Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొట్ల వెంకటలక్ష్మి... సాధారణ అంగన్వాడీ టీచర్. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు భరించింది. చిన్న వయసులోనే పెండ్లి... కష్టాలు... కడగండ్లు కలగలసిన బాల్యం ఆమెకు మిగిల్చింది కన్నీటి జీవితం. ఏడాది కొడుకును వదిలి ఉద్యోగ శిక్షణకు వెళ్ళింది. ఆ ఎడబాటు ఆమెను గాయకురాలిగా, గీత రచయితగా మార్చింది. పల్లెపాటలు, బతుకు పాటలు, బతుకమ్మ పాటలు ఆమె స్వరం నుండి అనర్గళంగా ధ్వనిస్తాయి. 'నా ధైర్యం, నా ధనం, నా సంతోషం, నా సంబరం నా అక్షరమే. విలువైన ఆలోచనలు కలవారు ఎప్పుడూ ఒంటరి వారు కాదు. అక్షరమే నా అంతరాత్మ' అంటూ తన పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కన్నీటిని దిగమింగుతూ నిత్యం ఓ పాటై ప్రవహిస్తోన్న ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం...
మాది మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామం. దళిత కుటుంబంలో పుట్టాను. మా అవ్వ తొట్ల వీరమ్మ, మా అయ్య తొట్ల చిన్నవెంకయ్య. మా అవ్వ నాట్లు కోతల గుత్త మేస్త్రి. పది మందికి పని నేర్పుతూ తను కూలి పని చేస్తూ మమ్ముల బతికించింది. మా అయ్య చెప్పులు కుట్టేవాడు. మా అయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోవడంతో మా అవ్వను పెండ్లి చేసుకున్నాడు. మా అవ్వకు మేము ముగ్గురం. మా అన్నయ్య, మా అక్క తర్వాత నేను చిన్నదాన్ని. మా అన్నయకు పెండ్లి అయ్యిన తర్వాత నేను పుట్టానంట. నేను ఐదో నెలల పాపగా ఉన్నప్పుడు మా అన్నయ్య చనిపోయాడు. ఆ బాధతో అవ్వ నాకు సరిగా పాలు ఇవ్వలేదు. చెట్టంత కొడుకు చనిపోవడంతో అవ్వ ఎప్పుడూ కుమిలిపోతుండేది. అప్పుడు మా అక్క బొడ్డు గురిగిలో కల్లు తీసుకొచ్చి రోజూ నాకు తాపిచ్చేదట. మా అక్క తెచ్చిన ఆ తాటికల్లే తల్లిపాలయ్యాయి నాకు.
కూలికిపోయి మమ్మల్ని బతికించింది
అవ్వ పనికి వెళ్లి వచ్చే వరకు కల్లు మత్తులో ఆకలి తెలియక పడుకునేదాన్ని. మా అయ్యేమో మమ్మలందరినీ వదిలేసి తన మొదటి సంబంధం కొడుకు మా పెద్దన్నయ్య దగ్గర ఉండేవాడు. మా అవ్వ కూలి పనికి పోయి ఎంతో కష్టపడి మమ్ముల బతికించింది. మా అయ్య ద్వారా అవ్వకు వచ్చిన భూమిని తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ మా అక్కను నన్ను పెంచింది. అక్కకు పెండ్లి చేసి ఇల్లరికం పెట్టుకుంది. నాకు ఐదేండ్లు వచ్చిన తర్వాత బడికి తోలింది. బడిలో 'మీ నాన్న ఏమి పని చేస్తారమ్మా' అని సారు అడిగాడు. 'మా అయ్య చెప్పులు కుడతాడు సారు' అని చెప్పా. వెంటనే ఆ సారు తన ప్యారగాన్ చెప్పులు ఇచ్చి పది పైసలు నా చేతిలో పెట్టి 'ఈ చెప్పు మీ అయ్యతో కుట్టించుకురా' అని పంపాడు. వెంటనే నేను మా ఇంటికి వెళ్లి మా అయ్య చేతికి ఈ పైసా ఇచ్చి 'సారు చెప్పులు కుట్టమన్నాడు అయ్యా' అని చెప్పాను. వెంటనే చెప్పు కుట్టి పంపించాడు. మా ఇంటికి బడికి చాలా దూరం ఉంటుంది. నడుస్తూ నడుస్తూ వెళ్లి సార్‌కి ఇచ్చాను.
