Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంకమట్టి తెచ్చి బొమ్మలు చేసి ఆడుకోవడం ఒకనాటి పిల్లల ఆటపాటలు. ఆనాడు భూమి, ప్రకృతి, జంతువులతో కలిసిపోయి ఉండేవారు, జీవించేవారు. ఇప్పుడు నేల విడిచి సాము చేస్తున్నట్టే ఉంది. నేను బంకమట్టితో ఎన్నో బొమ్మలు చేసి ఆడుకున్నాను. బంక మన్ను లాంటి మట్టితో చేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. దీనినే ఇంగ్లీషులో 'సెరామిక్స్' అంటున్నారు. ఈ సెరామిక్స్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో 'కేరామోస్' అంటే కండలు అనే అర్థం ఉన్నది. ఆ 'కేరామోస్' నుంచే ఈ సెరామిక్స్ అనే పదం పుట్టింది. ఒకప్పుడు వంటసామాగ్రి మొత్తం మట్టి వస్తువులనే వాడేవారు. కుండలలో పోసిన మంచినీటినే తాగడానికి వినియోగించేవారు. కుండలో పోసిన నీరు చల్లగా ఉండేది. ఇళ్ళకు సైతం మట్టి గోడలుండేవి. వేసవి కాలాలు సైతం ఇంట్లో చల్ల దనాన్ని ఇచ్చేవి. మట్టి పొయ్యిలు ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకునేవారు. లోహ, రసాయన పరిశ్రమలలో పింగాణీ సామాగ్రిగా మట్టినే వినియోగిస్తారు. ఇళ్ళు కట్టుకునే ఇటుకలు సైతం మట్టి నుంచే తయారు చేస్తారు.
బొమ్మరిల్లు
''చిట్టి చిట్టి మిరియాలు తెచ్చి చెట్టు కింద పోసి, పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి'' అనే పాట మన చిన్నతనంలో అందరూ పాడుకున్న పాటే. అంటే పిల్లలు ఆడు కునే బొమ్మరిళ్ళను మట్టితో నిర్మించుకుని ఆడుకునే వారని తెలుస్తున్నది. నేను చిన్నపుడు బొమ్మరిల్లు కట్టలేదు. కానీ ఇప్పుడెందుకు కట్టకూడదు అని ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాను. మా ఇంట్లో అవసరం పుట్టమన్ను తెచ్చుకున్నాం. తర్వాత దీన్ని పార బోస్తామంటే వద్దని నేనే దాచుకున్నాను. ఆ పుట్ట మన్నుతోనే ఇప్పుడు బొమ్మలన్నీ తయారు చేశాను. ఇప్పుడు నేను కట్టిన బొమ్మరిల్లును మీకు చూపిస్తాను. ఎండిపోయిన మట్టితో కొద్దిగా నీళ్ళు కలిపి తడిపి ఉంచుకోవాలి. తర్వాత మెత్త బడ్డ మట్టి ముద్దతో కావాల్సిన ఆకారాన్ని చేసుకోవచ్చు. మొదటగా గుడిసె కట్టుకుందామా డాబా కట్టుకుందామా నిర్ణయించుకోవాలి. నేను నాలుగు వైపులా నాలుగు పిల్లర్లను పెట్టి దాని మీద ఒక అట్టను పెట్టి దానికి మట్టిని అలికాను. దానిపైన ఇల్లులా నాలుగు గోడలు పెట్టి పై కప్పు వేశాను. గోడలకు కిటికీలు, తలుపులు పెట్టాను. కిటికీ చువ్వల కోసం చీపురు పుల్లల్ని వినియోగించాను. మట్టి ఇల్లు బంగారంలా ఎలా మిలమిల లాడుతుందో చూడండి.
లక్కచిట్లు
గతంలో పిల్లలందరూ కలిసి ఎక్కువగా లక్క చిట్లతో ఆడుకునే వారు. చెక్కతో చేసిన లక్క చిట్లు కొందరిళ్ళలో ఉంటే మిగతా వాళ్ళు మట్టితో చేసుకునేవారు. బహుశా వంట పాత్రల పట్ల అవగాహన కల్గించటానికి ఇలాంటి లక్కచిట్లు తయారు చేసే వాళ్ళేమో. వంట చేయడాన్ని చాలా తక్కువ రకపు పనిగా చూస్తున్నారు. ప్రతి మనిషికి మొదట కావాల్సింది తిండి మాత్రమే. దాని కోసమే ఇన్ని ఉద్యోగాలు, డబ్బు సంపాదనలు. బజార్లో తిని అనారోగ్యం పాలయ్యే కన్నా శుచిగా వండుకుంటే తప్పేమిటో అర్థం కాదు. సరే మనమయితే ఇప్పుడు వంట పాత్రలు చేద్దాం. అట్లు పోసే పెనం, చపాతీ చేసే పీట, దాని కర్ర, వేయించడానికి బాండీ, మంచినీళ్ళ బిందె, గ్లాసులు, చెంబు, గిన్నెలు వంటి సామాగ్రి చేసుకుంటే బాగుంటుంది. పెనానికి తోడుగా అట్లకాడ, మజ్జిగ చిలికే కవ్వం, ఆవకాయలు పెట్టుకునే జాడీలు, పాలు కాచే గిన్నె, పెరుగు తోడు పెట్టుకునే గిన్నె ఇలా పేర్లు చెప్పి గిన్నెలు తయారు చేస్తే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆయా వస్తువుల పట్ల అవగాహన కలుగుతుంది. ఇంకా రోళ్ళు, రోకళ్ళు, తిరగలి, పిండి దంచే పెద్ద రోలు, వెన్న చిలికే పెద్ద కవ్వం వంటి వస్తువులను మట్టితో చేసి పిల్లలకు చూపించి ఆడించాలి. కేవలం ఆడుకోవడానికే కాదు ఆ వస్తువులు దేనికి పనికొస్తాయో వివరిస్తే తెలుస్తుంది.
