Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యారెట్‌లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా, సహజ మెరుపుతో ఉంచుతాయి. అందుకే క్యారెట్‌ను సౌందర్య పోషణలో భాగంగా తరచు వాడుతు ఉండాలి. ఇలా చేయడం వల్ల వయసుతో వచ్చే మార్పులు చర్మంపై పడకుండా కాపాడుకోవచ్చు. క్యారెట్‌తో తయారు చేసుకున్న వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం...
క్యారెట్‌ను ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగి మెత్తటి క్లాత్‌తో పొడిగా తుడుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతివంతం అవుతుంది.
ముఖం మీద ముడతలు ఉంటే క్యారెట్ గుజ్జులో తేనెతో పాటు కాస్త బాదం నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే క్యారెట్‌ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి, మెడకు, మోచేతులకు రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత తొలగించుకుంటే మృత కణాలు తొలగి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది.
క్యారెట్ జ్యూసులో కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం తేమను సంతరించుకుంటుంది.