Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామీణ పంజాబ్‌లో మూస పద్ధతులను బద్దలు కొడుతున్నారు. బాలికలకు సాధికారత కల్పిస్తున్నారు. దాని కోసమే రౌండ్‌గ్లాస్ ఫౌండేషన్ అనే సంస్థ 'వన్ గర్ల్ వన్ ఫుట్‌బాల్'ను స్థాపించారు. ఇది గ్రామీణ పంజాబ్‌లోని యువతకు, ముఖ్యంగా బాలికలకు సంపూర్ణమైన విద్య, ఆరోగ్యం సాధించడానికి అవసరమైన వాతావరణాన్ని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పంజాబ్‌లోని బోర్ గ్రామానికి చెందిన బల్జిందర్ కౌర్ అనే 13 ఏండ్ల అమ్మాయి ఆటల్లోకి ప్రవేశించడానికి, ఫుట్‌బాల్ బూట్ లేస్‌లను బిగించడానికి పాఠశాల అయిపోయిన తర్వాత నేరుగా శిక్షణా మైదానానికి వెళుతుంది. కౌర్... గ్రామీణ పంజాబ్‌లోని బాలికల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసే రౌండ్‌గ్లాస్ ఫౌండేషన్ స్థాపించిన 'ఒక అమ్మాయి, ఒక ఫుట్‌బాల్' ఆధ్వర్యంలో శిక్షణ పొంది జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫుట్‌బాల్ ఆడుతోంది. సెప్టెంబర్ 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం 6 నుండి 16 ఏండ్ల మధ్య వయసు గల బాలికలకు ఫుట్‌బాల్ శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కోచ్ ఇంటింటికీ తిరిగి
ఎన్జీఓ బృందం, కోచ్ కలిసి తమ అమ్మాయిలను ఫుట్‌బాల్ శిక్షణకు పంపించేలా వారి తల్లిదండ్రులను ఒప్పించేందుకు స్థానిక పంచాయతీతో కలిసి గ్రామంలో అనేక అవగాహన సెషన్లను నిర్వహించారు. అప్పట్లో వారు ఇంటింటికీ సందర్శించారని కౌర్ గుర్తుచేసుకుంది. ''మా కోచ్ మా ఇంటికి వచ్చారు. శిక్షణా సెషన్లను చూడటానికి నన్ను పంపించమని ఆమె నా తల్లిదండ్రులను ఒప్పించింది. ప్లేగ్రౌండ్‌కి వెళ్లి ఇతర పిల్లలు ఆడుకోవడం చూసిన తర్వాత నా శిక్షణను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. అది నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం'' అని కౌర్ అంటుంది.
మొదటి దశలు
విద్య, ఆరోగ్యం, స్థిరమైన పరిష్కారాల ద్వారా గ్రామీణ పంజాబ్‌లో సంపూర్ణ వాతావరణాన్ని నిర్మించడానికి 2018లో సన్నీ (గురుప్రీత్) సింగ్ ద్వారా రౌండ్‌గ్లాస్ ఫౌండేషన్ స్థాపించబడింది. ఫౌండేషన్ పంజాబ్‌లోని పిల్లలు, యువతలో క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పంజాబ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఫలితంగా నాణ్యమైన శిక్షణ, పోటీ అనుభవాన్ని అందించే 148 క్రీడా కేంద్రాలను పంజాబ్ అంతటా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఇది హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి క్రీడలలో 4,800 కంటే ఎక్కువ మంది పిల్లలను భాగస్వామ్యం చేసింది.
తల్లిదండ్రులు ఇష్టపడలేదు
''మా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ప్రారంభించినపుడు బాలికల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉండేది. ఆ సమయంలోనే మేము 'ఒక అమ్మాయి-నిర్దిష్ట స్పోర్ట్స్' ప్రోగ్రామ్ని రూపొందించాలనుకున్నాం'' అని చౌలా చెప్పారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఫౌండేషన్ గత ఏడాది స్పోర్ట్స్ పంజాబ్ చొరవతో వినూత్నమైన 'వన్ గర్ల్ - వన్ ఫుట్‌బాల్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదట్లో బాలికలు, వారి కుటుంబాలు దీనిపై ఆసక్తి చూపలేదు. అందుకే ఫౌండేషన్ ముందు వారిలో ఆసక్తి కలిగించే కృషి చేసింది. ''ఆడుకోవడానికి అనువైన మైదానం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ అమ్మాయిలను పంపడం లేదు. ఎందుకంటే చాలా ఆట స్థలాలు గ్రామాల పొలిమేరల్లో ఉన్నాయి'' అని ఆయన చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫౌండేషన్ పాఠశాలలు ముగిసిన తర్వాత వారి ఆట స్థలాలను ఉపయోగించుకునేలా ఒప్పించారు. ''ఇది తల్లిదండ్రులలో నమ్మకాన్ని, అమ్మాయిల్లో పరిచయాన్ని పెంచింది. కొంతకాలం తర్వాత బాలికల భాగస్వామ్యం 3శాతం నుండి 45శాతానికి పెరిగింది'' అని చౌలా చెప్పారు.
