Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు నేటికీ కొన్ని రంగాలలో రాణించడానికి పోరాడుతూనే ఉన్నారు. ఆ కాలం నుండి ఈ ఆధునిక కాలం వరకు సాధికారత కొరకు వారి పోరాటం సాగుతూనే ఉంది. గతంలో 'ఆడపిల్లలకు పెద్ద చదువులెందుకు, అక్షరం ముక్క తెలిస్తే చాలు' అనే వారు. అటువంటి రోజులలో ఓ రచయిత్రిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. స్వాతంత్య్రం తర్వాత తెలుగు కథకుల్లో, నవలా కారుల్లో వాసిరెడ్డి సీతాదేవి ప్రముఖ పాత్ర వహించారు. తన రచనల ద్వారా స్త్రీలలో చైతన్యం తీసుకువచ్చారు. నేడు ఆమె వర్థంతి సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో...
గుంటూరు జిల్లా చేబ్రోలులో వాసిరెడ్డి రాఘవయ్య, రంగ నాయకమ్మలకు 1933 డిసెంబర్ 15న జన్మించారు వాసిరెడ్డి సీతాదేవి. చిన్నతనంలో తన చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఈమెను ప్రభావితం చేశాయి. ఫ్యూడల్ కుటుంబంలో పుట్టి సాంప్రదాయాల మధ్య పెరిగారు. ఆనాటి స్త్రీలకు అసలు తాము వివక్షను ఎదుర్కొంటున్నామనే కనీస స్పృహ కూడా లేదు. స్త్రీ లంటే ఇలాగే వుండాలనే భావాలతో కుచించుకుపోయిన జీవి తాన్ని గడిపేవారు. వీటన్నింటినీ చూస్తూ పెరిగిన సీతాదేవి వివ క్షను భరించలేకపోయేవారు. గ్రామంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, గృహహింస, వివక్షను సూటిగా ప్రశ్నించే వారు. ఈ పురుషాధిక్య సమాజం స్త్రీని వంటింటి కుందేలుగా, కోర్కెలు తీర్చుకునే యంత్రంగా మార్చడాన్ని తట్టుకోలేక పోయారు. సొంత వ్యక్తిత్వంలేని స్త్రీ జీవితమంటే ఆమెకు అసహ్యం. నిత్యం హింసతో కూడుకున్న కుటుంబ జీవితమన్నా ఆమెకు గిట్టేది కాదు. అందుకే వివాహం జోలికి పోకుండా ఆ కాలంలోనే తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకున్న సాహసి సీతాదేవి.
ప్రశ్నతోనే మొదలు
సీతాదేవి సాహితీ యాత్రను, జీవిత యాత్రను వేరు వేరుగా చూడలేము. ''ప్రశ్న నుంచే నా జీవితం ప్రారంభమయింది. ప్రశ్న నుంచే నా సాహితీ జీవితం కూడా ప్రారంభమైంది'' అంటారు ఆమె. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తల్లిని విసిగించేవారు. ఆడ పిల్లలంటే అమ్మలాటలు, బొమ్మలాటలకు పరిమితమైన ఆ రోజు ల్లోనే మగపిల్లలతో గోళీలు ఆడేవారు. మగరాయుడులా ఆ గంతులేంటి అంటూ తనను శాసించినప్పుడల్లా అంతరాంత రాల్లో ఏదో తిరగబడుతున్నట్లై ఏడుస్తూ రాసుకునేవారు. కోనేట్లో ఆడవాళ్ళ శవాలే ఎందుకు తేల్తాయి, మగవాళ్ళ శవాలు ఎందుకు తేలవు అనే ప్రశ్నలు వేధించినప్పుడు రాసుకున్నారు. ఎప్పుడూ మగవాడే ఆడదాని జట్టుపట్టుకొని రోడ్డు మీదకు ఎందుకు ఈడుస్తాడు. అన్న ప్రశ్నకు జవాబు దొరికినప్పుడు మధనపడి రాశారు. తన చుట్టూ వున్న జీవితం గురించిన ప్రశ్నలు, తెలిసీ తెలియని సమాధానాలు తన మస్తిష్కమే కాగితంగా, తన ఆలోచనలే కలంగా రాసుకున్నారు.
ఎలాంటి ఆటంకం లేకుండా
ఈమె రచించిన మొదటి నవల 'జీవితం అంటే' (1950), మొదటి కథ 'సాంబయ్య పెళ్ళి' (1952). అప్పటి నుండి 1955 వరకు తన రచనలకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించారు. ఆరేండ్ల విరామం తర్వాత 1963లో ఓ ముక్కోణపు ప్రేమకథను తీసుకొని 1963లో 'అడవి పల్లె' నవలగా మలిచారు. ఆనాటి యువత మధ్య సాగే ప్రేమలు, ద్వేషాలు, ఆప్యాయతలను ఈ నవలలో చక్కగా చిత్రీకరించారు ఆమె. సుమారు 40 నవలల వరకు రచించారు. ఈమె రచించిన మరీచిక నవల ఓ చర్చకు దారితీసింది. విప్లవ భావాలు కలిగిన ఓ మహిళా పాత్రను ఇందులో చూపించదనే ఆరోపణతో అప్పటి ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది.
కథా రచయితగా...
