Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటకం... సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక హామీ. సమాజంలోని సమస్యలను వాటికి పరిష్కారాలను కూడా చూపెట్టే సాంఘిక నాటికలు సమాజ చైతన్యానికి స్ఫూర్తి దాతలు. మహిళలను గడపదాటనీయని కాలంలో స్త్రీ పాత్రలు కూడా పురుషులే వేసేవారు. కాలం మారుతున్న కొద్దీ మహిళలు కూడా నాటక రంగంలోకి ప్రవేశించారు. గొప్ప గొప్ప పాత్రలను పోషించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ తెచ్చుకుంటున్నారు. అయితే నాటికలు రాసే మహిళల సంఖ్య మాత్రం అత్యంత పరిమితంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరేట్ ఇటీవల కాలంలో ఏడు నాటికలు రాసి ప్రజాధారణ పొందారు. ఈరోజు 'తెలుగు నాటక దినోత్సవం' సందర్భంగా రంగస్థలంలో ఆమె ప్రయాణం ఎలా కొనసాగుతుంతో ఆమె మాటల్లోనే...
'నాటకాంతం హి సాహిత్యం' అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పృరించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తర్వాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ఎందుకంటే అన్నీ సాహిత్య ప్రక్రియలను కళలను తనలో కలుపుకుంటుంది నాటకం. నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజుల్లో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకానికి అంత శక్తి ఉంది. కాబట్టే ''నాటకం రసాత్మకం కావ్యం'' అన్నాడు కాళిదాసు.
నూతన భావజాల ప్రభావంతో...
నాటాకరంగ వికాసంతో పాటు స్త్రీల సమస్యలు నాటకరంగంలో అత్యధిక ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. స్త్రీల సమస్యల అంశమే ప్రధానంగా నాటక రచనా నిర్మాణం చేశారు. స్త్రీ జనాభ్యుదయం పట్ల రచయిత్రులకు ఆసక్తి పెరిగి, దానికి అనుగుణమైన నాటకాలను రచించారు. నిశితమైన పరిశీలనల ద్వారా సామాజిక పరిస్థితులకు, అవసరాలకు స్పందించి స్త్రీల కుటుంబిక సామాజిక స్థితిగతుల గురించి ప్రచారంలోకి వస్తున్న నూతన భావజాల ప్రభావంతో స్త్రీల జీవితాన్ని ఇంతకు ముందుకంటే భిన్నంగా చూడగల కొత్తచూపును అలవరచుకొని నిర్మాణాత్మకంగా రచనలు సాగించారు.
స్త్రీ జనాభ్యుదయం కోసం...
ఆధునిక కవిత, కథ, నవల వంటి సాహిత్య ప్రక్రియల్లో రచయిత్రులు స్త్రీ జీవితాన్ని అభివ్యక్తీకరించినంత దృఢంగా నాటక ప్రక్రియలో ఆవిష్కరించలేకపోయారు. దానికి కారణాలు అనేక రకాలుగా ఉన్నా, కొంతవరకు స్త్రీ జీవితాన్ని గూర్చిన ఆలోచన, ఆర్తి స్త్రీ నాటక రచయిత్రులలో కనిపించడం గమనించవచ్చు. ఇంతవరకు స్త్రీలు సాధించిన ప్రగతికి ఆధారమైన పరిస్థితుల నేపథ్యాన్ని గూర్చి, స్త్రీ జనాభ్యుదయం కోసం గతంలో చేసిన ప్రయత్నాల సాఫల్యాలను గూర్చి విశేషంగా నాటకాలలో తెలపడం జరిగింది. తెలుగునాట నాటక రచనలో స్త్రీల ప్రాతినిధ్యం తక్కువే ఉంది. నురువూరు వేంకట సుబ్బమ్మ, పోలాప్రెగడ సత్యకళాదేవి, జి.శాంతా కుమారి, అత్తలూరి విజయలక్ష్మి, గంగవరపు సీతాకుమారి, అత్తిలి పద్మావతి, సి.వి. రమణమ్మ, వాసా ప్రభావతి లాంటి వారు నాటకాలు రాశారు. నేను కూడా అసమర్థుడు, త్రిపుర శపథం, ఆల్ఫా, కో అహం, విరాట్, రాజ్యాంగం, తెలంగాణ @ 1947 అనే ఏడు నాటకాలు రాశాను.
మహిళా చైతన్యమే ప్రధానంగా...
నా పాత్రల్లో ఎక్కువగా మహిళా చైతన్యమే కనిపిస్తుంది. మహిళల ఎదుగుదలకు అడ్డుగా ఉన్న మూఢవిశ్వాసాల పట్ల అసహనాన్ని, అసంతృప్తిని, ఆక్రోశాన్ని ప్రకటించటమే కాకుండా స్త్రీల వ్యక్తిత్వ వికాసానికి అడుగడుగున అవరోధంగా నిలిచే సమస్యలను సున్నితంగా ప్రస్తావించి స్త్రీలని ప్రధాన పాత్ర దారులుగా నాటకాలు రాశాను. మహిళల సమస్యలను తొలగించడానికి మార్గాలు అన్వేషించటం సాహిత్యంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే అందుకు సరిపడా వస్తువుతో కథాంశతో నాటకం చేసేప్పుడు మొనాటనీ రాకుండా కూడా చూసుకోవాలి.
ఆధునిక దృష్టి కోణం అవసరం
స్త్రీకి సంకెళ్ళుగా ఉన్న సామాజిక ఆంక్షలను, కట్టుబాట్లను, సనాతన సంప్రదాయ ఛాయలను ఛేదించడానికి ప్రయత్నించే నాటకాలు ఇప్పటి వరకూ వచ్చాయీ. స్త్రీలే ప్రధాన పాత్రలుగా తమ సమస్యలకు తాము కొత్తగా ఎలా పరిష్కారం చూపుతారో ఆధునిక దృష్టి కోణంతో చూసే నాటకాలు రావలసిన అవశ్యకత ఉన్నది. స్త్రీ నిర్ణీత పరిధుల మధ్య మెలగవలసిన పరిస్థితిని అవగాహన చేసుకుని ఆ సరిహద్దులు దాటి చూసే పాత్రల విజయాలకు సంబంధించి నాటకాలు రావాల్సి ఉన్నది.
స్త్రీ పాత్రలు చాలా బలమైనవి
నేను రాసిన నాటకాల్లో రాజ్యాంగం, తెలంగాణ @1947 నాటకాలు మినహా మిగతా అయిదు నాటకాలు ప్రతిష్ఠాత్మక రవీంద్ర భారతిలో మూడు సార్లకి మించి ప్రదర్శింపబడ్డాయి. ఈ నాటకాలలో స్త్రీ పాత్రలు చాలా బలమైనవి. ప్రథాన పాత్రలు కూడా. నాటక కథా గమనాన్ని ఈ పాత్రలే నిర్దేశిస్తాయి. తెలుగు నాట ప్రస్తుతం నాటక రచన చేస్తున్న ఏకైక రచయిత్రినీ నేనే. తెలంగాణ నుంచి నాటకం రాస్తున్న మొదటి దళిత నాటక రచయిత్రిని కూడా నేనే.
నన్ను ప్రోత్సహించిన వారు...
నాటకం రాస్తే సరిపోదు. అది ప్రదర్శింపబడాలి. అలా నాతో నాటకం రాయించి ప్రదర్శన చేస్తున్న తమ్ముడూ, నాటకరంగంలో తెలుగు యూనివర్సిటీ నుంచి MPA చేసి M.Phil చేసిన నటుడు, దర్శకుడు అజయ్ మంకెనపల్లి ప్రోత్సాహంతో నేను నాటకం రాయటం మొదలు పెట్టాను. చిన్నప్పుడు క్రిస్మస్కి చర్చ్‌లో నాటకాలు విపరీతంగా వేసేవాళ్లం. అవి ఇలా ప్రొఫెషనల్ నాటకాలు కావు. కానీ ఆ అనుభవం కూడా నాకు ఎంతో తోడ్పడింది. హరికృష్ణ భండారి అలాగే అజారుల సహకారం ప్రోత్సాహం నన్ను ఈ సంవత్సర కాలంగా ఏడు నాటకాలు రాసేందుకు దోహదపడింది.
రాసేటపుడు ఎంజాయ్ చేస్తాను
నాటకరంగం నుంచి ఆదాయ వనరులు ఏవీ ఉండక పోవటం ఇటు వైపు దృష్టి నిలపకపోవటం కారణం కావచ్చు. ఎలా తమ రచనా నైపుణ్యాలను ఆదాయం సంపాదించే దిశగా మార్చుకోవచ్చు అనే అవగాహన ఏర్పర్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఇటువైపు నాటక రచయిత్రులు వచ్చే అవకాశం కూడా ఉంది. నా వరకు నాకు నాటకం రాసేప్పుడు చాలా ఎంజారు చేస్తాను. ఆ పాత్రలు నా కండ్ల ముందే తిరుగుతూ మాట్లాడుతున్న దృశ్యాలను నేను ముందే ఊహిస్తాను కాబట్టి నేను సృష్టించిన పాత్రలు రంగస్థలంపై కదులుతూ, రాసిన డైలాగులు చెప్పేటపుడు నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. అదీ కాక ప్రత్యక్షంగా ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, చప్పట్లు చాలా ప్రోత్సాహం ఇస్తాయి. కవిత, కథా ప్రక్రియల వల్ల రాని స్పందన ఒక నాటకం ప్రేక్షకుడికి చేరువైనప్పుడు మనం ప్రత్యక్షంగా దానిని అనుభవంతో చూస్తున్నప్పుడు కలిగే భావసంతృప్తి మాటల్లో చెప్పలేను.
నాటక రచనలో వెనకబడి ఉన్నారు
కవిత్వం, కథ రూపాల్లో కవయి త్రులు, రచయిత్రులు మహిళలుగా తమ గొంతును బలంగా వినిపి స్తున్నారు. అయితే నాటక రచనలో వెనకబడి ఉన్నారు. తగినంత ప్రాధాన్యం, ఉండాల్సినంత వాటా లేదు. ఇప్పుడిప్పుడు నటులుగా యువతులు స్త్రీలు నాటక రంగం మీద మక్కువతో వర్క్ షాప్‌లకు వస్తున్నారు. నేర్చుకుని ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. అయితే రచయిత్రులు దర్శకులు చాలా తక్కువే అని చెప్పాలి. ఈ విషయమై నాటక రంగంలో మరింత కృషి జరగవలసి ఉన్నది. తెలుగు యూనివర్శిటీ రసరంజని సంస్థ వారు నాటక రచనా వర్క్ షాపులు నిర్వహించారు. అలా మరిన్ని వర్క్ షాపులు ముఖ్యంగా స్త్రీలను భాగస్వామ్యం చేస్తూ వాళ్ళను నాటక రంగం వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. స్కూల్ స్థాయి నుంచే చిన్న చిన్న అంశాల,ు సమస్యలు ఇచ్చి నాటకాలు రాయించటం, వీలైనన్ని ఎక్కువ నాటకాలు వీక్షించేలా చేయటం కూడా కొత్త నాటక రచయిత్రులను తయారు చేసుకునేందుకు వీలు కుదరొచ్చు.
