Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుటుంబం, ఉద్యోగ బాధ్యతల్లో ఎంత ఒత్తిడి ఉన్నా రాయడం ఆమెకు ఓ ఇష్టమైన వ్యాపకం. చదవడం అనే అలవాటును వ్యవసనంగా మార్చుకొని రాయడం పట్ల మక్కువ పెంచుకున్నారు. రాసే ప్రతి అక్షరానికి ఓ ప్రయోజనం ఉండాలని బలంగా కోరుకునే వ్యక్తిత్వం. పైకి ప్రవహించే గోదావరిలా ఎంతో ప్రశాంతంగా కనిపించినా... గుండె నలిగిపోయిన ప్రతి సారి సముద్రం పోటెత్తినట్టు... అక్షరం ఆమెలో ఉప్పొంగుతుంది. అప్పుడు తెల్లని కాగితాలు నల్ల రంగు పులుముకుంటాయి. తెలంగాణ ప్రజల బతుకులు కథలుగా మన ముందు వాలిపోతాయి. ఆమే రచయిత్రి కోట్ల వనజాత. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
బాల్యం పెరిగిన వాతావరణం?
నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, తుమ్మడం గ్రామం. నాన్న రంగారెడ్డి, అమ్మ లక్ష్మమ్మ. నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. అది కూడా పంటలు పండినప్పుడు మధ్య తరగతి, పండనప్పుడు దిగువ మధ్య తరగతి. అలా ఎగుడు దిగుడు ఆర్థిక వ్యవస్థలో పుట్టాను. నలుగురం అక్కచెల్లెళ్ళలో నాకు మాత్రమే చదువుకునే అవకాశం దక్కింది. మా చిన్నమ్మ ఇంట్లో వుండి చదువుకోవడం నాకు దక్కిన సదవకాశం. స్కూలూ కాలేజీ చదువులు దాదాపుగా సూర్యాపేటలోనే సాగింది. ఆ తర్వాత దూర విద్య ద్వారా పి.జి(తెలుగు ఎం.ఎ), పి.జి డిప్లొమా ఇన్ కజ్యూమర్ ఎవేర్నెస్ చదివాను. చిన్నప్పటి నుండి ప్రత్యేకంగా సాహిత్యం ఇదంటూ చదవకపోయినా కథల పుస్తకాలూ, వార పత్రికలూ అందుబాటులో వున్న నవలలూ చదివేదాన్ని. చదవడం అనే అలవాటు క్రమంగా వ్యసనంగా మారింది. అభిరుచికి తగినట్టు ఎం.ఎ తెలుగు చదవడం అదనంగా ఆనందాన్చిన విషయం.
సాహిత్యంతో మీ పరిచయం..?
చిన్నప్పటి నుండే కథలూ, వారపత్రికలు, దినపత్రికలు చదవడమే సాహిత్యంతో పరిచయానికి తొలి అడుగు. ఎవరైనా అంగీకరించినా అంగీకరించకపోయినా నాకు నచ్చే సాహిత్యం ఎక్కువగా దిన పత్రికల్లో చదివిందే. ఈ రోజుకు కూడా దినపత్రిక గంటసేపు చదువుతాను. వార్తలూ, ఆర్టికల్స్, కాలమ్స్, వ్యాసాలూ, ఉత్తరాలు పెద్ద సాహిత్య సమ్మేళనం కదా దినపత్రికలు. అందుకే దిన పత్రికలు పెద్ద సాహిత్య వారధులు. వార పత్రికల్లో సీరియల్స్ చదవడం, అద్దెకు నవలలు తెచ్చుకొని చదవడం నిజంగా మధురమైన జ్ఞాపకాలు. పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా సాహిత్యం చదువుతున్నది మాత్రం గత ఇరవై ఏళ్ళుగా దాదాపుగా ప్రతిరోజూ చదువుతూనే ఉంటాను.
రాయడానికి స్ఫూర్తి ఏమిటి..?
