Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు ముస్లింలు. నిరుపేదలు సైతం ఈ పండుగను సంబరంగా జరుపుకుంటారు. ఈద్ సందర్భంగా ప్రతి ఇంటిలో వివిధ రకాల వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. ఈ పండుగలో సేమియాకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే షీర్ కుర్మా రంజాన్ స్పెషల్ వంటకంగా చెప్పుకోవచ్చు. అలాగే హలీం, పాయ షోర్బా కూడా ఎంతో ఇష్టంగా చేసుకుని తింటారు. అలాంటి కొన్ని రంజాన్ స్పెషల్స్ ఈ రోజు మీ కోసం...
మటన్ హలీం
కావాల్సిన పదార్థాలు : మటన్ ఖీమా - ముప్పావు కేజీ, పచ్చిమిర్చి - ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్టు - టేబుల్ స్పూను, పసుపు - అర టేబుల్ స్పూను, దాల్చిన చెక్క - రెండు అంగుళాల ముక్క, లవంగాలు - నాలుగు, యాలకులు - మూడు, సోంపు - టేబుల్ స్పూను, మిరియాలు - టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, గోధుమ రవ్వ - అరకప్పు, మినప్పప్పు - టేబుల్ స్పూను, కందిపప్పు - టేబుల్ స్పూను, శనగ పప్పు - టేబుల్ స్పూను, పెసరపప్పు - టేబుల్ స్పూను, బియ్యం - టేబుల్‌స్పూను, ఆయిల్ - మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ - నాలుగు(సన్నగా తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - పావుకప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి చీలికలు - రెండు, మిరియాలపొడి - అర టేబుల్ స్పూను, పసుపు - పావు టీస్పూను, పెరుగు - ఒకటిన్నర కప్పులు, నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ గార్నిష్‌కు సరిపడా.
తయారు చేసే విధానం : కుకర్‌లో మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి వేయాలి.
దీనిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్లాసు నీఎళ్లు పోసి కలిపి, సన్నని మంటమీద ఐదారు విజిల్స్ రానివ్వాలి. మరో కుకర్ గిన్నెతీసుకుని గోధుమ రవ్వ, పప్పులు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన పప్పులను కూడా మెత్తగా రుబ్బుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ తరుగును గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ వేగాక మిరియాలపొడి, పసుపు, పెరుగు, ఖీమా పేస్టు, పప్పుల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించి నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి.
షీర్ కుర్మా
కావాల్సిన పదార్థాలు : సన్నని సేమియా - 250 గ్రాములు, మఖానా - కప్పు, నెయ్యి - మూడు స్పూన్లు, చక్కెర కోవా - ఒకటిన్నర కప్పు, పాలు - 250 గ్రాములు, సన్నగా తరిగిన బాదం - చెంచా, సన్నగా తరిగిన జీడిపప్పు - చెంచా, ఏలకులు - నాలుగైదు (పొడి)
తయారు చేసే విధానం : ముందుగా పాన్‌లో నెయ్యి పోసి సన్నని మంటపై వేడి చెయ్యాలి. అది వేడయ్యాక యాలకులు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో చక్కెర, నీటిని పోసి వేడి చేయాలి. పాకం అవుతున్నప్పుడు దానికి వేయించి పెట్టుకున్న సేమియా జోడించండి. బాగా కలుపుకొని అందులో పాలు పోసి తక్కువ మంటపై మరిగించాలి. పాలు చిక్కబడే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాని పైన వేయించిన యాలకులు, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేడి వేడి షీర్ కుర్మా రెడీ.
పాయ షోర్బా
కావాల్సిన పదార్థాలు : పాయ - అర కేజీ, స్పూన్ పసుపు పొడి - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నల్ల మిరియాలు పొడి - స్పూను, ఏలకులు - రెండు, నూనె లేదా నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డలు - మూడు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, టమాటో - ఒకటి (సన్నగా తరిగినది), కారం - టీ స్పూను, గరం మసాలా పొడి - అర స్పూను, కొత్తిమీర - కట్ట, చనా పప్పు - ఒకటిన్నర స్పూను, తురిమిన కొబ్బరి - ఒకటిన్నర టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం : వేయించిన చనా పప్పు, కొబ్బరి తురుము కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చి వాసనను తొలగించడానికి గోధుమ పిండి, వెనిగర్, పసుపు పొడితో పాయాను బాగా కడగాలి. పసుపు పొడి, ఉప్పు, నల్ల మిరియాల పొడి, ఏలకులతో పాటు పాయాను ప్రెజర్ కుక్కర్లో వేసి 5 కప్పుల నీరు పోసి 10 నిమిషాల వరకు ఉడికిం చాలి. పాయా కుక్కర్లో ఉడుకుతున్న ప్పుడు మసాలా సిద్ధం చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించాలి. తర్వాత టొమాటో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు కారం పొడి, కొబ్బరి తురుము వేసుకోవాలి. మసాలా నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు పాయా ఉడికిన ప్రెషర్ కుక్కర్‌ని తెరిచి అందులో ఈ సిద్ధం చేసుకున్న మసాలా వేయాలి. కుక్కర్ మూత పెట్టి మళ్లీ మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించి దించేయాలి. ఇందులో సూప్ ఎక్కువ కావాలనుకుంటే నీరు పోసి మళ్ళీ మరిగించాలి. చివరగా గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు వేయాలి. నూనె పైన తేలియాడే వరకు తక్కువ వేడి మీద ఉడికించు కుంటే పాయా రెడీ. ఇది పరాటా లేదా నాన్‌తో వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ముర్గ్ టిక్కా
కావాల్సిన పదార్థాలు : చికెన్ - అరకిలో, అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను, గరం మసాలా - టీ స్పూను, పెరుగు - కప్పు, కారం - టీ స్పూను, నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్టు - ఒక టేబుల్ స్పూను, కలర్ - కొద్దిగా, ఉప్పు - తగినంత, శెనగపిండి - ఒక టేబుల్ స్పూను, కోడి గుడ్లు - రెండు, బ్రెడ్ పొడి - రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం : ముందుగా చికెన్‌లో అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా వేసి బాగా కలిపి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత ఇందులో పెరుగు, నిమ్మరసం, జీడిపప్పు పేస్టు, కలర్, ఉప్పు, కారం వేసి బాగా కలుపు కోవాలి. ఈ ముక్కల్ని తందూరి ఊచకి గుచ్చాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన వేసుకో వాలి. ఇందులో బ్రెడ్‌పొడి, శెనగ పిండి కూర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఊచకి ఉన్న చికెన్ ముక్క లకి పట్టించాలి. ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి.