Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్న్భేల్స్...
సాయంత్రం కాగానే వేడి వేడిగా ఉండే కట్లెట్, పానిపూరీ, కార్న్‌భేల్, పకోడీ తినాలనిపిస్తుంది! అయితే ఇన్‌స్టాంట్‌గా బయట దొరికేవి కాకుండా ఇంట్లోనే పోషకవిలువలున్న స్వీట్‌కార్న్‌తో కట్లెట్, భేల్స్ను స్వయంగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్నతో చేసిన రుచులు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు శ్రేయస్కరం. మరెందుకు ఆలస్యం మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ కార్న్భేల్స్ను ఓ సారి టేస్టు చేయండి... !
కట్లెట్...
కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్-ఉడికించినవి ఒక కప్పు, ఆలుగడ్డలు-ఉడికించిన ముక్కలు-ఒక కప్పు, బ్రెడ్-రెండు, జీలకర్ర-ఒక చెంచా, బట్టర్-ఒక చెంచా, ఉప్పు-తగినంత.
తయారీ విధానం: ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్‌ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న మిశ్రమంలోనే ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని దాంట్లో ఒక బ్రెడ్ స్లయిస్‌ను, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి బట్టర్ వేసుకొని కార్న్ కట్లెట్స్ చిన్నగా వేసుకుంటే సరిపోతుంది.
కార్న్‌భేల్...
కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్-ఒక కప్పు, కార్న్‌ప్లేక్స్ (మక్క అటుకులు) -ఒక కప్పు, బొనుగులు (మురమురాలు)-ఒక కప్పు, టమాటా ముక్కలు-ఒక కప్పు, దానిమ్మ గింజలు-ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు-ఒక కప్పు, ఆలుగడ్డ-ఉడికించినది ఒకటి, కొత్తిమీర-తరిగినది కొద్దిగా, పచ్చిమిర్చి-సన్నగా తరిగిన ఐదు, కారం-ఒక చెంచా, ఉప్పు-తగినంత, జీలకర్ర పొడి-చిటికెడు, చాట్ మసాలా-ఒక చెంచా, నిమ్మరసం-ఒక చెంచా, స్వీట్ చట్నీ-కొద్దిగా, గ్రీన్ చట్నీ.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కార్న్‌ప్లేక్స్, బొనుగులు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో టమాటా ముక్కలు, దానిమ్మ గింజలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలుగడ్డ ముక్కలు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చివరగా మరో బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించిన బొనుగులు, కార్న్‌ప్లేక్స్, జీలకర్ర, చాట్ మసాలా, స్వీట్ బూందీ, ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, నిమ్మరసం ఒక చెంచా వేసి బాగా కలిపితే చాలు కార్న్ భేల్ రెడీ!
పాప్‌కార్న్ ఫ్రాన్స్...
కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసిన జంబో ప్రాన్స్(రొయ్యలు)- ఒక కప్పు, నూనె-వేయించుకోవడానికి సరిపడా, పాప్కార్న్పౌడర్-సగం కప్పు, నిమ్మరసం-ఒక చెంచా, ఉప్పు-తగినంత, కారం-ఒక చెంచా, మిరియాల పొడి-ఒక చెంచా, మైదా పిండి-ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్-రెండు చెంచాలు, గుడ్డు-ఒకటి.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో నూనె, ఉప్పు, ఎండు మొక్కజొన్న వేసి ఐదు నిమిషాలు పెట్టాలి. ఇలా ఉడికించిన పాప్‌కార్న్‌ను మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన రొయ్యల్లో కాస్త నిమ్మరసం, కారం, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాత్రలో కొద్దిగా కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి, ఒక గుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. పాప్‌కార్న్ పౌడర్‌ను ఒక ప్లేట్లో వేసుకొని, ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో రొయ్యలను ముంచి ఆ తర్వాత పాప్‌కార్న్ పౌడర్‌లో ముంచి నూనెలో బ్రౌ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది.
మసాలా కార్న్...
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్‌కార్న్-ఒక కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు-రెండు, చాట్ మసాలా-ఒక చెంచా, ఉప్పు-తగినంత, వాము-సగం చెంచా, జీలకర్ర పొడి-ఒక చెంచా, సోంపు పొడి-సగం చెంచా, నిమ్మరసం-ఒక చెంచా, కొత్తిమీర-కొద్దిగా, నూనె-రెండు చెంచాలు.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే దాంట్లో ఉడికించిన స్వీట్ కార్న్, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, సోంపు పొడి, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా, కొత్తిమీర వేసుకుంటే చాలు మసాలా స్వీట్ కార్న్ రెడీ!