Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరిగే కొద్ది పిల్లల్లో రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తాయి. టీనేజ్‌కు వచ్చే సరికి వారి ప్రశ్నల జాబితా పెరిగిపోతోంది. అయితే తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది సరైనది కాదు. పిల్లల ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెప్పాలి. మరి పెరిగే వయసులో పిల్లలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి సమాధానాలు ఎలా చెప్పాలో చూద్దాం...
ఎందుకు మీ ఇద్దరూ ఎప్పుడూ కొట్లాడుకుంటారు?
తలిదండ్రులు పోట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు ఒకరకమైన భావోద్వేగానికి లోనవుతారు. ఆ సమయంలో 'ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చనప్పుడు వాదోపవాదనలు జరుగుతాయి. కానీ అంతమాత్రం చేత మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని కాదు, పొరపాటు చేసినప్పుడు నిన్ను కోప్పడితే తిరిగి నీకు కూడా మాపై కోపం వస్తుంది. అలా అని నువ్వు మమ్మల్ని ప్రేమించడంలేదని అర్ధం కాదు కదా. అలాగే నాన్న, నేను కూడా కొన్ని సందర్భాల్లో కోప్పడతాం, తర్వాత మళ్ళీ ప్రేమగా ఉంటాం' అని చెప్పండి. అయితే ఈ విషయాలను పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి.
ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారు?
ఉద్యోగం ఎంత ముఖ్యం అనే విషయాన్ని పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి. 'నాకు నిన్ను వదిలి వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేదు. కానీ వెళ్లక తప్పదు. నేను చేసే పని చాలా ముఖ్యమైనది. సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత నీకు నచ్చినట్లు సమయాన్ని గడుపుదాం' అని చెప్పండి.
చాలా భయంగా ఉంది:
పిల్లల భయాలను అశ్రద్ధ చేయకండి. వాళ్ళు ఎందుచేత భయపడుతున్నారు అనే విషయాన్ని కనుకున్నే ప్రయత్నం చేయండి. చీకట్లో కనపడే నీడ వల్లనా, ఏదైనా తెలియని శబ్దం వల్లనా? అసలు కారణం ఏమిటి అనే విషయాన్ని ప్రశ్నలు వేసి రాబట్టండి. అసలు కారణం గుర్తించి వారిలో భయం పోగొట్టడానికి ప్రయత్నించండి.
నాకు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని లేదు:
మీ పిల్లలకు మందులు వేసుకోవడం వల్ల జరిగే లాభాలను వివరించండి. అందుకు కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉంది అని వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పండి. 'డాక్టర్ నీ శరీరానికి హాని చేసే సూక్ష్మ జీవులను బయటకు పంపించేస్తారు. అందుకోసం నీకు ఇచ్చే ఇంజక్షన్ కాస్త నొప్పిని కలిగిస్తుంది. కానీ ఆ ఇంజక్షన్ నిన్ను మరింత శక్తివంతుడిగా చేస్తుంది. అందుకు నువ్వు చాలా ఆనందపడతావు. వైద్యులను చూసి నువ్వు అస్సలు భయపడకూడదు' అని చెప్పాలి.
ఆ పిల్లలకు ఎందుకు అక్కడ విభిన్నంగా ఉంది:
పెరుగుతున్న పిల్లల్లో జననేంద్రియాల గురించి తెలుసుకోవాలనే ఆతురత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు పట్టించుకోకపోవడం వల్ల వారిలో ఆతురత మరింత పెరిగిపోతుంది. వారి మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానం కనుక్కోడానికి వేరే దారులను వెతుక్కుంటారు. కాబట్టి అటువంటి ప్రశ్నలు మీ పిల్లలు అడిగినప్పుడు నిర్లక్ష్యం చేయకండి. అబ్బాయిలు, అమ్మాయిలు వేరు వేరుగా నిర్మించబడ్డారని అందుచేతనే అలా ఉంటారని చెప్పండి. అందులో భాగంగా ఆ జననాంగాల పేర్లు కూడా చెప్పండి. ఇలా చెప్పడంలో ఎటువంటి తప్పులేదని చిన్న పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఆ వ్యక్తి ఎందుకు అలా ఉన్నాడు?
బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీ పిల్లలు అనూహ్యంగా ఎవరినైనా విభిన్నంగా ఉన్న వ్యక్తులను చూపించి ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అనే వింత ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది ఎక్కువగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. 'ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారని, ఎవరికి వారు విభిన్నమని, వ్యక్తుల పరిమాణం, ఆకారం, చర్మపు రంగు ఇలా ప్రతీది వేరువేరుగా ఉండటం సాధారణం, అన్నీ అందరికీ ఒకే రకంగా ఉండవు' అని తెలియజెప్పండి. 'వేరే వాళ్ళని వేలెత్తి చూపిస్తే బాధపడతారు, వాళ్ల భావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇతరులను ఎప్పుడూ వేలెత్తి చూపించకు, వారు లేని సమయంలో వాళ్ల గురించి నన్ను అడుగు చెబుతాను. అందువల్ల వాళ్ళు కూడా నొచ్చుకోరు' అని చెప్పండి.
నాకంటే ఎక్కువగా వాళ్ళనే ప్రేమిస్తావా?
మాములుగా ఇంట్లో ఉండే తోబుట్టువులు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి గొడవపడుతుంటారు. కాబట్టి, ఇద్దరిమధ్య ఎప్పుడూ పోలికలు తీసుకురాకండి. ఎందుకంటే అలా చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు. ఇద్దరూ సమానమే అని వాళ్లకు తెలియజేసి, అలానే వ్యవహరించండి. 'కొన్ని సార్లు ప్రేమని వ్యక్తపరిచే విధానం విభిన్న రకాలుగా ఉండొచ్చు. అంతమాత్రం చేత ప్రేమ తగ్గిపోయిందని అర్ధం కాదు. ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తాను, చూసుకుంటాను, ఇష్టపడతాను' అని చెప్పండి.