Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లిదండ్రుల ప్రోత్సాహం, నేర్చుకోవాలన్న తపన, సమాజానికి ఏదో చేయాలన్న ఆరాటం సాధారణ మనిషిని సెలబ్రెటీగా చేస్తాయి. ఎంతో మంది తమకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ.. సామాజిక రంగంలో దూసుకుపోతుంటారు. ఈ కోవకి చెందిన వారే హైకోర్టు అడ్వకేటు, ఫ్యామిలీ కౌన్సెలర్ ఆకుల రమ్యకుమారి. ఎల్‌ఎల్‌బిలో నాగార్జున యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్ అందుకున్న ఆమె.. తన వాగ్దాటితో అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలోనూ ఫ్యామిలీకౌన్సెలర్గా ఎన్నో కుటుంబాలు విడిపోకుండా కాపాడుతున్నారు. చెట్టు ఎత్తుగా ఎదగడానికి, పచ్చగా ఉండడానికి వేర్లు ఎంత ముఖ్యమో.. మనిషి సమాజంలో ఉన్నతంగా ఎదగాలంటే కుటుంబం అంతే ముఖ్యమని చెప్పే ఆమె ప్రతి మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలంటూ మానవితో పంచుకున్న ముచ్చట్లు..
ఆడపిల్ల అనగానే బరువైన బాధ్యతగా భావిస్తారు. కానీ, మా అమ్మానాన్న నన్ను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు. పెద్దగా చదువుకున్న కుటుంబం కాకపోయినా... చదువుతో జీవితాలు మారిపోతాయని నమ్మారు. వారిచ్చిన ధైర్యంతోనే నేను ఈ రోజు గుర్తింపు ఉన్న న్యాయవాదిగా నిలబడగలిగాను. గుడివాడ మా సొంతఊరు. నాన్న ఆకుల కోటిలింగేశ్వరరావు, అమ్మ కోటేశ్వరమ్మ. నాన్నకు సిమెంట్ ఏజెన్సీ ఉండేది. రెండు దశాబ్దాల కిందట ఉన్నతచదువులు అంటే డాక్టర్, ఇంజనీరు మాత్రమే అనుకునేవారు. చదువులో ఫస్ట్ అయినప్పటికీ నేను ఆ రెండింటి వైపు వెళ్లలేదు. అందుకు మా ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం కావచ్చు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత లా సెట్ రాశాను. యూనివర్సిటీ స్థాయిలో మంచి ర్యాంక్ వచ్చింది. డిగ్రీ చదువుతున్నప్పుడు 16 బెటాలియన్ తరపున కెడిఎర్ ఉమెన్స్ కాలేజీలో కమాండోగా రెండేండ్లు చేశాను. ర్యాంక్, ఎన్సిసి రెండింటితో నాగార్జున యూనివర్సిటీలో ఫస్ట్ కౌన్సెలింగ్‌లోనే సీటు వచ్చింది. అక్కడ ర్యాగింగ్ చాలా ఉంటుందని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను బాగా ఇబ్బంది పెడతారని సీనియర్స్ మాటల్లో తెలిసింది. ర్యాగింగ్‌కు భయపడి జాయిన్ కావడానికి వెళ్లలేదు. అప్పుడు అమ్మ ''చదువుతో పాటు ధైర్యం కూడా ఉండాలి. నీకు వచ్చిన సీటును ఎందుకు వదులుకుంటావు? ఈ రోజు ర్యాగింగ్‌కు భయపడితే.. రేపు న్యాయవాదిగా ఎలా నిలబడతావు?'' అంటూ ఎంతో ధైర్యం చెప్పారు. అమ్మ నాతోపాటు సెకండ్ కౌన్సెలింగ్‌కు వచ్చారు. అలా అమ్మ కారణంగా నేను యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బిలో చేరాను. సీనియర్స్ ర్యాగింగ్‌కు భయపడలేదు.. మేం లా స్డూడెంట్స్ కావడంతో ఆ తర్వాత సంవత్సరం నుంచి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేసాం. చాలా వరకు ర్యాగింగ్ శృతిమించకుండా చేయగలిగాం. యూనివర్సిటీలో చదివిన మూడేండ్ల కాలంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. స్కూలు, కాలేజీ రోజుల్లో కులం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా... యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి కులం ప్రాధాన్యం పెరిగింది. ర్యాగింగ్ చట్టం వచ్చినా ఎక్కడా పూర్తిగా అమలు జరగడం లేదు.
