Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలామంది ఎవరితో మాట్లాడలన్నా.. ఎవరింటికైనా వెళ్లాలన్నా.. అబ్బాయిలతో మాట్లాడాలన్నా... తెలియని వారితో సంభాషించాలన్నా చాలా భయపడిపోతుంటారు. ఈ భయం సాధారణంగా అందరిలో ఉంటుంది. ఇది మంచిదే కానీ మరీ ఎక్కువైతే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇలా భయానికి లోనైన వారు ఇతరులతో కలవలేక ఎన్నో అవకాశాలను కోల్పోతారు. దాంతో వాళ్ల విజయానికి వాళ్లే అడ్డుకట్ట వేసుకుంటారు. అలాంటి భయాన్ని, బిడియాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం...
75 శాతం మంచిదే!
ఇతరులతో మాట్లాడటానికి ఎక్కువగా భయపడేవారు ముందుగా ఎదుటి వ్యక్తి కండ్లలోకి చూసి మాట్లాడటానికి ప్రయత్నించాలి. పక్కవారితో మాట్లాడుతున్నప్పుడు అటుఇటూ చూస్తూ మాట్లాడటం వల్ల అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ.
మొదట్లో ఇలాంటి ఇబ్బంది ఉంటే నెమ్మదిగా అలవాటు చేసుకుంటే సరిపోతుంది. అలా కొన్నిసార్లు ప్రయత్నించి చూడండి! మీకే చాలా సులభంగా అలవాటు అవుతుంది. తద్వారా భయం క్రమంగా దూరం అవుతుంది.
ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు 75 శాతం కండ్లల్లోకి చూసి మాట్లాడితే మంచిదని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. అలాగే తదేకంగా చూసి మాట్లాడినా ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. క్రమం తప్పకుండా చేస్తే మీలో దాగి ఉన్న భయం, ఆందోళన తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరోసారి పక్కవారితో మాట్లాడేటప్పుడు ఎలాంటి బిడియం, భయం ఉండదు.
కొత్త వ్యక్తులతో మాట్లాడండి !
ఎదుటి వారు మీ గురించి ఏవో అనుకుంటారని ఆలోచించకపోవడం మంచిది. ఎక్కువగా సిగ్గుపడేవారు ఎదుటి వారు తమ గురించి ఏవో అనుకుంటారని మాట్లాడటం మానేస్తారు. వాళ్లకు తమ వాళ్ల ఇబ్బంది కలుగుతుందేమోనని మాట్లాడటం మానేస్తారు. ఇలాంటి వ్యక్తులు ఒక విషయం గమనించాలి. ఎవరి పనుల్లో వారు నిత్యం బిజీగా ఉంటారని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది.
కొత్తవాళ్ల ఇంటికి వెళ్లాలంటే భయమేస్తే ఇలా చేయండి. ముందుగా మీ స్నేహితుల ఇంటికి, బంధువుల ఇంటికి తరచు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. తద్వారా భయం పోతుంది.
రోజులో ఒక కొత్త వ్యక్తితో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తమలో ఉన్న భయం పోవాలంటే కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. అలాగే తరుచు పార్టీలకు, సెమినార్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్తుండాలి. అలా వెళ్లడం వలన అక్కడ నలుగురు కొత్తవారు పరిచయం అవుతారు. భయం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో గడపడానికి ప్రయత్నించాలి. అలాగే బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి.