Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె ఓ రేడియో జాకీ, వ్యాఖ్యాత, సినీ గీత రచయిత్రి, కవయిత్రి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్... ఇలా ముఖాముఖి నిర్వాహకురాలిగా సాహిత్య లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న వర్ధమాన రచయిత్రి. తెలుగు సాహితీ వనంలో వికసించిన సుమబాలై పరిమళిస్తోంది. ఎదిగిన కొద్ది ఒదిగి వుండాలనే దానికి నిలివెత్తు నిదర్శనం... ఆమే నిత్యం చిరునవ్వులు చిందించే విశ్వైక... తన సాహిత్య ప్రయాణం వెనక దాగిన పదేండ్ల శ్రమ గురించి తన మాటల్లోనే...
సాహిత్య సజన చేస్తానని నేను కలలోనైనా ఊహించలేదు. ఊహించనివి జరగటమే జీవితం అంటారు కదా! అలా నేను ఈ మార్గంలోకి వచ్చాను. నా నేపథ్యం విషయానికి వస్తే నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. డిగ్రీ గుంటూరులోని ఉమెన్స్ కాలేజీలో పూర్తి చేశాను. తర్వాత అక్కడే కంప్యూటర్ కోర్సు నేర్చుకొని ఉద్యోగం కూడా చేశాను. అమ్మ, నాన్న, నేను, చెల్లి మధ్యతరగతి కుటుంబం. నాన్న హెల్త్ సూపర్వైజర్ గా సేవలందించి రిటైర్ అయ్యారు. అమ్మ గహిణి. మంచితనం, మానవత్వం వారు మాకు ఇచ్చిన ఆస్తులు. మేము ఏం చేస్తామన్నా ఎంతో ప్రోత్సహించేవారు.
తాతయ్య నాకందించిన ఆస్తి సాహిత్యం
భాష పైన మమకారం ఉన్న అమ్మానాన్న పాఠశాలకు వెళ్లక ముందు నుండే మాకు వేమన, సుమతి శతకాలు వల్లె వేయించేవారు. నాకు సాహిత్యం పైన మక్కువ ఎప్పుడు కలిగింది అనే విషయానికి నా దగ్గర నిర్దిష్టమైన సమాధానం లేదు. సాహితీమూర్తి అయిన మా తాతయ్య పద్యాలు అనర్గళంగా పాడేవారు. ఒక పుస్తకం కూడా రాశారు. నా పెండ్లికి అదే కానుకగా ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ జాగ్రత్తగా దాచుకున్నాను. ఆయన ప్రభావమే నాపై వుందనకుంటాను. అదే విధంగా చిన్నప్పటి నుండి నేను చదివిన కథల పుస్తకాల ప్రభావం కూడా నాలో ఎక్కడో తెలియకుండానే అంతర్లీనంగా ఎదిగి సాహితీ సజన వైపు నన్ను నడిపించాయని నమ్ముతాను.
అది కవిత అని తెలియదు...
చిన్నతనం నుండి ఎంతో చురుగ్గా ఉండే దాన్ని. కళలంటే చాలా మక్కువ. ఆటలు, పాటలు,డాన్సులు దేనిలో తగ్గేదాన్ని కాదు. చిన్నతనంలో వ్యాసరచన, వక్తత్వం పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడు సామాజిక కవితను రాశాను. నాన్న దాన్ని చూసి చెప్పేదాకా అది కవిత అని నాకు తెలియదు. నాన్న స్నేహితులు అది చూసి చాలా బావుందని పత్రికలో అచ్చు వేయించారు. తర్వాత పైచదువులు, వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యత క్రమంలో రచనలు చేయలేదు.
ఖాళీ సమయంలో....
పిల్లలు ప్రాథమిక తరగతులకు వెళ్లే సమయం లో నాకు దొరికిన ఖాళీ సమయం నన్ను రచనలకు ప్రేరేపించింది. అనుకోకుండా అదే సమయంలో నాకు రేడియో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. ఇంట్లో నుండే దానికి వర్క్ చేసేదాన్ని. ఆ క్రమంలో నేను ప్రతిరోజు వార్తాపత్రికలు చదివేదాన్ని. ప్రతి విషయాన్ని అన్నీ కోణాలలో చూడాలని నాకు బాగా తెలిసింది అప్పుడే. గత తొమ్మిదేండ్ల నుండి రేడియో వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాను. ఇంటి పని అంతా చూసుకొని రేపటి కార్యక్రమానికి సంబంధించిన అంశాన్ని గురించి పూర్తిగా రాసుకునేదాన్ని.
సినిమా పాటలు...
నేను రాసిన కవితలను ఫేస్బుక్లో పెట్టేదాన్ని. చాలామంది చూసి బాగున్నాయని కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఆ ప్రోత్సాహంతో రోజుకొక కవిత రాసి పెట్టేదాన్ని. అలా ఫేస్బుక్ లో నా కవితలు చూసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకు పాటలు రాస్తారా అని అడగడం, నేను ప్రయత్నించటం ఇప్పటికి మూడు సినిమాలలో ఆరు పాటలు, ఆల్బమ్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ ఇలా దాదాపు దాదాపు 10కి పైగా పాటలు బయటకు వచ్చాయి. కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాత్రి సమయంలోనే ఎక్కువగా రాసుకునేదాన్ని. ఇలా రెండు మూడు నెలలు నాకు నిత్యకత్యమైంది. ఆ సందర్భంలో కాస్త ఆరోగ్యం కూడా దెబ్బతింది.
కొన్నింటిని పట్టించుకోను
ప్రశంసల విషయానికి వస్తే నేను రాసిన పాట చాలా బాగుంది అంటూ నా తొలి పాట పాడిన చిత్ర ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. జీవితంలో మరువలేని ఘట్టాలలో ఇది ఒకటి. నా కవితలకు ఎందరో ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. కొన్ని కవితలకు నగదు బహుమతులు కూడా వచ్చాయి. ఈమధ్య కథలు, వ్యాసాలు కూడా రాస్తున్నాను. ఇటీవల రైతును గురించి రాసిన కవిత రాష్ట్ర స్థాయి లో ప్రథమ బహుమతి పొందింది. ప్రతి పని లోనూ ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురవు తాయి. ప్రతి విమర్శను పట్టించుకో వలసిన అవసరం లేదు. కొన్నింటిని మాత్రం సద్విమర్శగా తీసుకొని మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. నేను ఎదిగే క్రమంలో నా భర్త, నా పిల్లలు నాకు ఎంతో సహకారం అందిస్తు న్నారు. వారి సహకారం లేనిదే నేను ఇంత దూరం రాకపోయేదాన్ని.
ఎంత కష్టం వచ్చినా...
సాహిత్యం సేవ విషయానికి వస్తే నేను 'అక్షరయాన్' మహిళా రచయిత్రుల సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాను. మా సంస్థ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్య క్రమాలు చేపడుతున్నాము. మహిళా రచయితలకు ఒక గౌరవాన్ని, స్థానాన్ని నిలిపే దిశగా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ.. చక్కని అవకా శాలను కల్పిస్తూ అయినంపూడి శ్రీలక్ష్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తు న్నారు. మనం ముందుకు ఎదిగే క్రమంలో మొదట అడుగుపడి ఉండదు. కానీ అతి కష్టం మీద అడుగు వేసి ఉంటాము. ఆ తర్వాత వచ్చే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నడు స్తున్నాం. ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో అని బాధపడటం కాదు.. ఏ కష్టం వచ్చినా నేను దాట గలను అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతిసారి ప్రతి విషయమూ మనకు అనుకూలం కాకపోవచ్చు. దానిని గూర్చి ఆలోచిం చటం మానేసి ముందుకు నడుస్తూనే పోవాలి. ప్రతిభను పెంచుకుంటూ పోవాలి. అదే నేను కొనసాగిస్తున్నాను.
