Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలలు చలి చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తుందంటే అంటే డిసెంబర్ చివరి వారంలో విపరీతమైన మంచుతో పిల్లలతో పాటు పెద్దలు కూడా చలికి గజ గజ వణికిపోతారు. చలి కేవలం బయటే ప్రతాపం చూపిస్తుందనుకుంటే పొరపాటు. ఇంట్లో కూడా శీతల గాలులు ఇబ్బంది పెట్టిస్తాయి. దీని కోసం ప్రత్యేకమైన హీటర్స్ కూడా వాడతారు. ఈ చలిగాలులను నుంచి ఉపశమనం పొందటానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినా బాధ్యత తల్లిదండ్రులదే. చలి నుంచి చిన్నారులను కాపాడుకోవాలంటే కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది.
పిల్లల పట్ల తల్లిదండ్రులు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. శీతకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. చలికి పిల్లలు తట్టుకోలేరు. ఉదయాన్నే లేవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నారులు వారి శరీరంలో వేడి ఉత్పత్తి చేసుకోలేరు. కనీసం చలి వేస్తుందని కూడా చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పిల్లలకు కాలాలతో పని లేదు. ఎటువంటి కాలమైనా వారి ఆట వారిదే, వారి ప్రపంచం వారిదే. అందుకే వారి గదిని ఎప్పుడు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వారు నిద్రపోయినప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు అనువైన వాతావరణాన్ని, వెచ్చదనాన్ని నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
గది చాలా చల్లగా ఉంటే కిటికీలు, తలుపులు ముసుకోవాలి. పొడిగా, వెచ్చగా ఉన్న దుస్తులు వేయడం మంచిది. దుస్తులు, గది తడి లేకుండా చూసుకోవడం కీలకం. వెచ్చగా ఉంటేనే చక్కగా నిద్రపోతారు.
అయితే పడుకునేటప్పుడు చిన్నారులకు ముఖం, మొత్తంగా బ్లాంకెట్స్ కప్పకూడదు. కేవలం ముఖం వరకు తెరిచి ఉంచాలి. శ్వాస తీసుకున్నట్టు కనిపించేలా మెడ వరకు బ్లాంకెట్ కప్పాలి.
ముఖ్యంగా బయటికి పిల్లలను తీసుకెళ్లేటప్పుడు వారి డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. పిల్లల చర్మానికి చలిని తట్టుకునే శక్తి ఉండదు. అందుకే మనం వేసే దుస్తులతోనే వెచ్చదనం వస్తుంది. మరీ ఎక్కువ చలిగా ఉంటే హ్యాండ్ గ్లావ్స్, కాళ్లకు షూ, ఫుల్ స్లీవ్స్, ట్రౌజర్స్, అంటే పొడవైన ప్యాంట్స్ వేసుకొని బయటికి తీసుకెళ్లడం మంచిది.