చదువుకు అంతరాయం లేకుండా...
ప్రస్తుతం ఫౌండేషన్ పంజాబ్‌లోని మోగా, రోపర్, లూథియానా, ఫతేఘర్ సాహిబ్‌లోని 47 గ్రామాలలో 818 మందికి పైగా బాలికలకు శిక్షణనిస్తోంది. ఈ కార్యక్రమం కింద ప్రతి అమ్మాయికి ఫుట్‌బాల్ ఆడేందుకుఅవసరమైన పరికరాలు, శిక్షణ కోసం కోచ్‌ను అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామంలో ఒక జట్టుకు శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు కోచ్‌లు ఉంటారు. ప్రతి జట్టులో 11 నుండి 17 మంది ఉండొచ్చు. ఈ ఫౌండేషన్ 15 మంది శాశ్వత కోచ్‌లను నియమించింది. అయితే స్వచ్ఛంద కోచ్‌ల సంఖ్య కాలానుగుణంగా మారుతుంది. అమ్మాయిల చదువులకు అంతరాయం కలగకుండా పాఠశాల అయిపోయిన తర్వాత శిక్షణా ఇస్తారు. పరీక్షల సమయంలో శిక్షణ తాత్కాలికంగా ఆపేస్తారు. ''ఈ శిక్షణ బాలికలు క్రీడలను వృత్తిగా చేపట్టేందుకు లేదా కోచింగ్, రిఫరీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ వంటి అనుబంధ వృత్తిలో చేరేందుకు సహాయం చేస్తుంది'' అని చౌలా చెప్పారు.
మారుతున్న ఆలోచనలు
ఘవడ్డి గ్రామానికి చెందిన అమన్‌దీప్ అనే 15 ఏండ్ల బాలిక మాట్లాడుతూ ఇప్పటివరకు తన ప్రయాణం చాలా సులభంగా సాగిందనీ, అయితే చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులను ఒప్పించడం చాలా కష్టమైన పని అని ఆమె గుర్తు చేసుకున్నారు. ''మా బంధువులు వచ్చి మా తల్లిదండ్రులతో ఇంటి పనులు చేయడానికి, పెండ్లి చేసుకొని అత్తారింటి వెళ్ళడానికే అమ్మాయిలు పుట్టారని, అందుకే మమ్మల్ని ఆడుకోనివ్వకూడదని చెప్పేవారు''. అయితే ఆమె తన కోచ్ సందీప్ గురించి మాట్లాడుతూ. ''ఇంటింటికీ వెళ్లి మా తల్లిదండ్రులను ఒప్పించాడు. అతను మా బాధ్యత తీసుకున్నాడు. అతను మమ్మల్ని చూసుకుంటాడని, మాలో ఎవరికీ ఏమీ జరగదని మా తల్లిదండ్రులతో చెప్పాడు'' అంటూ ఆమె గుర్తుచేసుకుంది.
సాధికారత కల్పనకు...
ఫుట్‌బాల్‌పై ఉన్న అపారమైన ప్రేమతో సందీప్ అక్కడి అమ్మాయిల జీవితాలను మార్చాలని, క్రీడ ద్వారా బాలికలకు సాధికారత కల్పించాలనుకున్నాడు. ''అమ్మాయిలు ఏమీ చేయలేరని చాలామంది భావిస్తారు. కానీ నేను ఎక్కువ మంది అమ్మాయిలను మైదానంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. రౌండ్‌గ్లాస్ ఫౌండేషన్‌తో అనుబంధం ఏర్పడిన తర్వాత మా గ్రామంలోని 35 మంది అమ్మాయిలను ఫుట్‌బాల్ ఆడేందుకు ప్రోత్సహించాను'' అని ఆయన చెప్పారు.
సానుకూల మార్పు...
ముస్తఫాబాద్ గ్రామానికి చెందిన వాలంటీర్ కోచ్ అయిన హర్మన్జోత్ కౌర్ తన గ్రామం నుండి ప్లేగ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన మొదటి అమ్మాయి. తన కష్టాలను ఇలా వివరించింది. ''మొదట్లో నా తల్లిదండ్రులను ఒప్పించడం చాలా కష్టమైంది. కానీ చివరికి ఒప్పించగలిగాను. నేను గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం చూసి, నా వయసు అమ్మాయిలు ఆడేందుకు ప్రేరేపించబడ్డారు. యువతులను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం కొనసాగించగలిగినందుకు నేను గర్వంగా, సంతోషంగా ఉన్నాను. తద్వారా వారు ఫుట్‌బాల్ ప్రపంచంలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు'' అని చెప్పింది. గ్రామీణ ప్రాంతాల బాలికల్లో క్రీడల పట్ల వచ్చిన సానుకూల మార్పును చూశాయని ఆమె జతచేస్తుంది. ప్రస్తుతం చాలా మంది బాలికలు తమ పాఠశాలల్లో చురుకుగా ఫుట్‌బాల్ ఆడుతున్నారని, పాఠశాల సమయానికి మించి తమ అభ్యాసాన్ని కొనసాగించడంలో ఫౌండేషన్ వారికి సహాయపడుతుందని ఆమె చెప్పారు.
లింగ వివక్షకు సవాలు
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,800 మంది బాలికలను ప్రోగ్రామ్‌లో చేర్చుకోవాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. పంజాబ్‌లోని రెండు లేదా మూడు గ్రామాల్లో క్రీడా కేంద్రాలను ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. ఇందులో హాకీ, టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్ వంటి ఇతర ఆటల్లో కూడా శిక్షణ ఉంటుంది. మొదటి కేంద్రం మే మధ్యలో ఫతేగర్ సాహిబ్‌లో ప్రారంభించబడుతుందని చౌలా అన్నారు. ''ఫుట్‌బాల్ గేమ్ పంజాబ్‌లో క్రీడా సంస్కృతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. బాలికలకు గేమ్-ఛేంజర్‌గా ఉంటుంది. ఇది మైదానంలో నైపుణ్యాలను, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, లింగ వివక్షను సవాలు చేయడానికి, అడ్డంకులను అధిగమించడానికి వారికి ఒక వేదికను కూడా అందిస్తుంది. క్రీడల ద్వారా బాలికలకు సాధికారత కల్పించి, మరింత సమగ్రమైన, సమానమైన ప్రపంచాన్ని సృష్టించగలం'' అని చౌలా చెప్పారు.
లింగ అవరోధాన్ని అధిగమిస్తూ...
రాష్ట్ర స్థాయిలో ఆడిన కౌర్ ఇప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాలని, అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షిస్తోంది. ''ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం. గ్రామీణ పంజాబ్‌లోని లింగ అవరోధాన్ని ఛేదిస్తూ ఆడపిల్లలు బయటకు వచ్చి ఆడుకునేలా ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. తమ అమ్మాయిలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి అనుమతించేలా తల్లిదండ్రులను ప్రేరేపించడం మా లక్ష్యం. ఇది అమ్మాయిల్లో నాయకత్వం, జట్టుకృషి, క్రమశిక్షణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వారి భవిష్యత్‌ను వారే నిర్మించుకునే అవగాహనను కల్పిస్తుంది'' అని రౌండ్‌గ్లాస్ ఫౌండేషన్‌లో నాయకుడు విశాల్ చౌలా చెప్పారు.
అబ్బాయిలు ఎగతాళి చేస్తారు
తల్లిదండ్రులు తమ అమ్మాయిలు క్రీడా దుస్తులను ధరించేందుకు మద్దతు ఇస్తున్నారు. అయితే గ్రామంలోని వారి మగవారి నుండి అనేక మాటలు భరించాల్సి వస్తుందన్నారు. పురుషుల ఆధిపత్య క్రీడ ఆడటం వారికి చాలా సవాలుగా ఉందన్నారు. ఫుట్‌బాల్ ఆడుతున్నందుకు గ్రామంలోని చాలా మంది అబ్బాయిలు తమను ఎగతాళి చేస్తారని కౌర్ గుర్తుచేసుకుంది. ''మాకు ఏమీ తెలియదని, 'ఫుట్‌బాల్ పురుషుల క్రీడ, మీరెందుకు ఆడుతున్నారు' అని వారు అంటున్నారు. కానీ మేమంతా అలాంటి మాటలకు కుంగిపోము'' అని ఆమె అంటుంది.