Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అబ్బాయి తెచ్చినా, అమ్మాయి తెచ్చినా... స్వర్ణ పతకం.. స్వర్ణ పతకమే కదా' అంటాడు దంగల్ హీరో! పురుషాధిపత్యాన్ని బద్దలు కొడుతూ.. అమ్మాయిలపై వివక్షకు అంతం పలుకుతూ ఆయన తీసుకున్న నిర్ణయం తరువాత తన కూతుళ్ల జీవితాలనే కాదు.. మొత్తం భారతదేశంలోని చాలామంది అమ్మాయిల భవిష్యత్‌ను మార్చేసింది. ఉత్తరాఖండ్‌లోనూ అలాంటి ఓనిజమైన హీరో ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆయన కూతురును రెజ్లింగ్‌కు పంపలేదు. న్యాయస్థానంలోని అత్యున్నత స్థానంలో తన కూతురు నిల్చోవాలని కలలు కన్నాడు. ఆ కలలను కూతురు నిజం చేసింది. తండ్రి ఆటోనడిపి సంపాదించిన డబ్బే ఆ కుటుంబానికి ఆదాయం. పైగా నలుగురు పిల్లలు. అలా అని ఆ తండ్రి పిల్లల్ని చదివించకుండా వదిలేయలేదు. తిండికోసం కష్టమైనా సరే సంపాదనంతా పిల్లల చదువులకే పెట్టారు. అదే వాళ్ల భవిష్యత్తును మారుస్తుందని ఆయన నమ్మకం. ఆ నమ్మకం నిజమేనని ఆయన మూడో సంతానమైన పూనమ్ టోడి నిరూపించింది. ఉత్తరాఖండ్‌లో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (జుడీషియల్)లో ఆమె రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పూనమ్ తండ్రి అశోక్ టోడి ఆటో నడుపుతూ రోజుకు నాలుగొందల నుంచి ఐదొందల రూపాయలు సంపాదిస్తే... కుటుంబంలోని ఆరుగురి పొట్ట నిండాలి. పైగా ఇద్దరమ్మాయిలూ, ఇద్దరబ్బాయిలు. అయితే ఎప్పుడూ అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో తారతమ్యాలు చూపలేదు. పెంపకం దగ్గరనుంచి చదివించడం వరకు ఆయన ఎలాంటి వివక్ష కనబరచలేదు. మొదట్లో వారికో చిన్న కిరాణా దుకాణం ఉండేది. దాంతో వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. అందుకే డెహ్రాడున్‌కు వచ్చి ఆటో నడపడం మొదలెట్టాడు పూనమ్ తండ్రి. పిల్లల లక్ష్యాలకు డబ్బు అనేది సమస్య రాకుండా పెంచాలనుకున్నాడు. తానెంత కష్టపడ్డా... పిల్లలను మాత్రం బాగా చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగా పూనమ్ ఇంటర్ తర్వాత బీకామ్‌లో చేరింది. కానీ ఆమెకు న్యాయవ త్తి మీద ఆసక్తి ఉండడంతో డిగ్రీ తర్వాత ఎల్ఎల్బి ఎంచుకుంది. వెంటనే సివిల్స్ జ్యుడీషియల్ పరీక్షలకు సన్నద్ధం అవ్వడం ప్రారంభించింది. రెండు సార్లు పరీక్ష రాసినా ఇంటర్వ్యూలో చుక్కెదురయ్యింది. అయినా పట్టువదలకుండా 2016 లోనూ పరీక్ష రాసింది. ఈసారి ఊహించని రీతిలో మొదటి ర్యాంకు సంపాదించింది. నిజానికి పూనమ్... తన చదువు పూర్తి కాగానే ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంది. కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. కానీ పూనమ్ తండ్రి అందుకు అంగీకరించలేదు. ఉద్యోగం చెయ్యమని ఎప్పుడూ ఆమెను అడగలేదు. సరి కదా... ఇంకా చదువుతానన్నా కూడా ఆయన అడ్డు చెప్పలేదు. అలా కుటుంబ సహకారంతోనే ఎమ్‌కామ్, ఎల్ఎల్బీ పూర్తి చేయగలిగింది. రెండు సార్లు ఓడిపోయినా తల్లిదండ్రులెప్పుడూ ఆమెను నిరుత్సాహ పరచలేదు. సాధించగలవంటూ పూనమ్ వెన్ను తట్టారు. ఆ ప్రోత్సాహమే ఆమెకు విజయం వరించేలా చేసింది. న్యాయస్థానంలోని ఉన్నత పదవి 'జడ్జి'ని అలంకరించేలా చేసింది. పూనమ్ కష్టం... కుటుంబం అందించిన సహకారం.. ఎంతోమంది అమ్మాయిలకు, వారి కుటుంబాలకు స్ఫూర్తిదాయకం!