Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఎంతో కష్టపడి, తమలోని సృజనాత్మకతను జోడించి వర్ణమయశోభితంగా బతుకమ్మను పేర్చుతారు. ఎన్నో ఆశలకు ప్రతిరూపంగా తయారుచేసే బతుకమ్మ వారివారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తారు. ఆడుతూ.. పాడుతూ.. తమ కష్టాలను చెప్పుకుంటారు. తమ కోరికలను విన్నవించుకుంటారు. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. నలుగురితో కలిసి ఆనందాన్ని పంచుకుని, ఔషధగుణాల పూల వాడకంతో ఆరోగ్యాన్ని పొందుతారు. బతుకమ్మలో వాడే అన్నీ పూలలో, పత్రాలలో మెండుగా ఉండే ఔషధగుణాలు నిండైన జీవితానికి కావల్సిన శక్తిని ఇస్తాయి. ప్రతి ఏటా బతుకమ్మ ఆటపాటతో సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి పొందే మహిళలు పునర్శక్తివంతులుగా మారుతారు.
ఈ సంబురాలలో ఎన్నో పూలను తిరిగి గుర్తుకు తెచ్చుకుంటారు. పూలమొక్కల స్పర్శతో, పూల పరిమళాలతో గుత్తులు, గుత్తులుగా పూస్తూ.. ఇంటికే అందాన్ని తీసుకువచ్చే నూరువరాల పూలు మహిళల పాలిట వరమే అని చెప్పవచ్చు. ఈ నూరువరాల పూలను రామబాణం పూలుగా కూడా పిలుస్తారు. ఎరుపు, తెలుపు, పసుపు రంగులల్లో ఉంటాయి. యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగించే ఈ మొక్కలు మహిళల్లో కనిపించే గర్భాశయ సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. నూరు వరాల కాషాయం వైట్ డిశ్చార్జ్‌కి అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. ఈ మొక్క పత్రాలు, వేర్లు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.