Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడడం, వారి భావాలను పంచుకోవడం, వారి మనుసులో ఏముందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధాన్ని ధృడపరిచడానికి సహాయపడుతుంది. అలాగే పిల్లలు ఏమైనా పొరపాటు చేసినప్పుడు వారిని సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు... పిల్లలతో మాట్లాడేటప్పుడు మీ నోటి నుండి వచ్చే ప్రతీ అక్షరం, ప్రతీ మాటా వారు స్కానర్లా గమనిస్తున్నారని మర్చిపోవద్దు. అలాగే మీ ప్రవర్తన కూడా ముఖ్యమే. పిల్లలతో మీ సంభాషణ ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలిసింది కదా, మీరు వారితో మాట్లాడేటప్పుడు చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం...
అసభ్య పదాలు వద్దు
కొంత మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని కోపగించుకుంటారు. ఆ కోపంలో వారి నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా మర్చిపోతారు. మీరు సభ్యత లేకుండానో, అహంకారంతోనో పిల్లల ముందు మాట్లాడటం మంచిదికాదు. మీరు చెప్పదలచుకున్న విషయం వారికి చేరాలంటే సరైన పదాలతో పొందుపరించి సులభంగా అర్ధమయ్యే విధంగా చెప్పండి. దాంతో వారు సరిగ్గా అర్ధం చేసుకోగలరు.
ఆజ్ఞాపించడం: పిల్లలను సరైన దారిలో పెట్టాలని చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ''మేము చెప్పిందే చాయలి'' అని ఆజ్ఞాపిస్తుంటారు. వారు చేసే పని మీకు నచ్చక ఆ పనిని ఆపాలనుకున్నా ఆజ్ఞాపించడం అనేది మంచిది కాదు. అలా చెయ్యకండి. మీ మాటలని మనసుకి హత్తుకునేటట్లు పొందు పరచడం ద్వారా కావాల్సిన ఫలితాలని రాబట్టుకోవచ్చు. మీరు ప్రవర్తించే తీరును బట్టి పిల్లలు మీరు చెప్పినట్టు చక్కగా నడుచుకుంటారు. అలాగే పిల్లలని హెచ్చరించాలంటే వారిని భయపెట్టే విధంగా మాట్లాడకండి. భయపెట్టడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించలేరు. భయపెడితే మీ పిల్లలు భయపడి మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభించవచ్చు.
వెంటనే తీర్పు చెప్పడం: మీ పిల్లలు మీకు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే విభేదించకండి.ఇలా చేస్తే వారు మిమల్ని ఇష్టపడరు. 'మా అమ్మా, నాన్నలకు నేనేం చెప్పినా నచ్చదు' అని బాధపడతారువారు చెప్పేది విన్న వెంటనే మీకు తీర్పు చెప్పాలనిపించినా సరే ఆ ఉత్సాహాన్ని అణచిపెట్టండి.విన్న వెంటనే మీ తీర్పుని కాసేపు వాయిదా వేయడం వల్ల మీ సంభాషణ మరింత బాగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారికి మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ప్రశాతంగా, వారిని బుజ్జగిస్తూ చెప్పండి.
హేళన చెయ్యడం: పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే వారిని గానీ, వారి ముందు ఇతరులనెవరినయినా ఎగతాళి చెయ్యడం మొదలెడితే అది వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసిన వారవుతారు. దానివల్ల పిల్లలు మీతో కూడా సరిగ్గా మాట్లాడలేరు. అందుకే వారు చేసిన పొరపాటు ఏమిటో నిదానంగా అర్థమయ్యే విధంగా వారితో చెప్పండి. ౖ