Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత సమాజంలో మహిళలు ఇంటా, బయటా కొన్నిసార్లు మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. అయితే ఇలా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పనిచేస్తే ఒత్తిడి బారిన పడే ప్రమాదం ఉందంటారు నిపుణులు. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించమంటున్నారు.
- చేసే పని ఏదైనా ఇష్టంగా చేస్తే పెద్ద కష్టంగా అనిపించదు. అయితే ఒకే తరహా పని పదే పదే చేయాల్సి వచ్చినప్పుడో, అందులో కొత్తదనం లోపించినప్పుడో మాత్రం విసుగ్గా ఉంటుంది. తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే అందులో నాణ్యతా దెబ్బతింటుంది. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే దాన్ని కొనసాగించకండి. కొంత విరామం తీసుకోండి లేదా మీ దృష్టిని వేరే వ్యాపకం మీదకు మళ్లించండి. దీనివల్ల ఒత్తిడి దరిచేరదు. పనిని పునఃప్రారంభించాల్సి వచ్చినప్పుడు మునుపటి ఉత్సాహంతో అడుగులేయగలరు.
- ఇంటా, బయటా పనుల ఒత్తిడి పెరిగిపోయిందా? ఏవీ సకాలంలో పూర్తికావడం లేదా? అయినా సరే హైరానా పడిపోవద్దు. కాస్త నిదానంగా ఆలోచించండి. ముందు చేయాల్సిన పనులన్నీ ప్రాధాన్యతా క్రమంలో విభజించుకోండి. దేనికి ఎంత సమయం పడుతుందో అవగాహన తెచ్చుకోండి. అప్పుడు కష్టంగా ఉన్నవాటిని ముందూ, సులువైన వాటిని తర్వాతా చేస్తే మీ శ్రమ వృథాకాదు. అలసటా ఎదురుకాదు. ప్రణాళికతో చేస్తే సులువుగా ఎలాంటి పనులైనా పూర్తయిపోతాయి.
- అన్ని విషయాలూ అందరికీ తెలిసి ఉండాలనేం లేదు. నాకే అన్నీ తెలుసు, నేనైతేనే కరెక్ట్‌గా చేయగలను అని మీకు మీరు అనుకోవడం, ప్రతి పనినీ నెత్తిన వేసుకోవడం వల్ల అధికభారం, ఒత్తిడితప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా ఇలా చేసే పనుల్లో కొన్నిసార్లు కొత్తదనమూ లోపించొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. మీకంటే చిన్నవారు చెప్పినా తెలుసుకొని ప్రయోగాలూ చేయండి. అప్పుడు ఒత్తిడిని దాటి ఉత్సాహంగా ఉండగలరు. అలాగే ఇతరులకూ బాధ్యతల్ని అప్పగించి వారికీ పని నేర్పించగలిగితే సరి. స్ట్రెస్ ఉండదు. జీవితం సానుకూలంగా సాగిపోతుంది.