మానవహక్కుల కమిషన్..
లా పూర్తి కాగానే హైకోర్టులో ప్రాక్టిస్ కోసం వచ్చాను. మోడల్ చిట్‌ఫండ్ కంపెనీలో ప్యానల్ అడ్వకేట్‌గా 12 ఏండ్లు చేశాను. నేషనల్ స్మాల్ కాజ్ ఇండిస్టిస్లో 2,3ఏండ్లు క్రిమినల్ కేసులు చూశాను. 2012లో ఒక కేసు విషయంలో అర్థరాత్రి అరెస్టు చేయడంపై మానవహక్కులను సంప్రదించాల్సి వచ్చింది. జస్టిస్ సుభాషణ్ రెడ్డి చీఫ్ జడ్జిగా ఉన్నారు. మేము 7 గంటలకు వెళ్ళి పిటిషన్ వేస్తే.. వెంటనే పిఎస్‌కు ఫ్యాక్స్ చేశారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. కోర్టును సంప్రదించాలంటే 10 నుంచి 5 గంటల మధ్యనే. కొన్ని పిటిషన్స్ 12గంటలోపే చేయాలి. తలచుకుంటే కొన్ని పనులు త్వరగా పూర్తి అవుతాయి అనిపించింది. అప్పటి నుంచి ఇతర కోర్టుల చుట్టూ తిరగడం మానేసి.. హూమన్రైట్స్ కమిషన్‌కు వెళ్లేదాన్ని. ఆయన చైర్మన్‌గా ఉన్న మూడెండ్లు ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. రెగ్యులర్ అడ్వకేట్ ప్రాక్టీస్ నుంచి సోషల్ అవెర్నెస్ వైపు ఆసక్తి పెరిగింది... నాకున్న న్యాయ పరిజ్ఞానంతో సమాజానికి సేవచేయవచ్చని ఆయనను చూసే తెలుసుకున్నాను. ఆయన స్ఫూర్తితో 'ప్రొటక్షన్ ఫర్ హూమన్రైట్స్' ఎన్జీవో ఏర్పాటుచేశాం. ఇందులో వాలెంటరీగా 500 మందికి పైగా పనిచేస్తున్నారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లో బ్రాంచీలున్నాయి. చైల్డ్‌రైట్స్ వారితో కలిసి దాదాపు 500 కేసులు ఫైల్ చేశాం.
ప్రజా, పర్యావరణ సమస్యలపై ఉచిత సేవ..
దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మీడియా చర్చల్లో పాల్గొన్నడంతో పాటు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మానవహక్కుల పరిరక్షణకోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాం. పర్యావరణ సమస్యలపై, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చొరవ తీసుకుని మానవహక్కుల కమిషన్‌లో కేసులు ఫైల్ చేసేదాన్ని. అంతేకాకుండా సామాజిక, రాజకీయ సమస్యలపై మీడియాలో జరిగే చర్చల్లో న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా విశ్లేషణాత్మక వివరణలు ఇస్తూ.. ప్రజలకు దగ్గరయ్యాను.
కుటుంబ సమస్యలపై..
