Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవం అయేంత వరకు గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి వస్తుంది. కానీ చాలామందికి ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం...
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీళ్లు తాగడం మంచిది. దీనికి ఒక చెంచా నిమ్మరసం, అరచెంచా తేనె.. కూడా కలిపితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని భోజనానికి ముందు కూడా తాగవచ్చు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే రెండు లీటర్ల నీటిలో రెండు మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వరుసగా 40 రోజుల పాటు తాగడం వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిని లవంగాలు, దాల్చిన చెక్క ముక్కకు బదులుగా బార్లీ, వాము.. చెంచా చొప్పున వేసి కూడా ప్రయత్నించవచ్చు. అలాగే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.
మంచి ఆహారం తీసుకోండి
పండ్లలో ముఖ్యంగా యాపిల్ మంచిది. ఆహారం ద్వారా వచ్చే కొవ్వుల్ని శరీరం గ్రహించకుండా చేయడంతో పాటు జీవక్రియల్ని ఇవి వేగవంతం చేస్తాయి. ఫలితంగా పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆయా సీజన్లలో లభించే తాజా పండ్లు, కాయగూరల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి. పొట్ట తగ్గడం కోసమైనా లేదంటే మామూలుగానైనా.. మీకు నచ్చిన ఆహారం, మీకు నచ్చిన సమయంలో తీసుకోవడం, డైటింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రభావం మీరు పాలిచ్చే మీ బిడ్డపై పడే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం మీకు, మీ బిడ్డకు శ్రేయస్కరం కాదు. కాబట్టి ముందు డాక్టర్ను సంప్రదించి వారి సలహా మేరకే ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఉత్తమం.
డబ్బా పాలు వద్దు...
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లి పాలు పట్టడం వల్ల కూడా సమస్యను తగ్గించుకోవచ్చు. తల్లి ప్రతిరోజూ బిడ్డకు పాలివ్వడం వల్ల రోజుకు శరీరంలో 500 క్యాలరీల దాకా ఖర్చవుతాయి. కాబట్టి పాలివ్వడం కూడా ప్రసవానంతరం పొట్ట తగ్గించుకోవడానికి ఒక మార్గం.
ఒత్తిడి దరిచేరకుండా...
ఈ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎదురవడం సహజం. దీనివల్ల పొట్ట తగ్గడానికి బదులుగా మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఒత్తిడిని దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండడం మేలు. ఇందుకోసం మీ చిన్నారి పడుకున్నప్పుడే మీరూ విశ్రాంతి తీసుకోవడం, మీకు నచ్చిన పనులు అంటే పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయడం మంచిది. అలాగే సిజేరియన్, నార్మల్.. వీటిలో మీకు ఏ పద్ధతిలో ప్రసవం జరిగినా ఆరు నెలల వరకు బరువులెత్తడం, త్వరగా పొట్ట తగ్గాలని మీకున్న బలాన్నంతా ఉపయోగించి కఠినమైన వ్యాయామాలు చేయడం అస్సలు మంచిది కాదు. పిల్లల్ని స్ట్రోలర్లో కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ దగ్గర్లో ఉండే పార్కుకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి వ్యాయామం అందడంతో పాటు మనసుకు ఆహ్లాదంగానూ ఉంటుంది. ప్రసవానంతర ఒత్తిడి, ఆందోళనలకు ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారం చూపుతుంది.
ఆరాటపడొద్దు
డెలివరీ తర్వాత త్వరగా పొట్ట తగ్గించుకోవాలని మనలో చాలామంది ఆరాటపడడం సహజం. ఈ క్రమంలోనే ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం, జిమ్లో చేరడం వంటివి చేస్తుంటారు. కానీ సుఖ ప్రసవమైనా, సిజేరియన్ అయినా కొన్నాళ్ల పాటు శరీరాన్ని కష్టపెట్టద్దంటున్నారు నిపుణులు. కాబట్టి డెలివరీ తర్వాత పొట్ట తగ్గించుకునే విషయంలో, తిరిగి పూర్వపు శరీరాకృతిని పొందే విషయంలో ఎప్పుడు వ్యాయామం మొదలుపెట్టాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎంతసేపు చేయాలి? వంటి విషయాలన్నీ సంబంధిత నిపుణులను సంప్రదించాకే మొదలుపెట్టడం ఆరోగ్యానికి మంచిది.
తిన్నవెంటనే కూర్చోవద్దు
భోజనం చేసిన తర్వాత చాలామంది కూర్చోవడమో లేక పడుకోవడమో చేస్తుంటారు. మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే మీ పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావు గంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యా నికి, పొట్ట తగ్గడానికి.. రెండింటికీ మంచిది. మీ బేబీని ఎత్తుకొని నడిస్తే మరీ మంచిది. అలాగే వీటన్నింటితో పాటు డాక్టర్ సూచించిన ప్రకారం పోస్ట్ ప్రెగెన్సీ బెల్ట్ పెట్టుకోవడం లేదంటే ఇంట్లో ఉండే చున్నీనే నడుం చుట్టూ కాస్త గట్టిగా బిగించుకోవడం.. వంటివి చేసినా కొన్ని రోజుల్లోనే పొట్ట తగ్గిపోయే అవకాశం ఉంటుంది.