Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం తప్పడం లేదు. వాటిని రీ యూజ్ చేయడం ద్వారానైనా కొద్దిగా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్‌తో ఎన్నో రకాల వస్తువులను చేయడం చూశాం. ప్లాస్టిక్ స్పూన్లను రీయూజ్ విధానం ద్వారా రకరకాల ఇంటి అలంకరణ వస్తువులను తేలికగా చేయవచ్చు. గత మూడు వారాలుగా ప్లాస్టిక్ స్పూన్లతో ల్యాంప్, నెమలి, రకరకాల పూలు వంటి వివిధ వస్తువులను చేయడం తెలుసుకున్నాం. టేబుల్‌పై అలరకరించేలా.. గోడకు తగిలించేలా ఈ వారం ప్లాస్టిక్ స్పూన్లతో కొన్ని వస్తువులను ఎలా తయారుచేయాలో చూద్దాం.
ప్లాస్టిక్ స్పూన్లు, రంగులు, కత్తెర, అట్టలు, ఫెవికాల్ తదితర వస్తువులను ముందుగా రెడీ చేసుకోవాలి.
వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా గట్టి అట్టను నక్షత్రాకారంలో కట్ చేసుకోవాలి. మధ్యలో స్పూన్లను రౌండ్‌గా అతికించాలి. ఆ తర్వాత నక్షత్రాకారంలో కట్ చేసిన అట్టపై స్పూన్లను అతికించాలి. రంగురంగుల స్పూన్లను తీసుకుంటే మరింత అందంగా ఈ వాల్ హ్యాంగింగ్ ఉంటుంది. స్పూన్లు అతికించిన తర్వాత కూడా వాటికి రంగులు వేసుకోవచ్చు. గోల్డ్‌కలర్ గ్లిటర్ను ఉపయోగిస్తే.. మరింత అందంగా మారిన ఈ వాల్ హ్యాంగింగ్ నక్షత్రాలు గోడపై అమరినట్లుగా మారుతుంది. కోన్ ఆకారంలో అతికించిన అట్టలకు స్పూన్లను ఏటవాలుగా అతికిస్తే.. క్రిస్మస్ ట్రీ రెడీ అవుతుంది. మీ సృజనాత్మకతను జోడించి ఎన్నో అందమైన అలంకరణ వస్తువులను తయారు చేయవచ్చు.