ఎద్దుల బండి
నేను చిన్నప్పుడు బంక మట్టితో ఎక్కువగా ఎద్దుల బండిని, ఎద్దుల్నీ తయారు చేసేదాన్ని. చెరువు కట్టకు ఆనుకునే మా ఇల్లు ఉంటుంది. అందుకే చెరువులోని మట్టి తెచ్చుకుని బొమ్మలు చేసే వాళ్ళం. అందులోనూ మా ఊరు బంకమన్ను నేలలు కలిగిన ఊరు ఆటలన్నీ బంక మన్నుతోనే. మా తమ్ముడు ఎద్దులబండి కావాలని ఏడుస్తుండే వారు. వాడి ఏడుపు మాన్పటానికి మా అమ్మ ఎద్దుల్నీ, ఎద్దుల బండినీ చేసివ్వమని చెప్పేది. దాని కోసం ఎప్పుడూ నేను ఎద్దుల్నీ, బండినీ చేస్తుండేదాన్ని. ముందుగా మట్టిని బాగా మర్ధన చేసి ఎద్దు ఆకారంలో వచ్చేలా మలుచుకోవాలి. రెండు చక్రాలు చీపురు పుల్లలతో చేసుకుని జాతుల్ని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. చక్కగా మట్టితో చేసిన తర్వాత ఎండి బాగుంటాయి. ఒక్కోసారి పగుళ్ళు వచ్చినా కూడా మళ్ళీ కొద్దిగా మట్టితో దాన్ని సరి చేస్తే సరిపోతుంది. ఈ రోజు ఎద్దుల బండిని మీ షోకేస్‌లో చేర్చండి.
తల్లీబిడ్డలు
సృష్టిలో తల్లీ బిడ్డల అనుబంధం కన్నా గొప్పది ఏదీ లేదు కదా! మరి మట్టితో తల్లీ బిడ్డల బొమ్మల్ని చేద్దామా! మనమే చేయవచ్చు లేదా పిల్లల చేత కూడా చేయించవచ్చు. ముందు తల్లికి ఇలాంటి కళల పట్ల అవగాహన ఉంటే పిల్లలకు నేర్పించడగలుగుతుంది. ఈ మధ్య పెద్ద పెద్ద స్కూళ్ళలో బంకమట్టితో బొమ్మలు చేయించడం ఒక పనిగా పెట్టుకున్నారు. లేదంటే సమ్మర్ క్యాంప్‌లలో 'పాటరీ' అని దీన్ని ఒక కళగా నేర్పిస్తున్నారు. మా చిన్నతనాన సరదాగా చేసినవన్నీ ఒక కళగా మారి దానికో పీరియడ్ కేటాయిస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పుడూ కంప్యూటర్ల ముందు కూర్చుని ఆన్ ఆఫ్ బటన్లు నొక్కుతూ బుర్ర వేడెక్కుతుంటే స్వాంతన పరి చేసి ఇలాంటి కళలే. తల్లీ బిడ్డల బొమ్మల్ని లోగో మాదిరిగా తయారు చేద్దాం. నేను మా హాస్పిటల్‌కు పనికొస్తుందని ఇలా చేసుకున్నాను. మీరు ఇంకోలా కూడా ప్రయత్నించవ్చు.
'ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చిందేనుగూ' అంటూ పాటలు పాడు కున్న పిల్లలకు ఏనుగు బొమ్మను బహుమతిగా ఇద్దాం. సాధారణంగా గ్రామాలలో వినాయక చవితి పండుగకు మట్టి వినాయకుళ్ళను బాగా తయారు చేస్తారు. నేనూ చేసేదాన్ని. అంబారీ కట్టిన ఏనుగును అందంగా చేద్దాం. ఇప్పుడు మట్టి దొరకకపోయినా పరవాలేదు. ప్లాస్టిక్ మట్టి దొరుకుతున్నది కదా! రంగుల మట్టితో రంగుల ఏనుగును సృష్టించవచ్చు. మట్టితో ఏనుగును సృష్టించాక దాని కాలి గోళ్లు, కళ్ళు, తోక వంటివన్నీ టూత్‌పిక్‌తో గానీ చిన్న కత్తితో గానీ గీసుకోవచ్చు. అంబారీని పెట్టి దాని మీద రాముడ్ని కూర్చోబెట్టవచ్చు. నేను మా పిల్లలతో పాటరీకి వెళ్ళినపుడు ఎన్నో బొమ్మలు అక్కడి పిల్లలకు నేర్పించాను. అవి చాలా రోజులు వాళ్ళ షోకేసుల్లో ఉన్నాయి.
- కందేపి రాణీప్రసాద్