రాయడానికి స్ఫూర్తి ప్రత్యక్షంగా కొందరుంటే, పరోక్షంగా మరికొందరున్నారు. ఎనభైల్లో వచ్చిన సాహిత్యంలో మెజారిటీ నవలలది. ఆ నవలలు ఎక్కువగా ఎగువ మధ్య తరగతి కాస్త ఉన్నతంగా చదువుకున్న వారి జీవితాలని ప్రతిభించించేవి. సైన్స్, ఫిక్షన్, ఊహాత్మక సాహిత్యం ఎక్కువగా వచ్చిన కాలంలో నిజంగా మనకన్నా నాలుగు మెట్లు ఆర్థికంగా, ఉన్నతులు విద్యావంతులు మాత్రమే రాస్తారనే అభిప్రాయముండేది. నిజానికి నామిని సుబ్రమణ్యం నాయుడు ఆ భయాన్ని పోగొట్టారని చెప్పాలి. 'నీ జీవితమే ఒక కథ, నీ అనుభవమే అక్షరాల్లో పెడితే సాహిత్యం' అనే ధైర్యాన్ని నాలాంటి చదువరులకు ఇచ్చారనిపిస్తుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత కొంత పాతతరం రచయితలను అధ్యయనం చేయడం ద్వారా ఏమి రాయాలనే స్పష్టత వచ్చింది. అవి సురవరం ప్రతాపరెడ్డి కథలే.
ఇప్పటి వరకు మీరు చేసిన రచనలు..?
మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ఈ శతాబ్దపు తొలి రోజుల్లోనే ముఖ్యంగా తెలంగాణ భాషకు ప్రాధాన్యమిస్తూ కథలు రాయాలనుకొని నిర్ణయించుకుని తెలంగాణా భాషనూ ఇక్కడి సమస్యలను, తెలంగాణ జీవన విధానాన్ని ముప్పేటగా కథలు రాయాలనుకుని అందులో కొంత సఫలీకృతమవుతూ వచ్చాను. అలా రాసిన మొదటి పన్నెండు కథలను 2014లో 'ఇత్తు' పేరుతో కథా సంకలనం తీసుకొని వచ్చాను. ఆ తర్వాత వివిధ పోటీల్లో గెలుపొందిన కథలతో 'మైదాకు వసంతం' కథా సంపుటిని 2022 తీసుకొచ్చాను. అదే విధంగా భూ సమస్యలూ, మైనింగ్, గ్రామీణ రాజకీయాలు ప్రధానాంశంగా 'ఊరుగాని ఊరు' నవల రాశాను. ఆ నవల 'శ్రీ అంపశయ్య నవీన్' తొలి నవలా పురస్కారం 2022 సంవత్సరానికి గెల్చుకున్నది. త్వరలో మరో కథా సంపుటికి సిద్దమవుతున్నాను.
ఓ మహిళగా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా..?
ఆడపిల్ల, యువతి, మహిళ... వివక్ష సార్వజనీనం. పొద్దు పొడిచే ప్రతిచోటా వివక్షకు తావుంది. ఈ దేశం - ఆ దేశం, ఈ ఊరు - ఆ ఊరు, ఆ తెగ - ఈ తెగ, ఈ జాతి - ఆ జాతి అని లేదు. ప్రతి చోటా వివక్షే. మహిళను తోటి మనిషిగా చూడకుండా అవసరాలకు పనికొచ్చే మనిషిగా చూడటం వల్ల ఇంటా బయటా సమస్యలు తప్పవు. అందుకే మహిళాదినోత్సవమంటూ, అమ్మల దినోత్సవాలనుకుంటూ ఎవరూ నెత్తిన పెట్టుకోవాల్సిన పనిలేదు. తోటి మనిషి దినోత్సవం జరుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
సమాజంపై సాహిత్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనుకుంటున్నారు?