కాలుకు గాయం అయ్యేది
రెండో తరగతిలో ఉన్నప్పుడు నన్ను గొడ్ల దగ్గరకు పంపించారు మా వాళ్లు. గొడ్లను కాస్తూ వెళ్లేటప్పుడు కాళ్లకు చెప్పులు ఉండేటివి కావు. ముళ్ళు గుచ్చుకొని కాలుకు గాయం అయ్యేది. అట్లనే గొడ్లను కాసేదాన్ని. తర్వాత చలక కాడికి పంపించేవారు. ఆ చలక మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. నడుస్తూ వెళ్లేదాన్ని. పజ్జోన్న సేలో పిట్టకాపుకు పోయేదాన్ని. టిఫిన్‌లో జొన్న గట్క వేసుకొని పోయేదాన్ని. పాల జొన్నలు, కంకులు కొట్టుకొని తినేదాన్ని. మా అక్క కంది కాయే లొట్టిలో ఉడకబెట్టి ఇచ్చేది. ఆకలితో అవి తినేవాళ్ళము. మా అక్క పిల్లల్ని ఎత్తుకునే దాన్ని. పని లేనప్పుడు మాత్రమే నన్ను బడికి పంపించేవారు. నేను బడికి వెళ్లేసరికి సార్లు నా పేరు తీసేవారు.
ఏడేండ్లపుడు నాగలి దున్నా
ఏడేండ్ల వయసులో పెసలు విత్తనాలు వేయటానికి మా అవ్వ నన్ను మా చలక పనికి పంపించేది. విత్తనం వేస్తూ వారు అన్నం తినే సమయంలో నేను నాగలి పట్టి అటూ ఇటూ దున్నే దాన్ని. అది మా బావ చూసి 'అలా కాదురా ఇలా దున్నాలని' అని నాగలి నేర్పించాడు. అప్పట్లో ఓ సేటు దగ్గర మా వాళ్ళు అప్పు తీసుకున్నారు. వడ్డీ కింద మూడు రోజులు నాగలి నాటు వేయడానికి రమ్మని ఆ సేటు చెప్పారట. ఆ సమయంలో మా బావకు జ్వరం వచ్చింది. అప్పుడు మూడు రోజులు ఆ సేటుకు నాగలి దున్నటానికి నన్ను పంపించారు. పది నాగండ్లలో చివరి నాగలి నాది. దాన్ని తిప్పలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. సేటు నా నాగలి వంకే చూసేటోడు. సేటు కోపం చేస్తాడేమో అనే భయంతో గడగడలాడుతూ మూడు రోజులు నాగలి దున్నాను. ఇలా ఎన్నో ఇబ్బందు పడ్డాను. ఇప్పుడు నా బాల్యం తలచుకుంటే కన్నీళ్లు పెట్టిస్తుంది.
పెండ్లిలో నిద్రపోయా...
నాకు తొమ్మిదేండ్లు రానేవచ్చాయి. నేను మావయ్య ప్రేమ ఎక్కువ ఎరగను. 'పిల్లకు పెండ్లి వయసు వచ్చింది' అని మా మేనమామతో చెప్పింది అవ్వ. అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను. మా మామయ్య ఒక సంబంధం తెచ్చాడు. మా అవ్వ ఆ సంబంధానికి ఒప్పుకుంది. 'నీకు పెండ్లి చేస్తా అమ్మా' అని నాతో అన్నది. 'నాకు ఏమీ తెలవదు అవ్వ, నీ ఇష్టం' అన్నాను. నేను చదువుకుంటా అని మాత్రం చెప్పాను. అలా నాకు తెలియని వయసులోనే పెండ్లి చేశారు. పెండ్లిలో నిద్రపోయాను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియని వయసు. బండిలో కూర్చో పెట్టుకొని నన్ను తీసుకెళ్లారు. మా అత్తగారింట్లో మామయ్య లేడు. నాకు ఒక మరిది. నాకు ఇంట్లో పని, వంట పని ఏమీ రాదు. వాకిలి ఊడవడం కూడా రాదు. అంతా మా అత్తగారే నేర్పించారు. పెండ్లయిన రెండేండ్లకు పెద్దమనిషినయ్యాను. నాట్లేసి, కోతలు కోసి, కలుపులు తీసి, ఎండకెండి, వానకు తడిచాను. బాల్యంలో బహు బాధలు పడ్డాను. తల్లి కోసం తల్లడిల్లేదాన్ని, ఇంకా రావట్లేదని. నా తల్లి కోసం ఓసారి బావిలో పడ్డాను. చనిపోతా అని తెలియదు నాకు. బావిలో పడితే మా అవ్వ వస్తది కదా అనే ఆలోచనలతోనే 9 ఖండాలలోతు ఉండే బాయిలో నీళ్లు చేది అందులో పడ్డాను.
