Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘాలి లలితా ప్రవల్లిక... రచనల్లో వైవిధ్యం ఆమె ప్రత్యేకం. రాసేది సమాజ హితమై ఉండాలని కోరుకునే రచయిత్రి. స్వచ్ఛమైన తెల్లటి కాగితమంటి పిల్లలు నైతిక విలువలు మరుస్తున్నారని నిత్యం ఆవేదన చెందుతుంటారు. సాహిత్యం ఆ లోటును భర్తీ చేయాలని తపిస్తున్నారు. విలువలతో కూడిన, విజ్ఞాన వంతమైన సాహిత్యాన్ని సమాజం ముందు ఉంచుతున్న ఆమె సాహిత్య ప్రస్థానం ఆమె మాటల్లోనే...
కృష్ణాజిల్లా వేమవరం గ్రామంలో పుట్టాను. విశాఖ, కృష్ణాజిల్లాల్లోని పల్లె వాతావరణంలో పెరిగాను. అమ్మ అచ్యుతం, గృహిణి. మా నాన్న నందిగామ హనుమంతరావు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా విశాఖ జిల్లాలోని వివిధ గ్రామాలలో జడ్పీ హైస్కూల్లో పని చేశారు. నా విద్యాభ్యాసం రెండో తరగతి వరకు పెందుర్తిలో జరిగింది. ఐదో తరగతి వరకు సబ్బవరం, పదో తరగతి మునగపాకలో పూర్తి చేసి ఇంటర్ కోసం అనకాపల్లిలో చేరాను. తర్వాత నెల్లూరు వి.ఆర్ లా కాలేజీలో చదివాను. నా బీఏ ఉస్మానియా యూనివర్సిటీ. బీఈడీ ఆంధ్ర యూనివర్సిటీ. ఎమ్మె తెలుగు వెంకటేశ్వర యూనివర్సిటీ. అయితే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు.
లైబ్రరీలోనే ఎక్కువ సమయం
చిన్నప్పటి నుంచి పుస్తకపఠనం మీద ఆసక్తి ఉండేది. ఏ పుస్తకం కనపడినా వదలకుండా చదివేదాన్ని. విశాఖ జిల్లా మునగపాకలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా లైబ్రరీ ఉండటంతో ఎక్కువ సమయం అందులోనే గడిపే దాన్ని. అయితే పిల్లల కథలు, పుస్తకాలు తప్పించి నవలలు చదవొద్దనే వారు ఇంట్లో. నాన్న నిద్రపోగానే దాచుకున్న డిటెక్టివ్ నవలలు తీసి చదువుకునేదాన్ని. మళ్లీ వాటిని యదా స్థానంలో పెట్టేదాన్ని. లైబ్రేరియన్‌కి బుక్స్‌కి స్టాంపింగ్స్, కౌంటింగ్‌లలో సహాయం చేసి లైబ్రరీ మూయగానే కొన్ని బుక్స్ ఇంటికి తెచ్చుకునేదాన్ని. మళ్లీ లైబ్రరీ తీసేసరికి ఆ బుక్స్ వారికి అందించేదాన్ని. ఈ విధంగా చాలా పుస్తకాలు చదివాను.
అందరి ప్రభావంతో...
నాన్న డ్రిల్ మాస్టర్. వారు చిన్న చిన్న నాటికలు, బుర్ర కథలు రాసి స్కూల్ పిల్లల చేత వేయించేవారు. మా పెదనాన్న సీతారామాంజనేయ శర్మ, వారు స్కూల్ హెడ్మాస్టర్. వారు జానపద పాటలు రాసి స్కూల్ పిల్లల చేత డాన్సులు వేయించేవారు. మా మేనమామ వేమవరపు కృష్ణ బ్రహ్మం పాటలు రాసేవారు. వారి ప్రభావమో లేక పుస్తక పఠన ప్రభావమో తెలియదు కానీ నేను మాత్రం చిన్న వయసులోనే రాయాలనే కోరికతో పిల్ల కవిత్వానికి ఊపిరి పోశాను.
ఒకే మూసలో ఇష్టం ఉండదు
రాయడంలో మా నాన్నే నా స్ఫూర్తి. అంతేకాదు యండమూరి వీరేంద్రనాథ్ నవలలు విస్తృతంగా చదివేదాన్ని. ఆ విధంగా వివిధ ప్రక్రియల్లో రాయాలనే కోరిక ఉండేది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి, శ్రీశ్రీ మహాప్రస్థానం. ఈ రెండూ నాకు బాగా నచ్చేవి. ఏ మంచి రచన చదివినా వారిలా నేనూ రాయాలని అనిపించేది. ఓకే మూసలో, ఒకే ముద్రతో రాయటం మాత్రం నాకు ఇష్టం ఉండదు.
గొలుసు నవలలు
కవితలు, కథలు, గజల్స్, గేయాలు పద్యాలు, నానీలు ఇలా ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేశాను. 'మట్టి పాదాలు' కవితా సంపుటి, 'ఆహా కథాకుసుమాలు', 'మర్మదేశం' సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల ఇప్పటి వరకు నేను ముద్రించిన పుస్తకాలు. నిహారిక, మానసవీణ, పసరు కథలు, గొలుసు నవలలలో ఒక భాగంగా రాసాను. 26 మందితో 'వీరభద్ర గుట్ట' అనే గొలుసు నవల రాయించాను. ప్రస్తుతం 108 మందితో 'మాయా లోకం' అనే మరో గొలుసు నవల రాయిస్తున్నాను. పిల్లలచే 'నల్ల హంస' అనే గొలుసు నవల రాయించే ప్రయత్నంలో ఉన్నాను. నా 'మర్మదేశం' నవల ఎందరో మహానుభావుల ప్రశంసలు పొందింది. ఇంకా కొన్ని కథలు, కవితలు, ఓ నవల, గజల్స్, శతకాలు పుస్తకాలుగా తీసుకురావలసి ఉంది.
