Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమంటే ఆనందం... ఆనందమంటే ఆరోగ్యం. ఆరోగ్యమంటే రకరకాల వంటకాలను ఆస్వాదించడం. సాయంత్రం కాగానే రోడ్డు పక్కన చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు చాలా మంది. వాటి వాళ్ల ఆరోగ్యం త్వరగా పాడవుతుంది. కాబట్టి ఇంట్లోనే రుచికరమైన వంటకాలను పరిచయం చేస్తే ఆసక్తిగా అందరూ తినిపెడతారు. అలాంటి టేస్టి స్నాక్స్ మీ కోసం... ఓ సారి ప్రయత్నించి చూడండి!
వెజిటబుల్ మంచూరియా...
కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము-ఒక కప్పు, క్యాబేజ్ తురుము-ఒక కప్పు, క్యాప్సికం ముక్కలు-సగం కప్పు, ఉప్పు-తగినంత, ఉల్లిపాయ ముక్కలు-సగం కప్పు, అల్లం, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు-కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు-సగం కప్పు, కొత్తిమీర-కొద్దిగా, సోయాసాస్-రెండు చుక్కలు, అజీనామోటో-చిటికెడు, మైదా పిండి-ఒక కప్పు, కార్న్ ఫ్లోర్-రెండు చెంచాలు, నూనె-సరిపడా, అల్లం, వెల్లుల్లి ముక్కలు-కొద్దిగా, టమాటా సాస్.
తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు అజీనా మోటో, కొద్దిగా ఉప్పు, సోయాసాస్ రెండు చుక్కలు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. అది కాస్త వేడి కాగానే దాంట్లో మంచూరియా ఉండలు వేయించుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే దాంట్లో అల్లం, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా సోయాసాస్, టమాటా కెచప్, కొన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం కాస్త చిక్కబడగానే ముందుగా నూనెలో వేయించుకున్న మంచూరియాను వేసుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిముక్కలతో గార్నిష్ చేస్తేచాలు వెజ్ మంచూరియా రెడీ!
బ్రెడ్ పకోడ...
కావాల్సిన పదార్థాలు: సోంపు-ఒక చెంచా, ధనియాలు-ఒక చెంచా, ఎండు మిర్చి-రెండు, ఉప్పు-తగినంత, జీడి పప్పు ముక్కలు-కొద్దిగా, కరివేపాకు రెమ్మలు-రెండు, పుదీనా- ఆకులు, కొత్తిమీర తురుము-కొద్దిగా, శనగ పిండి-ఒక కప్పు, బేకింగ్ సోడా-చిటికెడు, వెన్న-మూడు చెంచాలు, బ్రెడ్ ముక్కలు-నాలుగు.
తయారీ విధానం: బ్రెడ్ పకోడ తయారు చేసేకన్న ముందు ఒక మసాలా పొడిని తయారు చేసుకోవాలి. దానికి కొద్దిగా సోంపు, ధనియాలు, ఎండు మిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మసాలా పొడిలో జీడిపప్పు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తురుము వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో శనగ పిండి, కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా చిటికెడు, వెన్న, నీళ్లు పోసుకొని చిక్కగా పిండి కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్స్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. చివరగా బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత శనగ పిండిలో ముంచాలి. చివరగా మసాలా పొడిని బ్రెడ్‌కు అద్ది పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే దాంట్లో బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకుంటే చాలు బ్రెడ్ పకోడ రెడీ!
పెరుగు సగ్గు బియ్యం వడలు...
కావాల్సిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన సగ్గు బియ్యం-ఒక కప్పు, క్యారెట్ తురుము-కొద్దిగా, సన్నగా తరిగిన కరివేపాకు-కొద్దిగా, వెల్లుల్లి-కొద్దిగా, ఉప్పు-తగినంత, కొత్తిమీర-తురుము, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి-మూడు, కారం-ఒక చెంచా, ఉల్లిపాయ-ఒకటి, అల్లం ముక్కలు-కొద్దిగా, బియ్యం పిండి-కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: పెరుగులో ఎనిమిది గంటలు నానబెట్టిన సగ్గు బియ్యంలో క్యారెట్ తురుము, కరివేపాకు తురుము, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, బియ్యం పిండి వేసి మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే దాంట్లో ముందుగా తయారు చేసుకున్న పిండిని వడలు వేసుకుంటే సరిపోతుంది. సగ్గు బియ్యం వడలకు అంచుకు చట్నీ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.
ఫ్రైడ్ మిల్క్...
కావాల్సిన పదార్థాలు: పాలు-200 మి.లీ, కార్న్ స్టార్చ్-35 గ్రా||, చక్కెర-40 గ్రా||, బటర్-ఒక కప్పు, జాజికాయ పొడి-చిటికెడు, నిమ్మరసం-చిటికెడు, నూనె- వేయించుకోవడానికి సరిపడా, గుడ్డు-ఒకటి, బ్రెడ్ పౌడర్- కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దాంట్లో పాలు, కార్న్ స్టార్చ్, చక్కెర, బటర్, జాజికాయ పొడి వేసి పాలను చిక్కగా మరిగించుకోవాలి. కాస్త చల్లారాక దాంట్లో నిమ్మరసం కలుపుకొని మరో పాత్రలోకి మార్చుకోవాలి. పాల మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో గుడ్డును బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న గుడ్డు మిశ్రమంలో చిన్నగా కట్ చేసుకున్న ముక్కలను ముంచి బ్రెడ్ పొడిని చల్లుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. చివరగా ఫ్రైడ్ మిల్క్ మీద చక్కర పొడి, యాలకుల పొడితో గార్నిష్ చేసుకుంటే సరి!