Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతం. కార్మికవర్గ చైతన్యానికి ప్రతీక. శ్రమదోపిడికి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన చరిత్రకు సాక్షం. ఎనిమిది గంటల పనిదినం, కార్మిక హక్కుల కోసం నినదించిన మహౌజ్వల ఘట్టం. 137 ఏండ్ల కిందట కార్మికులు సాగించిన విరోచిత పోరాటాలు ఫలితం గానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయి. అందులో మహిళల పాత్ర కూడా ఎంతో గొప్పది. ఆ స్ఫూర్తితో ప్రపంచ దేశాలతో కార్మికవర్గం సంఘటితమైతే తమ హక్కులు సాధించుకోవచ్చనే నమ్మకంతో ముందుకు కదిలారు. అనేక చట్టాలు రూపొందించు కోగలిగారు. ఆ వివరాలు నేడు మేడే సందర్భంగా మానవిలో...
భారతదేశంలో 1923లో ఆనాటి మద్రాసు నగరంలోని మెరినా బీచ్‌లో కా|| సింగావేలు జెండాను ఎగురవేసి మేడేకు నాంది పలికారు. ఈ సుదీర్ఘ కాలంలో కార్మికవర్గంలో భాగంగా మహిళలకు కూడా అనేక చట్టాలు చేయబడ్డాయి. 8 గంటల పని, సమాన వేతన చట్టం, ప్రసూతి సెలవుల చట్టం, పసిపిల్లల తల్లులకు క్రెచ్ సౌకర్యం మొదలైన చట్టబద్ధ హక్కులు కల్పించబడ్డాయి. వీటి అమలు నామమాత్రంగా ఉన్నప్పటికీ మహిళా కార్మికులకు కొంత స్థైర్యాన్ని ఇచ్చింది.
కార్మికులుగా గుర్తించడం లేదు
గతంలో మహిళలు టీచర్లు, నర్సులు, డాక్టర్లు, ఇంటిపని వారు, భవన నిర్మాణ కార్మికులు లేదా ఇన్సూరెన్స్, బ్యాంక్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో మాత్రమే ఉండేవారు. అయితే వీరిలో కూడా చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు అమలయ్యే సంఘటిత రంగంలో కేవలం 6శాతం మాత్రమే ఉన్నారు. మిగిలిన 95శాతం మందికి ఎటువంటి చట్టాలు వర్తించడం లేదు. నూతన ఆర్థిక విధానాలు అమలు జోరందుకున్న నేపథ్యం లో మన దేశానికి ఉత్పత్తి రంగం ప్రాముఖ్యత తగ్గి సేవారంగం విస్తరించింది. దాని వల్ల అనేక కొత్త రంగాలు, కొత్త తరహా కార్మికులు పుట్టుకొచ్చారు. మరీ విచారకరమైన, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గతంలో భవన నిర్మాణ, మున్సిపల్ వంటి అసంఘటిత రంగాలలో పని చేసే వారు కూడా కార్మికులుగా గుర్తింపబడ్డారు. వారికంటూ కొన్ని ప్రత్యేక విధానాలు చేయబడ్డాయి. కానీ నేడు స్కీం వర్కర్లు, జొమాటో, స్విగ్గీ, అర్బన్ క్లాస్ వంటి అన్లైన్ బేస్డ్ సర్వీసుల్లో పని చేసే కార్మికుల (గిగ్ వర్కర్లు)ను ప్రభుత్వం కనీసం కార్మికులుగా గుర్తించడానికి కూడా సుముఖంగా లేదు.
పెనం మాద నుండి పొయ్యిలోకి
కరోనా అనంతరం ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గ పరిస్థితి మారిపోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 'వర్క్ ఫ్రం హౌమ్'. దీన్ని ప్రవేశ పెట్టిన తర్వాత అనేక రంగాలలో 8 గంటల పని విధానం అటకెక్కింది. ముఖ్యంగా అమెజాన్, డెలాయిట్, గూగుల్, మైక్రోసాప్ట్ వంటి చిన్నా, పెద్దా సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేవారిలో మహిళలు గణనీయంగా ఉన్నారు. వర్క్ ఫ్రం హౌం మొదట్లో కొంత వెసులుబాటుగా అనిపించినప్పటికీ క్రమంగా పనిభారం పెరగటాన్ని ప్రత్యక్షంగా చూశాం. అనేక సర్వేలు కూడా వెల్లడించాయి. దీని వల్ల తీవ్ర శారీరక, మానసిక అనారోగ్యాలకు కూడా గుర య్యారు. పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డ చందంగా గత ఏడాది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగుల తొలగింపు ఊపందు కుంది. దీనిలో కూడా మహిళలు టార్గెట్ చేయబడ్డారు. అలాగే కరోనా కాలంలో వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందులో కూడా మహిళల శాతం గణనీయంగా వుంది. అన్ని రంగాలలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య చూస్తే ఇందులో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు.
కట్టు బానిసత్వం...
ఏ 8 గంటల పని కోసం జరిగిన పోరాటాల ఫలితంగా 'మేడే' ఆవిర్భవించిందో ఆ మౌలిక హక్కు నేడు కాలరాయ బడుతుంది. ఆర్టీసీ, బ్యాంకులు వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పని చేసే మహిళలతో పాటు వైద్య, ఆరోగ్య రంగాల్లో పని చేస్తున్న నర్సులు, పారామెడికల్ సిబ్బంది, హౌస్‌కీపింగ్ కార్మికులు, విద్యా రంగంలో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ వీరందరూ ఈ సమస్యలను ఎదుర్కొంటు న్నారు. మన రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా, గిరిజన, మోడల్ సంక్షేమ స్కూళ్ళు, హాస్టళ్ళలో లక్షలాది మంది మహిళలు పని చేస్తున్నారు. వారు 24 గంటలు విధులు నిర్వర్తించాలి. కనీస వేతనం లేదు. ఉద్యోగ భద్రత, సెలవులు ఏమీ లేవు. కట్టు బానిస బతుకులకు గురవుతున్నారు. వీరి పని పరిస్థితుల వల్ల లైంగిక వేధింపులతో పాటు కుటుంబం నుండి కూడా సమస్యలు ఎదుర్కొవలసి వస్తోంది. వీరికి కనీసం ప్రసూతి సెలవులు కూడా వర్తించవు.
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలు
నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలపై వివక్ష తీవ్రస్థాయిలో ఉంది. ఈ రంగంకి పురుషుల కన్నా మహిళలకు సుమారు 30 నుండి 40 శాతం తక్కువగా వేతనాలు ఇస్తున్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య కేవలం 12 శాతానికి పరిమితమైంది. నిర్మాణ, రియలెస్టేట్ రంగంలో దేశ వ్యాప్తంగా 5.7 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా, ఇందులో పురు షులు 5 కోట్లకు పైగా ఉన్నారు. మహిళలు కేవలం 70 లక్షల మంది మాత్రమే. అత్యధిక మంది మహిళా కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా అసంఘటిత రంగంలో ఉన్నారు. వేతన వ్యత్యాసంతో పాటు లైంగిక అసమానతలు, వివక్ష పెద్ద ఎత్తున ఉన్నాయి. నిర్మాణ రంగంలో ఉపాధి పొందిన మహిళల్లో 84 శాతం మంది దినసరి కూలీలు.
సేల్స్ గర్ల్స్ సమస్యలు
దేశంలో కోట్లాది మంది మహిళలు సేల్స్ గర్ల్స్‌గా, షాప్ ఎంప్లాయిస్‌గా పని చేస్తున్నారు. మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంటారు. వీరి జీవితాలు, జీతాలు అత్యంత దుర్భరంగా ఉంటాయి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పని చేయాలి. దీనికి తోడు పని ప్రదేశానికి వచ్చేటపుడు, వెళ్ళేటపుడు, బస్సుల్లో, రైళ్ళలో నించుని గంటల కొద్దీ ప్రయాణం చెయ్యాలి. ఫలితంగా వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. అరికాళ్ళు, మోకాళ్ళు, నడుం నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. రుతుస్రావ సమయంలో అయితే మరింత కష్టం. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మాత్రమే కూర్చునే అవకాశం దొరుకుతుంది. మిగిలిన సమయమంతా నిల్చొనే ఉండాలి. అయితే ఈ పద్ధతికి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు స్వస్తి పలికాయి. కేరళలో 2018లో 'రైట్ టు సిట్' అనే నినాదంతో కూర్చొనే హక్కు కోసం కొంత మంది సేల్స్ గర్ల్స్ నిరసన వ్యక్తం చేశారు. వీరి న్యాయమైన డిమాండును అర్థం చేసుకున్న కేరళ ప్రభుత్వం 2019 జనవరిలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లోని ఉద్యోగులందరూ కూర్చునే ఏర్పాటు తప్పనిసరి చేస్తూ 'కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్'ను సవరించింది. 2022 సెప్టెంబర్ 13న తమిళనాడు కూడా ఇదే నిర్ణయం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
స్కీం వర్కర్లు...
అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఎన్హెచ్ఎం, గ్రామీణ ఉపాధి హామీ, ఐకేపీ, వీఓఏలు, సర్వశిక్షా అభియాన్ తదితర 72 స్కీంలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో దేశంలో కోటి మంది, మన రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు గత 40 ఏండ్లకు పైగా పని చేస్తున్నారు. వీరికి 90శాతం మంది మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రజలకి చేరవేయటానికి స్కీం వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా సమయానికి ప్రజలకు సేవలందించి, కరోనాను కట్టడి చేయటంలో స్కీం వర్కర్లు ముఖ్య పాత్ర పోషించారు. అయినా వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. పని భారం, చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్నారు. ఆశా, మధ్యాహ్నభోజనం తదితర స్కీం వర్కర్లకు నేటికీ ప్రసూతి సెలవులు కూడా లేవంటే వీరి పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం కోసం చేసిన అనేక పోరాటాల ఫలితంగా 2013 మేనెలకి 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనాం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానించింది. ఈ నిర్ణయం జరిగి ఎనిమిదేండ్లు దాటినా కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు.
హక్కుల పరిరక్షణకు కదలాలి
ప్రసూతి సెలవు చట్టం ఉన్నప్పటికీ 10శాతం మందికి కూడా అమలు కావడం లేదు. కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కలిసి అనేక ఏండ్లు ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగా పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం చేయబడింది. కానీ దాని అమలు కూడా నామ మాత్రమే. గత కొద్ది రోజులుగా ఢిల్లీ నగర వీధుల్లో మహిళా రెజ్లర్లు చేస్తున్న పోరాటం దీనికి ప్రత్యక్ష ఉదా హారణ. అందుకే నేడు జరుగుతున్న మేడేకి మన దేశం లో అత్యంత ప్రాధాన్యం వుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేడే ఉత్సవాల్లో మహిళా కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణకు కదలాలి. రాజ్యాంగం కల్పించిన గౌరవ ప్రదమైన పని పరిస్థితులు సాధించుకునే దిశగా ఉద్యమించాలి.
- పద్మశ్రీ
మహిళా కార్మికులపై ప్రభావం
దేశం నూరు వసంతాల మేడే జరుపుకుంటున్న వేళ కార్మిక వర్గంపై కార్పొరేట్లు, మతోన్మాదులు ప్రభుత్వ అండదండలతో దాడులు జరుపుతున్నారు. పోరాటాల ఫలితంగా సాధించు కున్న హక్కులను కాలరాసి, కార్మికవర్గాన్ని తిరిగి బానిసలుగా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ హక్కులతో పాటు చారిత్రాత్మకమైన 8 గంటల పని విధానాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. ఈ దాడుల ఫలితం మొత్తం కార్మికవర్గంపై ప్రభావం చూపుతున్నప్పటికీ, మహిళా కార్మికులపై మరింత ఎక్కువగా ఉంటుంది.
కనీస వేతనం అమలు చేయాలి
మేడే ఎన్నో ఏండ్ల నుండి జరుపుకుంటున్నాం. కానీ ఎక్కడి సమస్యలు ఎక్కడే ఉన్నాయి. 2018 అక్టోబర్‌లో మా జీతం 1500 పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. కనీస వేతనం 18 నుండి 26 వేలన్నా ఉండాలని మా డిమాండ్. ప్రస్తుతం మాకు 13650, హెల్పర్‌కి 7800 రూపాయలు వస్తున్నాయి. ఇంత తక్కువ వేతనంతో ఎలా బతకాలి? టీఏ, డీఏలు లేవు. వచ్చిన జీతంలో సంగం వాటికే సరిపోతాయి. కార్మికులుగా మాకు గుర్తింపే లేదు. అద్దెలు రాక మూడు నెలలు అవుతుంది. అవి కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. కనీస వేతనం అమలు చేసే వరకు పోరాడతాం.
- అంగన్వాడీ టీచర్
చాంద్రాయణగుట్ట