మధురానుభూతులు
పెండ్లి తర్వాత నా భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చాను. దాంతో నా సాహితీ రచన అంతా హైదరాబాద్ లోనే మొదలయ్యింది. అమ్మ, నాన్న తర్వాత నన్ను ఎక్కువగా ప్రోత్సహించిన వారిలో మా చిన్నాన్న విద్యాసాగర్ శర్మ ఒకరు. నా అభివద్ధిని అందరితో ఎంతో ఆనందంగా పంచుకునే వారు. ప్రశంసలు మన మనసును ఎంతో ఉత్తేజ పరుస్తాయి. మరింతగా మనం ముందుకు వెళ్లడానికి దోహదపడతాయి. నేను రాసిన తొలి పాటకు ఆదిత్య మ్యూజిక్ వారు ప్లాటినం డిస్క్ తో సత్కరించారు. అలాగే నా ఈ ప్రయాణంలో జానకి, విశ్వనాథ్ గార్లను కలవడం ఒక మధురానుభూతి. నా రచనలను మెచ్చుకున్న వారిలో తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, మాధవ పెద్ది సురేష్, జమున ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఎదిగే క్రమంలో నా భర్త, నా పిల్లలు నాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వారి సహకారం లేనిదే నేను ఇంత దూరం రాకపోయేదాన్ని. ఇలా శ్రేయోభిలాషులందరి సహకారంతో నాదైన ముద్రవేస్తూ తెలుగు సాహితీవనాన చిన్నారి సుమబాలనై పరిమళిస్తున్నాను.
సరైన ప్రణాళిక వుంటే
నా స్వరం బాగుండటంతో అప్పటిలో నన్ను సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పడానికి పిలిచారు. ఇంట్లో పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని నేను చేయను అని చెప్పాను. కానీ వాణిజ్య ప్రకటనకు గాత్రం చేస్తుంటాను. సెంట్రల్ రైల్వే వారివి, రియల్ ఎస్టేట్, జ్యువెలరీ షాప్ ల వారి ప్రకటనలు చేసాను. ఈ మధ్య ఒకదానిలో నటించాను కూడా. అది ఇంకా రిలీజ్ కాలేదు. వ్యాఖ్యాతగా మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వ్యాఖ్యతగా ఎందరో ప్రముఖుల మధ్యలో మాట్లాడటం మొదట్లో కాస్త భయం అనిపించిన తర్వాత అది అలవాటుగా మారింది. రవీంద్ర భారతి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, త్యాగరాయ గాన సభ ఇంకా పలు వేదికల పైన వ్యాఖ్యాతగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సరైన ప్రణాళిక ఉంటే ఏదీ పెద్ద సమస్య అనిపించదు.
నేను రాసిన పాటలు
'మహబ్బత్ మే' సినిమాకు గాను ''మేఘాల లోగిలిలో పూచే ఆ పువ్వులే.. మహిలోనా వెదజల్లే లేలేత గంథాలే''; ''నీకెప్పుడూ నేనెప్పుడూ దూరం కానురా.. నిన్ను కన్న అమ్మ నేను రా'' అంటూ రెండు పాటలు రాశాను ఇందులో నా తొలి పాట చిత్ర గారు పాడారు. 'కారులో షికారుకెళ్తే' సినిమాలో ''కంటిపాపలో చుక్కలు మెరిసే.. గుండె గూటికి రెక్కలు మొలిచే'' 'భగత్ సింగ్ నగర్' సిినిమాలో ''ఓ బొజ్జ గణపయ్య'', ''ఎవరేమైనా ఎదురెదైనా'', ''అల ఓర చూపు చూసి ఎల్లి పోమాకే'' మూడు పాటలు రాశాను. ''దీపావళి వచ్చింది.. సందళ్ళే తెచ్చింది.. ఈ వేళ మన ఇంటికి'' అంటూ దీపావళి పండుగ మీద, ''ఆనంద నందనాల రాఖీ పండుగ ఈ రక్షాబంధనాల ప్రేమే అండగా'' అంటూ రాఖీ పండుగ మీద మాధవ పెద్ది సురేష్ సంగీత సారధ్యంలో ఆల్బమ్ కి పాటలు రాశాను. ఇంకొక రెండు, మూడు ప్రైవేటు పాటలు, రెండు లఘు చిత్రాలకు పాటలు రాశాను. మరో సినిమాకు రెండు పాటలు రాశాను. అది ఇంకా విడుదల కాలేదు.