ఒకే రోజు ఐదు ప్రదర్శనలు
మాది జగిత్యాల జిల్లాలోని కొండాపూర్ గ్రామం. హైస్కూల్లో చదివేటప్పటి నుంచే నాకు నటన అంటే ఆసక్తి. కానీ ముందు చదువు పూర్తి చేసుకోవాలనుకున్నాను. మా అమ్మా, నాన్నలు లక్ష్మీ, శంకర్. నా ఆసక్తి చూసి అందరిలా కేవలం చదువుకో అనకుండా నాకు ఇష్టమైన రంగంలోకి వెళ్ళే విధంగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వీళ్ళ కన్నా మా అన్నయ్య వంశీకృష్ణ నా ప్రతీ అడుగులోనూ నా తోడు ఉండేవాడు. ఈ ప్రోత్సాహంతోనే డిగ్రీ చేస్తూనే Df. Techలో చేరాను. మూడేండ్ల పాటూ శిక్షణ తీసుకున్నాను. ఈ యాక్టింగ్ కెరియర్లో మూలాల నుంచి నేర్చుకోవాలని అనుకున్నాను. అందుకే పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చేస్తూనే Creative Theatre లో థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. దీని ఆధ్వర్యంలో ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ఒకే రోజులో 'రైట్ టు ఓట్' అనే వీధి నాటకాన్ని ఐదు ప్రాంతాలలో ప్రదర్శించాము. ఆ తర్వాత 'ఆల్ఫా' అనే నాటకంలో భాగం అయ్యాము. ఇప్పుడు మా టీం మొత్తం మరో మంచి ప్రదర్శన కోసం సిద్దమవుతున్నాం.
- బొల్లె వరలక్ష్మి
పాత్రను అనుభూతి చెందాలి
నేను క్రియేటివ్ థియేటర్ విద్యార్థిని. నటనాభిమానిగా వైవి ధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఓ మనిషిగా క్రమ శిక్షణతో ఉండడం, మనల్ని మనం నియంత్రిం చుకోవడం చాలా అవసరం. చాలా పరిశోధనల చేసిన తర్వాత నేను వీటిని సాధించగలిగే ఒకే ప్రదేశం థియేటర్ అని గుర్తించాను. నటన అంటే డైలాగులను గుర్తుపెట్టుకోవడం, వాటిని ప్రేక్షకుల ముందు చెప్పడం కాదు. ఆ పాత్రను అనుభూతి చెందాలి. కళాకారిణిగా మారిన తర్వాత మానసిక స్థిరత్వం, నమ్మకం, సమన్వయం, టీంతో కలిసి పని చేయడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నిజానికి నటుడు కావాలని మా నాన్న కలలు కన్నారు. కొన్ని ప్రయత్నాలు చేసి నటనకు స్వస్తి చెప్పారు. కరోనా సమయంలో నాన్నను మేము కోల్పో యాము. అప్పుడే నేను నటనలోకి రావాలని నిర్ణయించు కున్నాను. దీంతో మా ఇద్దరి కలలు నెరవేరుతాయి. నాన్న తెరపై కనిపించక పోవచ్చు, కానీ వారసురాలిగా నేను నాన్న పేరు నిలబడతాను. అది త్వరలోనే జరుగుతుంది. ఇప్పటికీ మా కుటుంబానికి ఆర్థిక మూలస్థంభం మా అమ్మనే. తను కూడా నాకెంతో సపోర్ట్ చేస్తుంది. మా అన్నయ్య కుటుంబం కోసం పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకున్నాడు. ఎంతో కష్టపడి ఎంబీఏ పూర్తి చేసాడు. నటనా రంగంలో నాకు మద్దతు ఇస్తున్న నా కుటుంబానికి, స్నేహితులకు కృతజ్ఞతలు. అయితే నటనా రంగాన్ని ఎంచు కున్నందుకు కొందరు నన్ను విమర్శించారు. దాంతో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. వాటి నుండి బయటపడ్డాను. చివరకు నా లక్ష్యాలకు అనుగుణంగా నా జీవితం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను.
- ఉషాశ్రీ మురళి