దూర విద్య ద్వారా చదువు
డీలర్ షిప్ కోసం అని మా ఆయన ఏడో తరగతి పరీక్షలు రాయనిచ్చాడు. ఏసంగి నాట్లు వేస్తూ, కలుపులు తీస్తూ ఏడో తరగతి పాసయ్యాను. తర్వాత పదవ తరగతి పరీక్ష ఓపెన్‌లో పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్, ఓపెన్ డిగ్రీ కూడా పాసయ్యాను. చివరకు డిగ్రీ పట్టా పొందాను. అంగన్వాడీ టీచర్‌గా విజయవాడలో మూడు నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళాను. అప్పుడు నాకు ఏడాది బాబు, పాలు తాగుతున్నాడు. బాబును వదిలి ట్రైనింగ్‌కి పోయాను. ట్రైనింగ్‌లో బాబు గుర్తొచ్చి బాగా ఏడ్చేదాన్ని. పాలు గడ్డగట్టి బాగా జ్వరం వచ్చింది. నా బాధ చూడలేక ఇన్చార్జ్ మేడమ్ మూడు రోజులు ఇంటికి పంపించారు. బాబును చూసుకొని మళ్లీ ట్రైనింగ్‌కు వచ్చాను.
కొడుకు కోసం మొదటి పాట
మా ట్రైనింగ్‌లో ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో ''జోల జోలమ్మ జోల... ఊరుకో అబ్బాయి... నా చిన్ని పాపాయి... ఊరిలో మీ అమ్మ ట్రైనింగ్‌కు పోయింది'' అంటూ నా కొడుకు గురించి ఓ పాట రాసి పాడుకున్నాను. పాట రాయడం అదే మొదటి సారి. మేడం వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. పాట పాడటం, రాయడం అంటే ఇలాగేనా అనేది నా మెదడులో బాగా నాటుకుపోయింది. ఆరోజు నుండే నా పాటకు విత్తనమేశాను. విజయవాడ ట్రైనింగ్‌లోనే నా పాటలు కూడా మొలకెత్తాయి. అప్పుడు ఆ మేడం మీదనే ఓ పాట రాశాను. చాలా మెచ్చుకున్నారు. అప్పటి నుండి సమాజ మలుపు కోసం పాటలు రాయటం, పాడటం మొదలుపెట్టాను. పాట ద్వారా అత్యాచారాలు, దురహంకారులను ప్రశ్నించడం మొదలుపెట్టాను. పాటలు రాయడం, పాడటం అంటే నాకెంతో ఇష్టంగా మారిపోయింది. ఇప్పుడు నాకు ప్రాణం పాటంటే.
దళిత మహిళనని..
అత్తగారింట్లో ఒడ్లు దంచుడు, కారం కొట్టుడు, జొన్నలు తొక్కుడు, ఘటక ఇసిరి పోయటం ఈ పనులన్నీ చేసి మళ్లీ అడవి పనికి పోయేదాన్ని. చేతులు వాసి గంటెతో బువ్వతినే దాన్ని. పుట్టింటికి పోయినపుడు తిరిగి మా అత్తగారింటికి రావాలంటే మా అవ్వతో ప్రమాణం చేయించుకునే దాన్ని. నువ్వు ఎనిమిది రోజులకు వస్తావా రావా అని. అవ్వ వచ్చే రోజు బువ్వ తినకుండా ఎదురుచూసే దాన్ని. బాయిలో పడ్డ నన్ను బయటికి తీశారు. బాయిలో నీరంతా రక్తమయ్యింది. అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఆయన కాడికి నన్ను తీసుకెళ్లారు. ఆయన వాకిట్లోనే నిలబెట్టాడు. వాళ్ల అరుగు మీద పడుకోబెట్టాడు. ఈమె దళిత మహిళ అని దూరంగా నిలబడి సూదేశాడు. తర్వాత మా అవ్వ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది.
నా పుస్తకం ఆవిష్కరించారు
ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పుకోవాలి. నా పాటలకు ఇంకా పదును పెట్టింది గాడిపెళ్లి చక్రియ. ఈయన 'మరో పోరాటం' విలేఖరిగా చేసి చనిపోయారు. 'చెట్టుమీద, పుట్ట మీద, దేని మీద పడితే దానిమీద రాయండి అమ్మ' అంటూ నాకు సలహా ఇచ్చారు. ఇంకా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించేటి గాడిపెళ్లి మధుసారు. వారు వరంగల్లులో సీనియర్ జర్నలిస్టు. దళిత కవయిత్రి అని నన్ను ఎంతో ప్రోత్సహించారు. దాశరధి కష్ణమాచార్యులు, రంగాచార్యులుగారి పురిగడ్డ అయిన చిన్న గూడురు నాది. దాశరధి కష్ణమాచార్యులుగారి జయంతి సందర్భంగా నాకు సన్మానం చేశారు. అక్కడే నేను రాసిన 55 పాటలను ఒక బుక్కుగా ముద్రణ చేసి ఆవిష్కరించారు. ఇంకా 75 పాటలతో ఇంకొక బుక్కు ముద్రణకు సిద్ధంగా ఉంది. అది కూడా మధు సారే ముద్రిస్తానని చెప్పారు.