందుబాటులో ఉండేలా చేయగలిగా.
ది నైట్ లైఫ్ ఆఫ్ ట్రీస్ (తారా బుక్స్, 2006) సహ రచయితగా బోలోగ్నా రాగజ్జీ అవార్డు 2008ని గెలుచుకోవడంతో సహా మీ పుస్తకాలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందారు. ఇది ఎలా సాధ్యం?
నేను ఏకలవ్య ఫౌండేషన్ వారు ప్రచురించే బుక్లెట్ల కోసం చిత్రాలను రూపొందించడం 2000లో ప్రారంభించాను. ఈ సమయంలో వీటిలో ఒకటి న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రదర్శించబడింది. అప్పుడే చెన్నైకి చెందిన పబ్లిషింగ్‌హౌస్ అయిన తారా బుక్స్ వారు నన్ను సంప్రదిం చింది. ఆ తర్వాత 2007లో నవయాన అనే ఢిల్లీకి చెందిన పబ్లిషింగ్ హౌస్ వారి కోసం గీయడానికి నన్ను నియమిం చారు. అప్పటి నుండి నేను, కొన్నిసార్లు నా భర్త సహ కారంతో తారా బుక్స్, నవయాన రెండింటికీ అనేక ప్రచురణలకు సహకరించాను.
అంబేద్కర్ జీవితానికి సంబంధించిన గ్రాఫిక్ రీటెల్లింగ్‌కు మీరు, సుభాష్ కలిసి పని చేశారు. దాని గురించి మాట్లాడగలరా?
భీమాయనాన్ని ఎలా వివరించాలో మేము ఒత్తిడికి గురయ్యాము. అంబేద్కర్ ప్రయాణం కష్టాలు, సవాళ్లతో కూడుకున్నదని మేము అర్థం చేసు కున్నాం. నేటి యువత ఆయన జీవితం, అంట రానితనానికి వ్యతిరేకంగా చేసిన కృషి గురించి తెలుసు కోవడం వల్ల మన ప్రస్తుత కాలంలో కొన సాగుతున్న అన్యాయాలపై ప్రశ్నించగలుగుతారు. అంతే కాదు మా సొంత గ్రామంలో చూసిన అను భవాలకు, ఈ పుస్తకంలో ఉన్నవాటికి సంబంధం ఉంది. కాబట్టి మా అనుభవాల ద్వారా కంటెంట్‌ను యాక్సెస్ చేయగలిగాము. చివరకు కథలోకి మా డిగ్నా ఆర్ట్‌ని తీసుకురావడం ద్వారా ఫార్మాట్ సమస్యను పరిష్కరించాం.
స్వాతంత్య్రం కోసం అంబేద్కర్ చేసిన పోరాటాన్ని చూపించడానికి మీరు ఎలాంటి పద్ధతి అనుసరించారు?
కథనంలోని లక్షణాలను సూచించడానికి బిత్తిచిత్ర నుండి డిజైన్లు, చిత్రాలను ఉపయోగించాము. కానీ మా సొంత కల్పన ద్వారా పాములా రైలును తయారు చేయడం, సమాజ సంఘీభావాన్ని తెలియజేయడానికి నెమలి ఈకను ఉపయోగించాం. అయితే పాఠకులు ఈ రూపాలను గుర్తించలేకపోవడంతో మేము కొన్నిసార్లు వీటిని ఎత్తి చూపవలసి వచ్చింది.
పల్లెటూరి జీవితానికి చెందిన మీ కళను పట్టణ, సమకాలీన ప్రపంచం ఎలా అర్థం చేసుకుంది..?
నేను నగరం, పట్టణ జీవితాన్ని నా పనిలోకి తీసుకువచ్చాను. ప్రస్తుత సంఘటనలకు ప్రతిస్పందించాను. 2011, సెప్టెంబర్‌లో యుఎస్ భవనంపైన విమానాలు కూలి పోవడం గురించి రేడియోలో విన్న తర్వాత దానికి సంబం ధించిన ప్రగతి మైదాన్‌లో చిత్రాన్ని గీశాను. భారతదేశం నుండి జర్మనీకి నా మొదటి పర్యటన తర్వాత విమానాలను తయారు చేశాను. ఇప్పుడు పెద్ద నగరంలో జరుగుతున్న సాంప్రదాయ పండుగలు, వివాహాల దృశ్యాలను కూడా చూపిస్తున్నాను. అలాగే నా సొంత జీవితం నుండి కూడా కొన్నింటిని తీసుకున్నాను.
2022లో పద్మశ్రీ అవార్డు పొందారు.. దీని గురించి మీ స్పందన?
ఇది నాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. భోపాల్‌లో కారు ప్రయాణంలో ఉండగా పద్మశ్రీ గురించి తెలియజేయ డానికి, అభినందించడానికి మండల జిల్లా కలెక్టర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కొద్ది సేపట్లోనే గ్రామం లో, ఇంటి దగ్గర నన్ను అభినందించడానికి జనం గుమిగూడింది.
అభివృద్ధి పేరుతో రాజ్య విధానాల వల్ల ఆదివాసీ భూమి, వనరులు దోపిడీకి గురవుతున్నాయి. సహజ పర్యావరణాన్ని రక్షించుకునే విషయంలో గోండ్ కళను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు?
మన సాంప్రదాయక కళా సాధనలో, ప్రకృతి మాత మన పాత జీవన విధానాల నుండి మేము గాఢంగా ప్రేరణ పొందాము. నా పనిలో కూడా నేను ఎల్లప్పుడూ ప్రకృతిని కాపాడుకోవడం గురించి నొక్కి చెబుతాను.
బిత్తిచిత్ర, గోండు కళల ముందున్న లక్ష్యం ఏంటి?
ఇది పాత కళ, కానీ దానికి కొత్త దిశానిర్దేశం చేయాలని మేము ఆశిస్తున్నాము.