నవలా రచయితగా అద్భుతమైన రచనలు చేసిన సీతాదేవి కథలను కూడా అంతే చక్కగా రచించారు. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, అభ్యుదయ భావాలు, సామాజిక విశ్లేషణలే కథా వస్తువులుగా సుమారు 100కు పైగా కథలను రాశారు. మహిళలను జీవితాలను అద్వితీయంగా చూపించారు. స్త్రీల పట్ల సమాజంలో రావాల్సిన మార్పు ఆమె కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 'అతని కథ', 'మిస్టర్ ముకుందం', 'అమ్మమ్మ చెప్పని కథ', 'విభ్రమ' కథలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కండ్ల ముందు కనిపించే వ్యక్తులు, సమస్యలు అర్థం చేసుకుంటే వాటిని చక్కగా కథలుగా మార్చవచ్చని 'నా కథ రాయపూ'లో వివరంగా చెప్పారు.
అనుభవాలే అక్షరాలుగా
సీతాదేవి దృష్టిలో రచనలంటే ఏదో ఊహించి ఓ అందమైన ప్రపంచానికి అక్షరాల అద్దడం కాదు. మన చుట్టూ జరిగే జీవన పోరాటాలను, మన అనుభవాలను అక్షరాలుగా మలచడం. అది ఆమె రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్‌గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎమ్.ఎ. పూర్తిచేశారు.
అనువాదాలు
సమకాలీన సమాజాన్ని తీర్చిదిద్దే సామాజిక ఆర్థికాంశాలను తమ రచనలకు వస్తువుగా తీసుకుంటారామె. గ్రామీణ, పట్టణ జీవితాలను నిశితంగా పరిశీలిస్తూ, నేటి యువత, ఆయా పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ తమ రచనల ద్వారా వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. వీరి నవలల్లో చాలా భాగం కన్నడం, హిందీ భాషల్లోకి అనువాదం పొందాయి. వీరు రాసిన 'మట్టిమనిషి', 'వైతరణి' నవలలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భాషల్లోకి అనువాదం చేయించి ప్రచురించారు. 'మృత్యుంజయుడు (1988) శివసాగర్ మిశ్ర రచించిన ''అక్షత్'' హిందీ నవలకు తెలుగు అనువాదం, 'మట్టిమనిషి' నవలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫైనల్ ఎం.ఎ విద్యార్థులకూ, ''రాబందులు రామచిలుకలు' నవలను కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ విద్యార్థులకూ పాఠ్యగ్రంధాలుగా నిర్ణయిం చాయి. అలాగే సీతాదేవి రచనల మీద అనేక విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు పీహెచ్డీ, యం.ఫిల్ కోసం పరిశోధనలు చేశారు. చేస్తు న్నారు. ఆమె తన రచనలకు గాను ఎన్నో అవార్డులు కూడా పొందారు.
సినిమాలుగా...
సీతాదేవివి సుమారు 40 నవలలు, 10 కథా సంకలనాలు, 8 అనువాద పుస్తకాలు, 5 పిల్లల పుస్తకాలు వెలువడ్డాయి. ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగా నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా 'ప్రజా నాయకుడు', 'ప్రతీకారం' నవలను 'మనస్సాక్షి' సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమా లుగా వచ్చాయి. 'మృగతృష్ణ' నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు. ఈమె 1985, 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు. సవిమర్శక వాస్తవికత నుండి సోషలిస్టు వాస్తవికత దిశలో రచనలు సాగించిన తెలుగు రచయిత్రులలో అగ్రశ్రేణి రచయిత్రిగా పేరు గాంచిన డా||వాసిరెడ్డి సీతాదేవి 76 ఏండ్ల వయసులో ఆస్తమా వ్యాధికి చికిత్స పొందుతూ ఏప్రిల్, 13 2007లో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
ఆలోచింప జేస్తాయి
''సామాజిక సమస్యలనూ, జీవితాలనూ, వ్యథలనూ, గాథలనూ, ఆశలనూ, నిరాశలనూ, నిజాయితీతో, సృజనాత్మకంగానూ, కళాత్మకంగానూ చిత్రించినప్పుడు ఆ రచన పాఠకుల్ని ఆలోచింప చేస్తుంది. మనుషులు మారడం అంటే వారి ఆలోచనలు మారడమే'' అనే వాసిరెడ్డి సీతాదేవి రచనలు నిత్య జీవితాలను, ఆ నాటి కాల పరిస్థితులను మహిళల మనోభావాలను చక్కగా చిత్రీకరిస్తాయి. జీవనదిలా ప్రవహించే భావనదిలో పాత్రలను పడవలుగా చేసుకొని సాహితీయాత్ర సాగించారు సీతాదేవి.
సాహిత్యం, రాజకీయం వేరు కాదు
''నేను మార్క్సిస్టును, రచయితకు మార్క్సిస్టు దృక్పథం లేకపోతే ఆ రచన అసంపూర్ణం, అపరిమితం అవుతుంది. సాహిత్యం, రాజకీయం నా దృష్టిలో వేరు వేరు కాదు. అందుచేతనే ఈ దేశంలో రచయితలు విధిగా రాజకీయాల్లో పాల్గొని తీరాలి'' అంటారు సీతాదేవి. బాలభవన్ సంచాలకురాలిగా, యువతజన సర్వీసుల శాఖ ఉప సంచాలకురాలిగా పని చేసిన ఈమె నంది ఫిలిం అవార్డు, తెలుగు అడ్వైజరీ రిపోర్ట్, దూరదర్శన్ అడ్వైజరీ కమిటీ, ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమీలో సభ్యులుగా సేవలసిందించారు. జవహర్ బాలభవన్ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. 'ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో, ఒక లక్ష్యంతో ముందుకు సాగిపోయే స్త్రీని ఈ సమాజం గానీ, ఈ పురుషాధిక్యం కానీ ఏమీ చేయలేదు'' అంటారు ఆమె.
- పాలపర్తి సంధ్యారాణి