Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లోనో.. వీధిలోనూ.. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట బాలికలు, యువతులు దుండగుల చేతిలో హతం అవుతున్నారు. తమ మాట వినలేదని కొందరూ.. ఎదిరించి మాట్లాడటం సహించలేక మరికొందరు దాడులకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలోనో.. తాగిన మైకంలోనో పీక నులిమి చంపేస్తున్నారు. ఊహించని విధంగా జరిగే ఈ దాడుల కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో దుండగుల దాడులను తిప్పికొట్టే టెక్నిక్స్ తెలిస్తే సులభంగా వారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రాణాలతో బయటపడవచ్చు. ఈ వారం మరో కొత్త టెక్నిక్ ద్వారా గొంతు నులిమే ప్రయత్నం చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసుకుందాం !
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై దాడిచేస్తున్నాడు ఒక వ్యక్తి. ఎదురుగా వచ్చి దారికి అడ్డంగా నిలిబడ్డాడు. ఏంటనీ ప్రశ్నించిన ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ.. తన చేతిని ముందుకు చాచి ఆమె పీకపట్టుకునే ప్రయత్నం చేశాడు.
తనను అడ్డగించడంతో పాటు పీక పట్టుకున్న ఆ వ్యక్తిని చూసి ఆమె షాక్ అయ్యింది. గట్టిగా అరవడానికి కూడా గొంతు రావడం లేదు. వాడి చేతి నుంచి తాను బయటపడాలన్న ఆలోచన కొత్తశక్తిని ఇచ్చింది. ఏ మాత్రం భయపడకుండా తన రెండు చేతులతో వాడి చేతిని గట్టిగా పట్టుకుంది.
దుండగుడికి మరో అవకాశం ఇవ్వకుండా వెంటనే వాడి చేతిని తన రెండుచేతులతో మెలితిప్పాలి. ఊహించని ఈ ప్రతిఘటనతో వాడు భయపడతాడు. బలమంతా ప్రయోగించి చేయిని మెలి తిప్పడంతో భరించలేని నొప్పితో తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు. ముందుకు బెండ్ అవుతాడు.
ఇదే అదనుగా తీసుకోని ముందుకు వంగిన వాడి ముఖంపై మీ కాలితో ఒక కిక్ ఇవ్వాలి. ముక్కు పగిలి రక్తం కారేలా బలంగా తన్నాలి.
అమ్మాయిల జోలికి వస్తే ముఖం పగులుతుంది అన్న భయం కలగాలి. మరోసారి ఏ అమ్మాయిని ఏడిపించే ప్రయత్నం చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి.
- ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నెేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170, 9949039049
- రమేశ్