కుటుంబ సమస్యలు పెరిగిపోతున్న తరుణంలో మీడియా ముందుకు వచ్చి కౌన్సెలింగ్ కార్యక్రమాలను రూపొందించింది. ఈ నేపథ్యంలోనే 'మా' టీవీలో ప్రముఖ సినీనటి సుమలతగారితో 'సంసారం ఒక చదరంగం' కార్యక్రమం రూపకల్పన జరిగింది. ఈ ప్రోగ్రామ్ హెడ్ శారదగారు లా పరమైన విషయాలు చెప్పడానికి నన్ను గెస్ట్‌గా పిలిచారు. అలా దాదాపు 600 ఎపిసోడ్స్ ఈ కార్యక్రమం టెలికాస్ట్ అయ్యింది. ఎన్నో వందల కుటుంబాలు ఈ వేదిక ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నాయి. వాటిలో దాదాపు 98శాతం సక్సెస్‌ఫుల్‌గా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఎనిమిది కేసులు మాత్రమే పోలీస్‌స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి.
ఇతర వృత్తులు వేరు లా వేరు..
చాలామంది అన్యాయాన్ని భరిస్తారు.. కానీ తమకు న్యాయం కావాలని కోర్టులకు వెళ్లాలంటే భయపడతారు. 'వేలాది రూపాయలు కావాలి.. లాయర్ల ఫీజులు ఎక్కువగా ఉన్నాయి' అంటూ కోర్టు దరిదాపులకు రావడానికి కూడా జంకుతారు. అందుకే డబ్బు, పలుకుబడి ఉన్నవారి పక్షానే న్యాయం ఉంటుంది. ఇక న్యాయవాదుల విషయానికి వస్తే.. అన్ని ప్రొఫెషన్లు వేరు.. లా ప్రొఫెషన్ వేరు. మేం ఎంత మంచి పాయింట్స్, ఎవిడెన్స్‌తో కేసు ఫైల్ చేసినా.. కోర్టులో ఉండే కేసుల సంఖ్య మేరకు తీర్పు రావడానికి కొన్ని ఏండ్లు పడుతుంది. ఈ సమయంలో ఆ కేసునే నమ్ముకున్న అడ్వకేటు ఫీజు తీసుకోకపోతే ఎలా గడుస్తుంది? నా వద్దకు వచ్చే చాలా మందికి కౌన్సెలింగ్ ఇస్తాను. డబ్బుల కోసం ఆలోచించకుండా వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తాను. ఇక తప్పదు అంటేనే కేసు ఫైల్ చేస్తాను. కేసుల సంఖ్య కన్నా.. సమస్య పరిష్కారం అయిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది.
ఒక వేదికపైకి మహిళా అడ్వకేట్స్..
న్యాయవాద వృత్తిలో కొనసాగాలంటే కచ్చితంగా టైం కేటాయించాలి. కోర్టుకు వెళ్లడమే కాదు.. ఆఫీస్ నిర్వహించాలి. సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు న్యాయవ్యవస్థలో వస్తున్న మార్పులను, కొత్తకొత్త తీర్పులను తెలుసుకోవాలి. నిరంతరం ప్రపంచాన్ని శోధించాలి. ఐపిసి సెక్షన్స్ మాత్రమే కాదు..డ్రాఫ్టింగ్లోనూ ప్రతిభ కావాలి. పొద్దున కోర్టు, సాయంత్రం ఆఫీస్ చూసుకునేంత టైం కేటాయించగలగాలి. ఇన్ఫ్ర్మేషన్ షేరింగ్ ఉండాలి. చాలామంది మహిళా న్యాయవాదులు చట్టాలపై ఎంత అవగాహన ఉన్నా.. న్యాయవాదులుగా రాణించలేక.. సరైన ఆదాయం రాక ఎంతో కష్టపడి చదివి సంపాదించుకున్న లా డిగ్రీకి ఫ్రేమ్ కట్టేస్తారు. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్న మహిళా న్యాయవాదులు కూడా కేసులు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ పరిష్కరించేలా మహిళాన్యాయవాదుల కోసం ప్రత్యేకంగా, వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చేలా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేస్తున్నాం. లేటెస్ట్ ఇన్ఫ్ర్మేషన్ షేరింగ్‌తో పాటు.. వినోదకార్యక్రమాలు నిర్వహిస్తాం.
- వి.యశోద