Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల పెంపకంలో ప్రేమ, కోపం, గారాబం, క్రమశిక్షణ.. ఏదైనా ఓ పద్ధతిలో సాగాలి. దేనిలోనూ అతి కూడదు అంటున్నారు నిపుణులు. లేదంటే వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.
- పిల్లలపై ప్రేమ చూపాలి. అలాగని అది హద్దులు దాటి మితిమీరిన గారంగా మారకూడదు. చాలామంది తల్లిదండ్రులు చిన్నారులు కోరగానే తెచ్చివ్వాలనుకుంటారు కానీ దాని వెనుక గల కష్టాన్ని మాత్రం తెలియనివ్వరు. కొందరైతే పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామన్న అపరాధ భావనతో కోరిందల్లా ఇస్తుంటారు. ఇదే అలవాటుగా మారితే.. 'అడిగితే చాలు.. ఏదైనా అమ్మానాన్న తెచ్చిస్తా'రనే భ్రమలోకి వెళ్లిపోతారు. తీరా ఏదైనా దక్కకపోతే భరించలేరు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే అవసరాన్ని బట్టే కొనివ్వడం అలవాటు చేయాలి. కష్టం విలువ తెలిసేలా చూడాలి.
- మన పిల్లల ప్రవర్తన మనకు కాక ఇంకెవరికి బాగా తెలుస్తుంది? వాళ్లు చేస్తున్నది తప్పని తెలిసినా గారాబం చేయొద్దు. దాంతో తప్పు చేసినా పర్లేదనే ధోరణిలోకి వెళ్లిపోతారు. అమ్మానాన్నల అతి ప్రేమను అలుసుగా తీసుకొని మంచీచెడూ తేడా తెలియకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోతారు. ఈ తీరు వారిని చెడు మార్గంలోకి నెట్టగలదు. భవిష్యత్తులో సమస్యలకీ దారి తీయొచ్చు. అలాగని ప్రతిసారీ తీవ్రంగా దండిచాలనీ ఏమీలేదు. మృదువుగా అయినా గట్టిగా చెప్పాల్సిందే. అప్పటికి బాధపడినా మంచీ చెడూ విచక్షణ తెలుస్తుంది.
- కొందరు అమ్మానాన్న 'మా చిన్నతనంలో ఇలా ఉండేది' అంటూ అతి క్రమశిక్షణ ప్రదర్శించాలి అనుకుంటారు. అంతా వారి భవిష్యత్తు కోసమనే అనుకుంటారు. కానీ.. ఈ తీరు పిల్లలను స్వేచ్ఛ లేదనుకొనేలా చేస్తుంది. ఇంట్లో అమ్మానాన్న కోరుకున్నట్లే ప్రవర్తించినా, బయట తమకి నచ్చినట్లు నడుచుకుంటారు. ఒక్కోసారి చెడు మార్గాలకీ ఆకర్షితులవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులపై ద్వేషాన్ని పెంచుకొనే ప్రమాదం ఉంది. ఈతరం పిల్లల ధోరణి, ఆలోచన వేరు. పాత పద్ధతుల్లో సాగాలనుకోవద్దు. వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ మనమూ మారాలి. కఠినత్వానికి కాక మృదువైన ప్రవర్తనకి ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే ఏది చెప్పినా సానుకూలంగా తీసుకుంటారు. ఆరోగ్యంతోపాటు ఆనందకర వాతావరణంలో పెరగగలుగుతారు.