నైతిక విలువలు నేర్పాలి
సాహిత్య ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. సమాజాన్ని మార్చడంలో, తీర్చి దిద్దడంలో సాహిత్యం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. మన అమ్మ, బామ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే పంచతంత్ర, పేదరాశి పెద్దమ్మ, చందమామ కథలతోనే మొదలవుతుంది మన జీవితం. ఆ ప్రభావం పిల్లల మీద ఎంతగానో పనిచేస్తుంది. అందుకే అప్పట్లో నీతి కథలు చెప్పే వారు పిల్లలకు. వారి ప్రవర్తనను తీర్చేదిద్దగలిగేది కథలే. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు, కామిక్ బుక్స్ కరువైపోయాయి. బిజీబిజీ జీవితాల్లో ఫోన్ చేరువయ్యింది. ఆప్తులు దూరమయ్యారు. సినిమాల ప్రభావం పిల్లల మీద ఎక్కువగా పడుతోంది. మంచి కన్నా చెడుని ఎక్కువగా స్వీకరిస్తూ అవినీతిపరులుగా, సంస్కార హీనులై, మూర్ఖత్వం మూసలో మునిగితేలుతున్నారు. పాటలకు అర్ధాలు తెలియకపోయినా పరవశించి పాడుతు న్నారు. బుల్లితెర సీరియల్స్‌లో లీనమై కన్నీరు కారుస్తున్నారు. అందుకే రచయితలు తమ రచనల ద్వారా మంచి చెడుల విచక్షణ తెలియజేయాలి. నైతిక విలువలు తెలియజేసే రచనలు చేయాలి.
సమన్వయం కష్టమే...
కుటుంబం, ఉద్యోగం, సాహిత్యం... ఈ మూడింటి సమన్వయం అంత తేలికైనది కాదు. కచ్చితంగా సమస్యలు ఎదురవుతాయి. నెల్లూరులో ఉన్నప్పుడు స్కూల్ టీచర్‌గా, పార్ట్ టైం కాలేజీ లెక్చరర్‌గా, ట్యూషన్స్, ఇల్లు ఇంట్లో పనులు, సాహిత్య మీటింగులతో సతమతమయ్యే దాన్ని. ప్రైవేట్ స్కూలు టీచర్‌గా చాలా చాకిరీనే ఉండేది. సమయం దొరికేది కాదు. ఆరోగ్యం బాగుంది కనుక పరుగులు తీసేదాన్ని. ప్రస్తుతం ఉద్యోగ బాధ్యత నుంచి వైదొలిగాను. ఎందుకంటే స్కూల్ పిల్లలను ఆడిస్తూ కింద పడి వెన్ను విరిగిపోయింది. దాంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను.
పురస్కారాలు...
ఇప్పటి వరకు నేను చేసిన సాహిత్య సేవకు గాను జిల్లా కలక్టర్చే ఉగాది పురస్కారాలు, గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి రాష్టీయ పురస్కారం, సావిత్రిబాయి పూలే, ఆదర్శ మహిళా, పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం, గుర్రాల రమణమ్మా సాహితీ పురస్కారం, గుఱ్ఱం జాషువా పురస్కారం, సత్యశ్రీ పురస్కారం, గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం, సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం, విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం, అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, తానా వారి నుంచి 10,000 నగదు, సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు, ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు, తెలుగు కవితా వైభవం హైద్రాబాదు వారి నుంచి సహస్ర కవిమిత్ర పురస్కారాలు అందుకున్నాను.
అవకాశాలు వదులుకోవల్సి వస్తుంది
మహిళ అంటేనే కొన్ని సమస్యలు ఇంట్లో, బయట తలెత్తుతాయి. ముఖ్యంగా పత్రికలలో మన రచనలు చూసి ఫోన్ నెంబర్లు చూసి ఫలానా రచన బాగుంది అని ఫోన్లు చేస్తూ ఆ పరిచయాన్ని కంటిన్యూ చేయడానికి చూసే మగవాళ్ళు చాలామంది ఉంటారు. వెకిలి మాటలతో వేధించే వాళ్ళూ ఉంటారు. తమ రచనలలో ఉన్నతమైన భావాలతో మహిళలను గౌరవించే కవులు సైతం మహిళా రచయిత్రుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నేను గమనించాను. కొన్ని నేను ఎదుర్కొన్నాను. అలాంటి వారిని దూరం పెట్టాను. ప్రతి రచయిత్రికి పైకి రావాలనే కోరిక ఉంటుంది. కొన్ని కార్యక్రమాల కోసం ఇతర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వారి సహకారం లేకపోతే ఒంటరిగా ఆ మహిళ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒంటరిగా వెళ్లలేని మహిళలు మాత్రం తమకు వచ్చిన కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది.
సామాజిక అభ్యున్నతికై...
ఓ రచయిత్రిగా రేపటి భవితను తీర్చిదిద్దడం నా లక్ష్యం. నైతిక విలువలు తెలుపుతూ, సామాజిక చైతన్యం కలిగించే దిశలో రచనలు చేయాలి. పక్షపాతం లేకుండా, కల్మషం ఎరుగక నా కలం దేశ, సామాజిక అభ్యున్నతి దిశగా సాగిపోవాలి. సమాజ హితం కోరే రచనలు చేయడమే నా కర్తవ్యం. అలాగే కీర్తి ప్రతిష్టలు తెచ్చే మరిన్ని రచనలు చేయాలని అనుకుంటున్నాను. బాల, బాలికలను రచయితలుగా తీర్చిదిద్దాలనేదే నా కోరిక.
- సలీమ