సమాజంపై కొద్దోగొప్పో ప్రభావం చూపించే సాహిత్య ప్రక్రియల్లో మొదటిది పాట. ఆ తర్వాత స్థానం నాటకానిది. అలాగే సినిమా కూడా. ఆ తర్వాతే కవిత్వం కథా, నవలా ఇత్యాదులు. అయితే సాహిత్యం దగ్గరకు వచ్చే సరికి దాన్ని చదివి ప్రభావితమయ్యే వాళ్ళకే పరిమితం. అక్షరజ్ఞానం నిర్భంధం, కాని మనలాంటి దేశాల్లో ఇంట్లో ఒక్క పుస్తకమైనా లేకుండా జీవితాలు గడిచిపోతుంటాయి. అలాంటప్పుడు పుస్తక సాహిత్య ప్రభావం అందరి మీదా ఉంటుందనలేం. ప్రతి ఇంట్లో చదువరులూ, ప్రతి ఇంట్లో సాహిత్యం, దాని వల్ల వచ్చే ప్రభావాలు ఒక కలగా మిగిలిపోతాయేమో అనే భయం నాలో వుంది.
కుటుంబ సహకారం ఎలా ఉంది..?
నా జీవిత భాగస్వామి కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి. ప్రముఖ కవి, కాళోజీ పురస్కార గ్రహీత. అందుకే నాకు చదువుకూ, రాసుకోవడానికి అభ్యంతరాలుండవు. పైగా రాస్తానన్నది రాయకపోతే ఆయనే నన్ను తొందర పెట్టైనా రాయిస్తారు. కాబట్టి నాకు కుటుంబ సహకారం పూర్తిగా వున్నట్టు.
ఉద్యోగం, కుటుంబం, సాహిత్యం సమన్వయం ఏలా సాధ్యం?
పని ఒత్తిడి అధికంగా వుండే ప్రభుత్వ ఉద్యోగంలో వున్నా కుటుంబానికీ సాహిత్యానికీ ప్రధాన్యం కల్పించుకోవలసిందే. కొన్ని సార్లు చదవాలనుకున్నంత చదవలేకపోవచ్చు. రాయాలనుకున్నంత రాయలేకపోవచ్చు. సమయాభావం వల్ల అయినా దేని ప్రాధాన్యం దానికి ఇవ్వాల్సిందే. ఉద్యోగం భుక్తి కోసం, కుటుంబ బంధం, సాహిత్యం ఇష్టమైన వ్యాపకం. సాధ్యమైనంత వరకు అన్నింటినీ ఎంజారు చేస్తూ పని చెయ్యాల్సిందే.
ఓ రచయిత్రిగా మీ కర్తవ్యం..?
మనం రాసిన ప్రతి అక్షరానికి ఒక ప్రయోజనం వుండాలి. అయితే సాహిత్యం ఈరోజు అక్షరాలా పుస్తకాల్లోంచి సోషల్ మీడియాలోకి ఎగబాకింది. దాంతో ఎక్కువ సందర్భాల్లో అక్షరం దుర్వినియోగం అవుతుంది. కించపరచుకోడానికి, తిట్టుకోవడానికి చాలా మంది అక్షరాన్ని ఆయుధం చేసుకుంటున్నారు. దీనిలో మార్పు రావాలి. ఆరోగ్యకరమైన సాహిత్యం సృష్టించబడాలి. అందులో నేను కూడా భాగస్వామిని కావాలి.
మీ భవిష్యత్ ప్రణాళిక, అందుకున్న పురస్కారాలు..?
2012లో నోముల కథా పురస్కారం బహుముఖ కథకు, 2019 అల్లాడి సుబ్బు సాహిత్య పురస్కారం, 2022లోనే అంపశయ్య నవీన్ తొలి నవలా పురస్కారం అందుకున్నాను. ఇక భవిష్యత్ ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. వీలైనంత ఎక్కువ చదవాలి. రాయాలనిపించినపుడు రాయాలి.
- సలీమ